సాక్షి, హైదరాబాద్: ఆహారం, నీళ్లలో జరిగే కల్తీని అరికట్టేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో తమ సంస్థ రూపొందించిన కిట్‌లను గురువారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ ఆవిష్కరిస్తున్నట్టు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) ఒక ప్రకటనలో తెలిపింది. బయో సర్వ్ బయో టెక్నాలజీ అనే సంస్థతో ఒప్పందం చేసుకుని కిట్‌లను రూపొందించామని, ఆహారం, నీళ్లలో ఉన్న వివిధ రకాల బ్యాక్టీరియాను ఈ కిట్‌ల ద్వారా తెలుసుకోవచ్చునని, తక్కువ ధరకే ఇవి లభ్యమవుతాయని పేర్కొంది.
అంతేకాకుండా రక్త సేకరణ, నిల్వ, రవాణా సంబంధిత ఖర్చులను భారీగా తగ్గించే మరొక రక్త పరీక్షా కిట్‌ను కూడా అభివృద్ధి చేసినట్టు ఎన్‌ఐఎన్ తెలిపింది. దీనిద్వారా రక్తంలో విటమిన్ ‘ఎ’ స్థితి సులభంగా తెలుసుకోవచ్చు. డెంగీ జ్వర నిర్ధరణకు చేసే ఎలీసా రక్త పరీక్షా విధానంలోని సీరమ్‌లోని ఇనుము శాతాన్ని కనుగొనే విధానాన్ని కూడా అభివృద్ధి చేశామని, ఈ కిట్‌ల వల్ల తక్కువ ఖర్చుతో ఫలితాలను తెలుసుకోవచ్చునని వివరించింది.
నేడు ఢిల్లీలో ఎన్‌ఐఎన్ కిట్‌ల ఆవిష్కరణ
Published Thu, Feb 20 2014 4:45 AM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM
Advertisement
Advertisement