National Institute of Nutrition
-
నాస్ ఫెలోగా NIN సైంటిస్ట్ భానుప్రకాష్
జాతీయ వ్యవసాయ అకాడమీ(National Academy of Agricultural Sciences) ఫెలోగా జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) సీనియర్ శాస్త్రవేత్త, బయోకెమిస్ట్రీ విభాగం సారథి డాక్టర్ భానుప్రకాష్ రెడ్డి ఎంపికయ్యారు. పోషకాహార రంగంలో భానుప్రకాష్ చేసిన విస్తృతపరిశోధనలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవకాశం దక్కిందని ఎన్ఐఎన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.మనిషికి ఎంత పోషకాహారం కావాలి? పోషకాహార లోపాలు, నిత్యం ఉపయోగించే వంట దినుసులతో అనేక వ్యాధులను ఎలా దరిచేరకుండా చూసుకోవచ్చనే అంశాలపై భానుప్రకాష్ దశాబ్దాలుగా పరిశోధనలు నిర్వహిస్తున్నారు. వంట దినుసులతో మధుమేహాన్ని(Diabetes) ఎలా దరిచేరకుండా చూసుకోవచ్చనే దానిపై విజయవంతంగా పరిశోధనలు నిర్వహించారు. అంతేకాదు.. జాతీయ, అంతర్జాతీయంగా 250 పరిశోధనా వ్యాసాలను ప్రచురించారు. ఐసీఎంఆర్-బసంతి దేవి అవార్డుతో పాటు పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను భానుప్రకాష్ అందుకున్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదకర స్థాయిలో ఊబకాయ సమస్య!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఊబకాయం, అధిక బరువు సమస్య ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) నిర్వహించిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. పట్టణ/నగర ప్రాంతాల్లో మాత్రమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ సమస్య ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. జనాభాలోని పలు వర్గాల నుంచి సమాచారం సేకరించి జరిపిన ఈ అధ్యయనం వివరాలు అంతర్జాతీయ జర్నల్ ‘న్యూట్రియంట్స్’లో ప్రచురితమయ్యాయి. వేర్వేరు వయసుల వారిలో పోషకాల స్థాయి, ఆ స్థాయుల్లో ఉండేందుకు గల కారణాలను ఈ అధ్యయనం ద్వారా అర్థం చేసుకున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ శుక్రవారం తెలిపింది. అధ్యయనంలో భాగంగా హైదరాబాద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని నాలుగు గ్రామాల నుంచి మొత్తం 10,350 మంది వ్యక్తులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఇందులో 8317 మంది తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిన వారు. మధుమేహం, రక్తపోటు సమస్యలూ... నగర ప్రాంతాల్లో దాదాపు 47.7 శాతం పెద్దలు ఊబకాయంతో బాధపడుతూండగా.. 14.8 శాతం మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. పల్లెల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఊబకాయం సమస్య 46.7 శాతం ఉంది. అధికబరువు సమస్య తెలంగాణ నగర ప్రాంతాల్లో మాదిరిగానే 14.8 శాతం నమోదైంది. ఈ రెండు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో వయసు తేడా తెలంగాణలో 50.6 శాతమైతే.. ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో 33.2 శాతం మంది ఉన్నారు. అంతేకాదు.. అధ్యయనంలో పాల్గొన్న హైదరాబాదీల్లో 11 శాతం మంది అధిక రక్తపోటు సమస్యను కూడా ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య ఆరు శాతం మాత్రమే. ఇరు ప్రాంతాల్లోనూ సమానంగా ఉన్న ఇంకో సమస్య మధుమేహం. హైదరాబాద్, చిత్తూరు జిల్లాలోని నాలుగు గ్రామీణ ప్రాంతాల్లోని వారిలో 5 శాతం చొప్పున మధుమేహులు ఉన్నట్లు తెలిసింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అధ్యయనంలో పాల్గొన్న 40 - 59 మధ్య వయస్కుల్లో అధికులు క్లరికల్ ఉద్యోగాల్లో లేదంటే కొద్దిపాటి నైపుణ్యం ఉన్న వృత్తుల్లో ఉన్నవారే. ఈ రకమైన వృత్తులు, ఉద్యోగాల్లో ఉన్న వారికి ఇతరులతో పాలిస్తే ఊబకాయం సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. ‘‘అధ్యయనంలో పాల్గొన్న వారు కొంతమందిలో అవసరమైన దానికంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయి. ఆహారం, పర్యావరణం, శారీరక శ్రమ లేకపోవడం, వంటివి ఇందుకు కారణం కావచ్చు. చాలామందిలో ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయమాల ప్రాధాన్యత కూడా తెలియదు’’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ సమరసింహా రెడ్డి తెలిపారు. ‘‘నగర, గ్రామీణ ప్రాంతాల మధ్య తేడా పెద్దగా లేకపోవడం ఈ అధ్యయనంలో చాలా ఆసక్తికరమైన విషయం. పైగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఊబకాయం సమస్య ఎక్కువ ఉన్న సూచనలు కనిపించాయి.’’ అని చెప్పారు. జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత మాట్లాడుతూ...‘‘విచిత్రమైన విషయం ఏమిటంటే.. పెద్దవాళ్లలో ఊబకాయం, అధిక బరువు సమస్యలుంటే... చిన్నవాళ్లలో పోషకాహార లేమి కనిపించడం. అది కూడా జాతీయ స్థాయి సగటుకు దగ్గరగా ఉండటం విశేషం." అని చెప్పారు. -
‘ఐటీ’కి మెటబాలిక్ సిండ్రోమ్!
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సగం మందిలో మెటబాలిక్ సిండ్రోమ్ సమస్య కనిపిస్తోందని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) పేర్కొంది. ఉద్యోగ హడావుడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. మధుమేహం, తీవ్ర రక్తపోటు, గుండె జబ్బుల బారినపడుతున్నారని తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించింది. ఐటీ కంపెనీలు ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని.. సరైన పోషకాహారం తీసుకునేలా చూడటంతోపాటు వ్యాయామాలు చేయించడం, ఒత్తిడిని తగ్గించే కార్యక్రమాలను చేపట్టడం మంచిదని సూచించింది. –సాక్షి హైదరాబాద్ ఐసీఎంఆర్ నేతృత్వంలో.. భారతీయ వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్) నేతృత్వంలో ఎన్ఐఎన్ ఈ అధ్యయనం నిర్వహించింది. దేశంలో ప్రముఖ ఐటీ హబ్ అయిన హైదరాబాద్‌లో పెద్ద, మధ్య తరహా, చిన్న ఐటీ కంపెనీల్లో విస్తృత స్థాయిలో అధ్యయనం నిర్వహించింది. ఉద్యోగాల తీరుతెన్నులు, వాటిలో పనిచేస్తున్నవారి ఆహార అలవాట్లు, జీవనశైలి, వారి ఆరోగ్యం వంటి వివరాలను సేకరించి విశ్లేషించింది. వారిలో 46శాతం మందికిపైగా మెటబాలిక్ సిండ్రోమ్ బారినపడినట్టు గుర్తించింది. చాలా మందిలో హెచ్‌డీఎల్ (మంచి) కొవ్వులు తక్కువగా ఉండటం, రక్తపోటు, నడుము చుట్టుకొలత వంటివి ఎక్కువగా ఉండటాన్ని గమనించింది. ఐటీ ఉద్యోగులు రోజులో కనీసం ఎనిమిది గంటల పాటు కూర్చునే ఉంటున్నారని.. 22 శాతం మంది మాత్రమే వారానికి కనీసం 150 నిమిషాల శారీరక వ్యాయామం చేయాలన్న సూత్రాన్ని పాటిస్తున్నారని తేల్చింది. వ్యాయామం లేకపోవడం, తీవ్ర ఒత్తిడి, పోషకాలు లేని జంక్ ఫుడ్ తీసుకోవడం వంటివి శరీరంలో ఇన్ఫ్లమేషన్కు కారణం అవుతున్నాయని.. ఇది కాలం గడిచిన కొద్దీ మెటబాలిక్ సిండ్రోమ్‌కు దారితీస్తోందని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న ఉద్యోగుల సగటు వయసు 30 ఏళ్లు మాత్రమేనని.. చిన్నవయసులోనే సమస్యల బారినపడుతున్నారని వివరించారు. ఏమిటీ మెటబాలిక్ సిండ్రోమ్! మన శరీరంలో క్రమంకొద్దీ జరగాల్సిన జీవక్రియల్లో తేడాలు రావడం, లోపాలు చోటు చేసుకోవడమే మెటబాలిక్ సిండ్రోమ్. ఊబకాయం, ట్రైగ్లిజరైడ్స్, హెచ్‌డీఎల్, రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు.. అనే ఐదు ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్లను బట్టి దీన్ని నిర్ధారిస్తారు. నడుము చుట్టుకొలత, అధిక బరువు ఊబకాయాన్ని సూచిస్తాయి. వైద్య నిపుణుల సూచనల ప్రకారం.. నడుము చుట్టుకొలత పురుషుల్లోనైతే 90 సెంటీమీటర్లకన్నా, మహిళలకు 80 సెంటీమీటర్లకన్నా ఎక్కువగా ఉండటం ఊబకాయానికి సూచిక. ఇక రక్తంలో ట్రైగ్లిజరైడ్లు 150ఎంజీ/డెసిలీటర్ కంటే ఎక్కువ ఉండటం అనారోగ్యకరం. ఆరోగ్యకరమైన కొవ్వులైన హెచ్‌డీఎల్ (హైడెన్సిటీ లిపిడ్స్) పురుషుల్లోనైతే 40 ఎంజీ/డెసిలీటర్ కంటే, మహిళల్లో 50 ఎంజీ/డెసిలీటర్ కంటే ఎక్కువగా ఉండాలి. రక్తపోటు 135/85 కన్నా తక్కువగా ఉండాలి. కనీసం ఎనిమిది గంటలకన్నా ఎక్కువ సమయం ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉన్నాక రక్తంలో గ్లూకోజు స్థాయిలు 100 ఎంజీ/డెసిలీటర్ కన్నా తక్కువగా ఉండాలి. ఈ ఐదింటిలో ఏ మూడు వ్యతిరేకంగా ఉన్నా.. సదరు వ్యక్తులు మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యను ఎదుర్కొంటున్నట్టేనని వైద్యులు చెప్తున్నారు. జీవన శైలిలో మార్పులే పరిష్కారం మెటబాలిక్ సిండ్రోమ్‌కు గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు చెప్తున్నారు. తరచూ బయటి ఆహారం (ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్) తినడం తగ్గించుకోవాలని.. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలని, వీలైనంత వరకూ కాయగూరలు, పండ్లు తినాలని సూచిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు చాలామంది సమయానికి ఆహారం తీసుకోవడం లేదని వెల్లడైందని అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.సుబ్బారావు గవరవరపు తెలిపారు. దీనికితోడు ఒత్తిడికి లోనవుతుండటం మెటబాలిక్ సిండ్రోమ్‌కు గురయ్యేందుకు దారితీస్తోందని వివరించారు. అధ్యయనంలో పాల్గొన్న వారి సంఖ్య తక్కువే అయినా.. సగటున అందరు ఉద్యోగుల జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి దాదాపు ఒకేలా ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఈ సమస్య నుంచి ఐటీ ఉద్యోగులు బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యలనివేదికను ఎన్ఐఎన్ శాస్త్రవేత్త భానుప్రకాశ్‌రెడ్డితో కలసి సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. న్యూట్రియంట్స్’ఆన్లైన్ జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. -
బీపీ, షుగర్ రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్త
-
రక్తహీనత నివారణకు సమగ్ర ప్రణాళిక: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రక్తహీనత సమస్య నివారణకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) శాస్త్రవేత్తలను కోరారు. పాఠశాల విద్యార్థుల్లో రక్తహీనత పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్.. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దాన్ని నివారించాలని కోరారు. రక్తహీనత నివారణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించేందుకు గవర్నర్ సోమవారం ఎన్ఐఎన్ను సందర్శించారు. దేశ భవిష్యత్ అయిన విద్యార్థుల్లో రక్తహీనత సమస్య కొనసాగడం సరికాదని శాస్త్రవేత్తలతో అన్నారు. ఈ ఏడా దిని చిరుధాన్య సంవత్సరంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసిన గవర్నర్.. వాటి ద్వారా పోషకాహార లోపాలను అధిగమించవచ్చన్న విషయాన్ని ప్రచారం చేయాలని సూచించారు. -
నిన్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. అప్లై చేయండి
హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(నిన్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 24 ► పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్కర్లు–13, ప్రాజెక్ట్ టెక్నీషియన్లు–04, ప్రాజెక్ట్ ఫీల్డ్ అటెండెంట్–07. ► ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్కర్లు: అర్హత: సైన్స్ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్/బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: నెలకు రూ.18,000 చెల్లిస్తారు. ► ప్రాజెక్ట్ టెక్నీషియన్లు: అర్హత: సైన్స్ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా(ఎంఎల్టీ)ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: నెలకు రూ.18,000 చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ప్రాజెక్ట్ ఫీల్డ్ అటెండెంట్: అర్హత: హైస్కూల్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఫీల్డ్‌లో అనుభవంతోపాటు తెలుగు తెలిసి ఉండాలి. వయసు: 25ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: నెలకు రూ.15,800 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, ఐసీఎంఆర్–నిన్, తార్నాక, హైదరాబాద్–500007. ► దరఖాస్తులకు చివరితేది: 02.02.2022 ► వెబ్సైట్: nin.res.in -
60% పెద్దల్లో యాంటీబాడీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు 60.1 శాతం పెద్దల్లో కరోనా వైరస్‌కు విరుగుడుగా యాంటీబాడీలు తయారైన్నట్లు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ప్రకటించింది. పిల్లల్లో ఇది 55 శాతంగా నమోదైనట్లు తెలిపింది. కౌమార వయస్కుల విషయానికి వస్తే 61 శాతం మంది, ఆరోగ్య కార్యకర్తల్లో 82.4 శాతం మందిలోనూ యాంటీబాడీలు ఉన్నాయని వివరించింది. అయితే వారిలో చాలా మంది టీకాలు వేయించుకుని ఉండ టం కూడా ఎక్కువ శాతం మందిలో యాం టీబాడీల ఉండేందుకు కారణమై ఉండొచ్చని అభి ప్రాయపడింది. ఈ మేరకు నాలుగో విడత సెరో సర్వే వివరాలను ప్రకటించింది. క్రమంగా పెరుగుదల... కరోనా వ్యాప్తిని అర్థం చేసుకోవడంలో భాగంగా ఐసీఎంఆర్ ఒకే ప్రాంతంలో పలు దఫా లుగా సెరో సర్వే నిర్వహించింది. తొలి సర్వే గతే డాది మేలో జరగ్గా రెండు, మూడు సర్వేలు ఆగస్టు, డిసెం బర్లలో చేపట్టింది. తాజాగా ఈ ఏడాది జూన్‌లో నాలుగో సర్వే జరిగింది. తొలి మూడు సర్వేల్లో పాజిటివిటి వరుసగా 0.33 శాతం, 12.5 శాతం, 24.1 శాతంగా నమోదైంది. జాతీయ స్థాయిలో సెరో పాజిటివిటీ గతేడాది డిసెంబర్ నాటికి 24 శాతం ఉంటే ఈ ఏడాది జూన్‌కు అది 67 శాతానికి ఎగబాకింది. ఇదే కాలానికి తెలంగాణలో కొంచెం తక్కువగా (24 శాతం నుంచి 60.1 శాతం) ఉం డటం విశేషం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తెలంగాణలో టీకాలు వేయించుకోని వారిలోనూ సెరో పాజిటివిటీ 51.3 శాతంగా ఉండటం. ఒక డోసు తీసుకున్న వారిలో ఇది 78.5 శాతం ఉండగా రెండో డోసూ పూర్తి చేసుకున్న వారిలో 94 శాతంగా ఉంది. -
విటమిన్–ఏ లోపం తగ్గింది.. డేంజర్ బెల్స్
సాక్షి, హైదరాబాద్: అంధత్వ నివారణ కోసం దేశంలో ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలకు విటమిన్–ఏ సప్లిమెంట్లు ఇచ్చే విషయంపై సమీక్ష జరగాలని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ సూచించింది. దశాబ్దాల కింద ప్రారంభించిన విటమిన్–ఏ సప్లిమెంటేషన్ కార్యక్రమం సత్ఫలితాలిచ్చిందని, ఇప్పుడు విటమిన్–ఏ లోపం ప్రజారోగ్య సమస్య కాదని పేర్కొంది. బెంగళూరులోని సెయింట్ జాన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఢిల్లీలోని సీతారామ్ భార్తియ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్‌తో కలసి నిర్వహించిన అధ్యయనం ద్వారా ఈ విషయం స్పష్టమైందని ఓ ప్రకటనలో తెలిపింది. భారతీయ బాలల్లో విటమిన్–ఏ లోపం ప్రమాదం 20 శాతం కంటే తక్కువకు చేరిందని వివరించింది. ఐదేళ్ల వయసు వచ్చే వరకు 6 నెలలకోసారి భారీ మొత్తంలో విటమిన్–ఏ ఇచ్చే ప్రస్తుత పద్ధతిని కొనసాగిస్తే హైపర్ విటమినోసిస్ (అవసరానికి మించి విటమిన్లు) సమస్యకు దారితీయొచ్చని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా ఒకే పద్ధతి కాకుండా.. అవసరాలను బట్టి రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాన్ని చేపట్టొచ్చని సూచించింది. అధ్యయనం వివరాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమయ్యాయని పేర్కొంది. చదవండి: బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ తప్పనిసరి -
గ్రామాల్లో రక్తహీనత.. నగరాల్లో ఐరన్ లోపం.. పూర్తి పరిష్కారం?
సాక్షి, హైదరాబాద్: రక్తహీనత సమస్య గ్రామీణ ప్రాంత పిల్లలు, కౌమార వయసు వారిలో ఎక్కువగా కన్పిస్తోందని, నగరాల్లోని పిల్లల్లో మాత్రం ఐరన్ లేమి ఎక్కువగా ఉందని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) అధ్యయనంలో తేలింది. నగరాల్లోని పిల్లల్లో రక్త హీనత సమస్య తక్కువగానే ఉందని వెల్లడైంది. గ్రామీణుల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్నా ఇనుము లేమి సమస్య లేదని స్పష్టమైంది. దేశంలోని పిల్లలు, కౌమార వయసున్న వారిలో రక్తహీనత సమస్యను అధిగమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు.. వ్యాధులు, పోషణ లేమితో విజయవంతం కాలేకపోతున్నాయని వెల్లడైంది. దేశంలోని మహిళలు, పిల్లలు 40–50 శాతం మంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటుండగా.. పరిష్కారం కోసం జరుగుతున్న ప్రయత్నాలను సమీక్షించాల్సిన అవసరం ఈ అధ్యయనం కల్పిస్తోందని ఎన్ఐఎన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. మంచి ఆహారం కీలకం.. రక్తంలో ఇనుము మోతాదు చాలా తక్కువగా ఉంటే రక్తహీనత వచ్చిందని చెబుతుంటారు. ఈ లెక్కన చూస్తే దేశంలోని దాదాపు 50 శాతం మందిలో ఈ సమస్య ఉండాలి. అయితే రక్తంలోని ఇనుము మోతాదును గుర్తించేందుకు అయ్యే పరీక్షలు చాలా ఖరీదైనవి. జనాభా స్థాయిలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు. ఈ కారణంగానే రక్తంలోని హిమోగ్లోబిన్‌ను లెక్కించడం ద్వారా ఇనుము లోపాన్ని పరోక్షంగా గుర్తించి రక్తహీనతపై అంచనాకు వస్తారు. ‘రక్తహీనత ఎక్కువగా ఉన్నట్లు సర్వేల ద్వారా తెలిస్తే.. ఇనుము సప్లిమెంట్లు, ఇనుము కలిగిన ఆహారం ఇవ్వడం ద్వారా సమస్యను అధిగమించే ప్రయత్నం జరుగుతుంది. కానీ తాజా అధ్యయనం ప్రకారం చూస్తే సమస్య పూర్తిగా పరిష్కారం అవుతున్నట్లు కన్పించట్లేదు’అని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 33 వేల మంది పిల్లలు, కౌమారులపై ఈ అధ్యయనం జరిగింది. ‘రక్తంలో హిమోగ్లోబిన్ తయారయ్యేందుకు నాణ్యమైన ఆహారం చాలా కీలకం. పండ్లు, జంతు సంబంధిత ఆహారం తక్కువగా తీసుకుంటుండటం వల్ల గ్రామీణుల్లో, పేదల్లో హిమోగ్లోబిన్ తయారీ సక్రమంగా జరగట్లేదు. ఇనుముతో పాటు అనేక ఇతర పోషకాలు హిమోగ్లోబిన్ తయారీకి అవసరమవుతాయి’అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ భారతీ కులకర్ణి తెలిపారు. (చదవండి: కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అనూప్ చంద్ర) -
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 06 » పోస్టుల వివరాలు: సైంటిస్ట్–సి(మెడికల్)–01,అడ్మిన్ అసిస్టెంట్ (మల్టిపర్సన్)–01, రీసెర్చ్ అసిస్టెంట్–01, ప్రాజెక్ట్ టెక్నీషియన్–3(ల్యాబ్ టెక్నీషియన్)–01, డేటా ఎంట్రీ ఆపరేటర్–01, అటెండెంట్–01. » సైంటిస్ట్–సి(మెడికల్): అర్హత: ఎంబీబీఎస్, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ(ఎండీ / ఎంఎస్/ డీఎన్బీ) ఉత్తీర్ణతతో పాటు ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 40 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.75,000 చెల్లిస్తారు. » అడ్మిన్ అసిస్టెంట్(మల్టిపర్సన్): అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు అకౌంట్స్/అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 30ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.31,000 చెల్లిస్తారు. » రీసెర్చ్ అసిస్టెంట్: అర్హత: బయోకెమిస్ట్రీ/ నర్సింగ్/పబ్లిక్ హెల్త్ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.31,000 చెల్లిస్తారు. » ప్రాజెక్ట్ టెక్నీషియన్–3(ల్యాబ్ టెక్నీషియన్): అర్హత: సైన్స్ సబ్జెక్టుల్లో ఇంటర్మీ డియట్ ఉత్తీర్ణతతో పాటు మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్లో రెండేళ్ల డిప్లొమా ఉండాలి. సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.25,000 చెల్లిస్తారు. » డేటా ఎంట్రీ ఆపరేటర్: అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. డేటా ఎంట్రీలో మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.20,000 చెల్లిస్తారు. » అటెండెంట్: అర్హత: హైస్కూల్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ల్యాబ్/ఫీల్డ్ వర్క్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 25 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు. » పని ప్రదేశం: ఎంఆర్హెచ్ఆర్యూ, చంద్రగిరి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. » ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. » దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. » దరఖాస్తులకు చివరి తేది: 15.03.2021 » వెబ్సైట్: https://www.nin.res.in/ హెచ్‌పీసీఎల్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి -
అంతుచిక్కని వ్యాధిపై లోతైన పరిశోధన
సాక్షి, అమరావతి: ‘2020 డిసెంబర్లో జరిగిన ఏలూరు ఘటనపై విభన్న కోణాల్లో పరిశోధన జరిగింది. వివిధ జాతీయ సంస్థలు మూర్ఛకు కారణాలను అన్వేషించి, నివేదికలిచ్చాయి. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మూర్ఛ లక్షణాలతో సొమ్మసిల్లి పడిపోవడం అనేది బాక్టీరియా లేదా వైరస్వల్ల కాదని తేలింది. నీటి నమూనాలను పరీక్షించగా, క్రిమిసంహారక మందుల అవశేషాలు కలిశాయని స్పష్టమైంది. ఇందులో ఆర్గానో ఫాస్ఫరస్ పెస్టిసైడ్ మూలాలున్నాయని జాతీయ పోషకాహార సంస్థ చెప్పింది. ఢిల్లీలోని ఎయిమ్స్ లాంటి సంస్థ ఆర్గానో ఫాస్ఫరస్ వల్ల మూర్ఛ రావచ్చని.. కానీ, తాము సేకరించిన నమూనాల్లో దాని మూలాల్లేవని చెప్పింది. అందుకే అన్ని సంస్థల అభిప్రాయాలను క్రోడీకరించాక ఆర్నెల్లపాటు లోతైన పరిశోధన చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం మూడు జాతీయ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం’.. అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఏలూరు ఘటనపై మంత్రి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏలూరులో 600 మందికి పైగా అంతుచిక్కని వ్యాధితో బాధితులు నమోదైతే ఒక్క ప్రాణనష్టం కూడా లేకుండా చేశామన్నారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తదితరులు కూడా పాల్గొన్నారు. నేటి నుంచి రెండో విడత కోవిడ్ వ్యాక్సిన్ రాష్ట్రంలో రెండో విడత కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇటీవల వ్యాక్సిన్ తీసుకున్నాక చనిపోయిన ఆశా వర్కర్ కుటుంబానికి మంగళవారం రూ.50 లక్షలు అందించామన్నారు. ఒంగోలు ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు డా.ధనలక్ష్మికి మెరుగైన వైద్యం అందించేందుకు చెన్నె అపోలో ఆసుపత్రికి తరలించామని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. -
అన్నం తక్కువ తిందాం..!
సాక్షి, హైదరాబాద్: తిండి కలిగితే కండ కలదోయ్... కండకలవాడేను మనిషోయ్.. అన్నాడు కవి గురజాడ. అలాగని ఏది పడితే అది తింటే అనారోగ్యానికి దారితీసే అవకాశాలే ఎక్కువ. ప్రస్తుతం దేశంలో మెజార్టీ జనాలు ప్రొటీన్లు, విటమిన్లు ఉండే ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకుంటూ.. కొవ్వులు, గ్లూకోజ్‌లు అధికంగా ఉండే పదార్థాలను ఎక్కువగా లాగించేస్తున్నారు. దీంతో శరీర సౌష్టవం దెబ్బతినడంతో పాటు అనారోగ్యానికి దారితీస్తోంది. దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలను వేరుగా విభజించి ప్రజల ఆహారపు అలవాట్లపై నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సంయుక్తంగా పరిశీలన చేశాయి. అనవసరమైన, శరీరానికి భారమయ్యే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నట్లు గుర్తించాయి. ఈ క్రమంలో ఏయే పదార్థాలను ఎంత మోతాదులో తింటే మేలు అన్న దానిపై ఎన్ఐఎన్, ఐసీఎంఆర్ పలు సూచనలు చేశాయి. అలాగే వీటన్నింటినీ వివరిస్తూ ‘వాట్ ఇండియా ఈట్స్’ నివేదికను విడుదల చేశాయి. పరిశీలన సాగిందిలా... దేశాన్ని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్, నార్త్ ఈస్ట్‌గా విభజించి అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు, తీసుకుంటున్న విధానాన్ని 24 గంటల(ఒక రోజు)ను ఒక యూనిట్ గా పరిగణించి పరిశీలన చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు భిన్న ఆహారపు అలవాట్లున్నా... తీసుకునే విధానం మాత్రం సరిగా లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో గోధుమ రొట్టెలను, దక్షిణాది రాష్ట్రాల్లో అన్నం, జొన్న రొట్టెలు అధికంగా> తింటున్నారు. దీంతో ప్రొటీన్ల కంటే గ్లూకోజు అధికంగా పోగవుతూ.. క్రమంగా కొవ్వుల రూపంలోకి మారి అనారోగ్యానికి కారణమవుతోంది. దేశవ్యాప్తంగా తృణ, చిరుధాన్యాల వినియోగం అధికంగా ఉంది. పప్పులను తక్కువగా, మాంసాహారాన్ని మోతాదులోనే భుజిస్తున్నారు. పాల ఉత్పత్తులతో పాటు కాయగూరలు, పండ్లు, గింజలను తక్కువగా తీసుకుంటున్నారు. దుంపలను ఎక్కువగా తీసుకుంటుండగా... పట్టణ ప్రాంతాల్లో కొవ్వు పదార్థాల వినియోగం అధికంగా ఉంది. ‘మై ప్లేట్ ఫర్ ది డే’ మెనూ ప్రకారం ఒక వ్యక్తికి రోజుకు సగటున 2 వేల కిలో కెలోరీల ఆహారం సరిపోతుంది. దీన్ని సరైన మోతాదులో తీసుకోవడం, వ్యాయామంతో శరీర సౌష్టవం, చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని ఎన్ ఐఎన్ సూచిస్తోంది. రోజువారీగా ఏయే పదార్థాలు ఎంత శాతం తీసుకోవాలన్న దానిపై ఒక మెనూను రూపొందించి ‘మై ప్లేట్ ఫర్ ది డే’ పేరు పెట్టింది. ఇందులో 40% ఆహారంగా బియ్యం లేదా గోధుమలు, మొక్కజొన్నతో పాటు తృణ ధాన్యాలైన జొన్నలు, రాగులు, అరకలు, సజ్జలతో వండిన పదార్థాలు కూడా తీసుకోవాలి. 11% పప్పులు, 6% మాంసాహారం, 10% పాలు లేదా పెరుగు, 5% కాయగూరలు, 3% పండ్లు, 8% బాదం, ఖాజు, పల్లీ తదితర నట్స్ తినాలి. కొవ్వు లేదా నూనె పదార్థాలను 12% తీసుకోవాలి. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా సగటు మనిషి ప్రామాణిక బరువును ఐదు కిలోలు పెంచగా, మనిషికి కావాల్సిన కేలరీలను వారి శ్రమ ఆధారంగా పోలుస్తూ మార్పులు చేశారు. ► పప్పుదినుసులతో చేసిన ఆహారానికి బదులుగా గుడ్లు, మాంసం, చేపలను అదే మోతాదులో తీసుకోవచ్చు. ► పండ్లను జూస్‌ల రూపంలో కాకుండా నేరుగా తినేలా తీసుకోవాలి. ► కొవ్వులు, నూనె పదార్థాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నిత్యం ఒకే రకమైన నూనె పదార్ధాలు కాకుండా వేరువేరుగా తీసుకోవాలి. ► ఊబకాయం ఉన్నవారు, లేదా బరువు తగ్గాలనుకున్న వారు బియ్యం, గోధుమ తదితర ధాన్యాలతో చేసిన పదార్థాలను తగ్గించాలి. -
ఈ తిండి కలిగితే కండ కలదోయ్!
సాక్షి, హైదరాబాద్: రోజూ తినేదే కదా అని ఏదిపడితే అది తింటే ఆరోగ్యం మాట దెవుడెరుగు.. అనారోగ్యాలు ముసురుకుంటాయి. ఆహారాన్ని క్రమపద్ధతిలో, అవసరమైన కేలరీల మేరకు తీసుకుంటే రోగాలు దరిచేరవు. మనిషి రోజూ ఎలాంటి ఆహారాన్ని, ఎంత మేరకు తీసుకోవాలనే విషయంలో ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్), ఎన్ఐఎన్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్) సంస్థలు ప్రత్యేక మెనూ రూపొందించాయి. ‘మై ప్లేట్ ఫర్ ది డే’పేరిట రూపొందించిన ఈ మెనూలో ఏయే పదార్థాలు ఎంత మోతాదులో తీసుకోవాలో స్పష్టం చేశాయి. నిర్దేశించిన మేర ఆహార పదార్థాలను తీసుకుంటే ఔషధాలు వాడాల్సిన పనిలేదని, వ్యాధుల బారినపడే పరిస్థితి రాదని, పోషక లోపాలను అధిగమించవచ్చని అంటున్నాయి. రోజుకు 2,000 కిలో కేలరీలు ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ రూపొందించిన ‘మై ప్లేట్ ఫర్ ది డే’ప్రకారం రోజూ 2,000 కిలో కేలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇందులో 45శాతం ఆహారంగా బియ్యం లేదా గోధుమలు, మొక్కజొన్నతో పాటు తృణ ధాన్యాలైన జొన్నలు, రాగులు, అరకలు, సజ్జలతో వండిన పదార్థాలు ఉండాలి. 17శాతం ఆహారంగా పప్పు దినుసులతో చేసిన పదార్థాలు, 10శాతం ఆహారం కింద పాలు లేదా పెరుగు, 5శాతం కూరగాయలు, 3శాతం పండ్లు, 8శాతం ఆహారంగా బాదం, కాజు తదితర వాల్నట్స్ తీసుకోవాలి. కొవ్వు లేదా నూనె పదార్థాలను 12శాతం తీసుకోవాలి. ఇలా చేస్తే ఆరోగ్య‘మస్తు’ శరీరానికి సరిపడినన్ని పోషకాలు, విటమిన్లు, లవణాలు, ఖనిజ పదార్థాలు సమృద్ధిగా ఉన్న ఆహారంతో ‘మై ప్లేట్ ఫర్ ది డే’డిజైన్ చేశారు. దీంట్లో సూచించిన విధంగా ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇతర మందులు, విటమిన్ టాబ్లెట్ల (బూస్ట్, మిల్క్ పౌడర్ తదితరాలు) అవసరం ఉండదు. అంటువ్యాధులు సోకకుండా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ► పప్పుదినుసులతో చేసిన ఆహారానికి బదులు గుడ్లు, మాంసం, చేపలను అదే మోతాదులో తీసుకోవచ్చు. ► పండ్లను రసాల రూపంలో కాకుండా నేరుగా తినడం మంచిది. ► కొవ్వులు, నూనె పదార్థాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నిత్యం ఒకే రకమైన నూనె పదార్థాలు కాకుండా వేర్వేరుగా తీసుకోవాలి. ► ఊబకాయం ఉన్నవారు లేదా బరువు తగ్గాలనుకునే వారు బియ్యం, గోధుమ తదితర ధాన్యాలతో చేసిన పదార్థాలను తగ్గించాలి. ► శరీరానికి, జీర్ణవ్యవస్థకు అవసరమైన కణజాలం, పేగుల్లో అవసరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ► క్రమపద్ధతిలో తీసుకునే ఆహారంతో మూత్రపిండాలు, హృదయ సం బంధ వ్యాధులు దరిచేరవు. ► తీసుకునే ఆహారంలో తగినంత ఫైబర్ ఉంటే, అది మలబద్ధకాన్ని నివారిస్తుంది. ‘మై ప్లేట్ ఫర్ ది డే’ప్రకారం రోజువారీ ఆహారం ఇలా (గ్రాముల్లో) -
అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమ ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) ప్రాంగణంలో ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ), రీసెర్చ్ ఫర్ రీసర్జెన్స్ ఫౌండేషన్ (ఆర్‌ఎఫ్‌ఆర్‌ఎఫ్), ఇతర సంస్థల సహకారంతో నిర్వహించిన ‘‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ డెవలప్మెంట్ డిస్కోర్స్’’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇఫ్లూ వజ్రోత్సవాల సందర్భంగా నిర్మించిన స్మారకాన్ని(పైలాన్) ఆవిష్కరించారు. ప్రకృతితో కలసి జీవించడం భారతీయ సంస్కృతిలో ఉందని, పెద్దలు మన సంప్రదాయాల్లో, ఆరాధనలో ప్రకృతికి ప్రాధాన్యమిచ్చారన్నారు. సామాజిక అభివృద్ధితోపాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు. జనాభాలో ఇప్పటికీ 18 నుంచి 20 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు కంపెనీలు దారిద్య్ర నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పేదరిక నిర్మూలనకు అవసరమైన అన్ని రకాల ప్రయత్నాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. పాఠశాలస్థాయి నుంచే ప్రకృతికి మేలు చేసే విధంగా అభివృద్ధి భావనను విద్యార్థుల్లో కలిగించాలని పేర్కొన్నారు. అభివృద్ధిలో గ్రామాలను అంతర్భాగం చేయాలన్నారు. ప్రతి అభివృద్ధి ప్రణాళిక పరిపూర్ణం అయ్యేందుకు ఐదు ‘‘పి’’లు అవసరమని ఉపరాష్ట్రపతి అన్నారు. పీపుల్(ప్రజలు), ప్రాస్పరిటీ(శ్రేయస్సు), ప్లానెట్ (భూగ్రహం), పీస్(శాంతి), పార్ట్నర్షిప్(భాగస్వామ్యం) అనే ఐదు అంశాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిమార్గంలో ముందుకు పోవాలని ఆయన సూచించారు. స్థిరమైన ఆర్థికవృద్ధే సమాజాభివృద్ధి జీడీపీ, వినియోగం, మానవ అభివృద్ధి, ఆదాయ స్థాయి, పేదరిక నిర్మూలన, సామాజిక అభివృద్ధి, పాశ్చాత్యీకరణ లాంటి అనేక భావనలతో అభివృద్ధి అనేది ముడిపడి ఉంటుందని వెంకయ్య అన్నారు. స్థిరమైన ఆర్థికవృద్ధి సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. పేదరిక నిర్మూలనలో భాగంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడం, గ్రామాలు, పట్టణాల మధ్య అంతరాన్ని తొలగించడం, వాతావరణ సమస్యలను పరిష్కరించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని నియంత్రించడం, మహిళా సాధికారతను సాకారం చేయడం, ఉద్యోగాల కల్పన లాంటి అంశాల మీద దృష్టి సారించి ముందుకు సాగాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవితాల్లో వేగవంతమైన పురోగతే దేశాభివృద్ధికి సూచిక అని అన్నారు. దేశంలో పేదరికం, నిరక్షరాస్యత, కుల–లింగ వివక్ష, నల్లధనం, ఉగ్రవాదం వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు కృషి చేయడం ద్వారా వేగవంతమైన పురోగతి సాధించవచ్చని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. -
అక్షయ పాత్ర ఆధిపత్యం సబబేనా?
బడి పిల్లలకు బడిలోనే మధ్యాహ్నం భోజనం పెట్టే సదుపాయం చాలా దేశాల్లో అమల్లో వుంది. ఈ పథకం భారతదేశంలో భారీ స్థాయిలో ఉన్నట్లు యునెస్కో ప్రశంసించింది. ఈ విద్యా సంవత్సరంలో 12.65 లక్షల పాఠశాలల్లోని పన్నెండు కోట్ల మంది పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నివేదిక తెలియజేస్తోంది. పాఠశాలల్లో డ్రాపవుట్సును నివారించి, విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించటం ప్రధాన లక్ష్యం. అన్ని సంక్షేమ పథకాల్లో ప్రవేశిస్తున్నట్లే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పేరుతో ప్రభుత్వేతర సంస్థల (ఎన్జీవోలు) ముసుగులో ప్రైవేట్ సంస్థలు ఇందులోనూ వ్యాపిస్తున్నవి. వాటిలో అక్షయ పాత్ర ఫౌండేషన్, ఏక్తా శక్తి ఫౌండేషన్, నాంది ఫౌండేషన్, జయ్ గీ హ్యుమానిటేరియన్ సొసైటీ, పీపుల్స్ ఫోరమ్ అనేవి కొన్ని. అన్నిటి కంటే అక్షయ పాత్ర ఫౌండేషన్ పెద్దది. అది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్ (ఇస్కాన్) అనుబంధ సంస్థ. పన్నెండు రాష్ట్రాల్లో 14,702 ప్రభుత్వ పాఠశాలల్లోని 17.60 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నట్లు అక్షయ పాత్ర చెబుతోంది. గతంలోనే కొన్ని రాష్ట్రాల్లో అక్షయ పాత్ర ఫౌండేషన్ సరఫరా చేసే భోజనంపైన అభ్యంతరాలు వ్యక్తమైనవి. మధ్యాహ్న భోజన పథకంలో అక్షయ పాత్ర భాగస్వామ్యాన్ని తొలగించాలని సామాజిక కార్యకర్తలు కేంద్ర విద్యాశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకంగా1995 ఆగస్టు15 నుండి దేశమంతటా అమల్లోకి వచ్చిన మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం యిచ్చిన మార్గదర్శకాల ప్రకారం అమలు చేయాలి. ప్రొటీన్లు గల ఆహారం అందివ్వాలి. అందుకు అవసరమైన బియ్యం/గోధుమలు, పప్పులు, కూరగాయలు/ ఆకుకూరలు, నూనె/ఫ్యాట్, ఉప్పు, పోపు దినుసులతో వండిన భోజనం పెట్టాలి. వారంలో కనీసం మూడు రోజులు ఉడకబెట్టిన కోడిగుడ్లు వడ్డించాలి. కోడిగుడ్డుకు బదులు పాలు లేదా అరటి పండు ఇవ్వడాన్ని కూడా జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) అంగీకరించలేదు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం యిచ్చిన మార్గదర్శకాలు, జాతీయ పౌష్టికాహార సంస్థ చేసిన సిఫార్సులు, సుప్రీంకోర్టు తీర్పులోని ఆదేశాలకు విరుద్ధంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రవర్తిస్తోంది. అధునాతన యంత్రాలతో కేంద్రీకృత వంటశాలలు నెలకొల్పి బడికి అందుబాటులో ఉండే బడుగు బలహీన వర్గాల మహిళలకు అవకాశం లేకుండా చేశారు. తెల్లవారుజామున వండి, కంటెయినర్లలో పెట్టి, మైళ్లకొద్దీ వాహనాల్లో రవాణా చేసి, మధ్యాహ్నంకి చల్లారిన భోజనం పెడుతున్నారు. రోజూ ఒకే రకమైన ఆహార పదార్ధాలతో రుచి లేకపోవడం వలన విద్యార్థులు యిష్టంగా తినలేక పోతున్నారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2005 లోనే 187 శాంపిల్సును పరిశీలించి వాటిలో నిర్దేశిత పోషకాలు లేవని, పదార్థాల పరిమాణం కూడా తక్కువగా ఉంటుందని తేల్చింది. పౌష్టికాహారం అయిన కోడిగుడ్లు వడ్డించటం లేదు. అంతేకాదు ఆ వంట కంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా వేయటం లేదు. విద్యార్థులకు యిష్టమైన భోజనం కాకుండా సాత్వికాహారం పేరుతో అక్షయ పాత్ర ఫౌండేషన్ వారి మతాచార ఆహారాన్నే నిర్బంధంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వుండే విద్యార్థుల్లో 95 శాతం మంది మాంసాహారులు. వంట చేసే వారు మాత్రం మాంసాహార వ్యతిరేకులు. భోజనం చేసేవారు దళితులు, గిరిజనులు, బహుజనులు కాగా వండి వార్చేదేమో అగ్రవర్ణ సంస్థ. పాఠశాలల్లోనే వంట చేయకుండా అస్పృశ్యత పాటిస్తున్న ఫౌండేషన్ పట్ల 2013 లోనే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కమీషన్ ఆందోళన వ్యక్తం చేసింది. నిరసనలు వెల్లువెత్తడంతో ఫౌండేషన్ కూడా కొంత దిగొచ్చి స్కూల్ మేనేజిమెంట్ కమిటీ (ఎస్ఎంసీ)ల ద్వారా కోడిగుడ్లను విద్యార్థులకు అందించుకోవచ్చని, అందుకు చెల్లించాల్సిన సొమ్మును తనకిచ్చే బిల్లు నుండి మినహాయించుకోవచ్చని అంగీకరించింది. అంతేకానీ తాను మాత్రం కోడిగుడ్లు వడ్డించేది లేదని తెగేసి చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కోడిగుడ్లు వేరే ఏజెన్సీల ద్వారా పెట్టిస్తున్నారు. తెలంగాణలో అది కూడా లేదు. పైగా స్థానిక సంస్కృతీ, ఆహార అలవాట్లను అణిచివేసి సాత్వికాహారం పేరుతో రుచిలేని చప్పటి తిండి పెట్టి విద్యార్థుల కడుపు కాలుస్తున్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ భాగస్వామ్యంలోని అనర్ధాలను ఎవరూ పట్టించుకోక పోవడం అన్యాయం. ఇది బాలల హక్కుల సమస్య, భావి భారత పౌరుల పౌష్టికాహార సమస్య. దేశ ప్రయోజనాల పేరుతో వేలాది స్వచ్ఛంద (ఎన్జీవో) సంస్థలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం భోజనం పేరుతో ప్రభుత్వ నిధులు, ప్రైవేట్ విరాళాలు పోగేసుకుంటూ విద్యార్థుల జీవి తాలతో ఆడుకుంటున్న సంస్థను కొనసాగనివ్వడం నేరం కాదా? వ్యాసకర్త: నాగటి నారాయణ, విద్యారంగ విశ్లేషకులు, మొబైల్ : 94903 00577 -
ఇంటర్వ్యూ తేదీలు
* హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్)లో ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు: మే 24 * సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో యంగ్ ప్రొఫెషనల్-1 పోస్టులకు: మే 25 * ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్, క్లినికల్ అండ్ టెక్నికల్ పోస్టులకు: మే 25, 26, 30, 31, జూన్ 1, 2 -
జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్
న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ ది న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఖాళీల సంఖ్య: 1536 (వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు 38, తెలంగాణకు 55 కేటాయించారు) అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 30 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: రాత పరీక్ష (ఆన్లైన్ టెస్ట్), ఇంటర్వ్యూ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది:నవంబర్ 10 వెబ్సైట్: www.newindia.co.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ (ఎన్ఐఎన్) కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. * పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ కోర్స్ * ఇన్ న్యూట్రీషన్ కాలపరిమితి: జనవరి 6 నుంచి మార్చి 20 వరకు అర్హతలు: ఎంబీబీఎస్ లేదా బయోకెమిస్ట్రీ/ ఫుడ్ అండ్ న్యూట్రీషన్/ డయాబెటిక్స్/ ఫిజియాలజీలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. వయసు: 50 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 21 వెబ్సైట్: http://ninindia.org ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఐఐఆర్ఎం) ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాములో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. విభాగాలు: లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, యాక్చురల్ సెన్సైస్. కాలపరిమితి: ఏడాది. అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా పీజీ. యాక్చురల్ సెన్సైస్ విభాగానికి డిగ్రీలో మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్ చదివి ఉండాలి. ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: మే 31, 2015 వెబ్సైట్: www.iirmworld.org.in -
నేడు ఢిల్లీలో ఎన్ఐఎన్ కిట్ల ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ఆహారం, నీళ్లలో జరిగే కల్తీని అరికట్టేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో తమ సంస్థ రూపొందించిన కిట్లను గురువారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ ఆవిష్కరిస్తున్నట్టు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ఒక ప్రకటనలో తెలిపింది. బయో సర్వ్ బయో టెక్నాలజీ అనే సంస్థతో ఒప్పందం చేసుకుని కిట్లను రూపొందించామని, ఆహారం, నీళ్లలో ఉన్న వివిధ రకాల బ్యాక్టీరియాను ఈ కిట్ల ద్వారా తెలుసుకోవచ్చునని, తక్కువ ధరకే ఇవి లభ్యమవుతాయని పేర్కొంది. అంతేకాకుండా రక్త సేకరణ, నిల్వ, రవాణా సంబంధిత ఖర్చులను భారీగా తగ్గించే మరొక రక్త పరీక్షా కిట్‌ను కూడా అభివృద్ధి చేసినట్టు ఎన్ఐఎన్ తెలిపింది. దీనిద్వారా రక్తంలో విటమిన్ ‘ఎ’ స్థితి సులభంగా తెలుసుకోవచ్చు. డెంగీ జ్వర నిర్ధరణకు చేసే ఎలీసా రక్త పరీక్షా విధానంలోని సీరమ్‌లోని ఇనుము శాతాన్ని కనుగొనే విధానాన్ని కూడా అభివృద్ధి చేశామని, ఈ కిట్ల వల్ల తక్కువ ఖర్చుతో ఫలితాలను తెలుసుకోవచ్చునని వివరించింది. -
క్యాన్సర్ నివారణపై ముగిసిన పరిశోధనలు
సెంట్రల్ యూనివర్సిటీ, న్యూస్‌లైన్: క్యాన్సర్ నివారణకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్), ఐకేపీ నాలెడ్జ్ పార్క్ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన పరిశోధనలు ముగిశాయి. రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ పరిశోధనల్లో క్యాన్సర్ నివారణ కోసం ‘టెమోజొలోమైడ్’ అనే ఔషధాన్ని కనుగొన్నారు. పరిశోధనల్లో భాగంగా పలు జంతువులపై ఈ ఔషధాన్ని ప్రయోగించారు. ‘టెమోజొలోమైడ్’ ఔషధాన్ని క్యాన్సర్‌తో పాటు బ్రెయిన్ ట్యూమర్‌కు సైతం ఉపయోగించవచ్చని పరిశోధకులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఔషధాన్ని కనుగొన్నవారిలో హెచ్‌సీయూ రసాయనశాస్త్ర ప్రొఫెసర్ అశ్వనీనాంగియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్త దినేష్‌కుమార్ ఉన్నారు. యూనివర్సిటీలోని టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబెటర్‌లో పరిశోధనలు జరిగారుు. -
ఆహార చదువులు.. ఊరించే కొలువులు
గెస్ట్ కాలమ్ దేశ జనాభాలో అధిక శాతం మంది ప్రజలు పేదరికం వల్ల పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.. ఈ అంశంపై సరైన అవగాహన లేనికార ణంగా గర్భిణులు, పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో.. గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యంపై దృష్టిసారించి పరిశోధనలు చేయడంతోపాటు పలు కోర్సులను అందిస్తున్న హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) ఇంచార్జి డెరైక్టర్ కల్పగం పొలాసతో ప్రత్యేక ఇంటర్వ్యూ... సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చడమే లక్ష్యం: పౌష్టికాహార ప్రయోగాలు, పరిశోధనలు, ఫలాలను ప్రజలకు చేరువచేయటం ఎన్ఐఎన్ లక్ష్యం. ప్రజలకు పోషకాహారంపై అవగాహన కల్పించటం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చే దిశగా కృషిచేస్తున్నాం. అయోడైజ్డ్ ఉప్పు తప్పనిసరి వాడకంలోకి వచ్చిందంటే అందుకు ఎన్ఐఎన్ కృషి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఆహారం.. ప్రయోగాలు.. పరిశోధనలు: ఎన్ఐఎన్ మూడు విభాగాల్లో పనిచేస్తుంది. అవి..ఫుడ్ అండ్ డ్రగ్ టాక్సికాలజీ రీసెర్చ్ సెంటర్, నేషనల్ సెంటర్ ఫర్ లేబొరేటరీ యానిమల్ సెన్సైస్, నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ బ్యూరో(ఎన్‌ఎన్‌ఎంబీ). ఎన్‌ఎన్‌ఎంబీ ద్వారా 16 రాష్ట్రాల్లో ఆహారపు అలవాట్లపై పరిశోధనలు చేస్తున్నాం. నేత్ర సమస్యల నుంచి క్యాన్సర్ వ్యాధి వరకూ.. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పౌష్టికాహార లోపమే కారణం. కాబట్టి ఆహారజాగ్రత్తలపై పరిశోధనలు సాగుతున్నాయి. కోర్సులివే: ఎంఎస్సీ అప్లయిడ్ న్యూట్రిషియన్ కోర్సుతోపాటు టెక్నిక్స్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ న్యూట్రిషినల్ ఎనిమియాస్, పీజీ సర్టిఫికెట్ కోర్సు ఇన్ న్యూట్రిషియన్, యానువల్ లేబొరేటరీ యానిమల్ టెక్నీషియన్ కోర్సు, యానువల్ లేబొరేటరీ యానిమల్ సూపర్వైజర్ కోర్సు అందుబాటులో ఉన్నాయి. ట్రైనింగ్ కోర్సులు కావటంతో 10 రోజుల నుంచి నెలల వ్యవధి వరకూ ఉంటాయి. పోటీ ఎంతో తీవ్రం: ఎంఎస్సీ అప్లయిడ్ న్యూట్రిషన్ కోర్సుకు పోటీ తీవ్రంగా ఉంటుంది. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్సెన్సైస్కు అనుబంధంగా ఎన్ఐఎన్ ఈ కోర్సును నిర్వహిస్తుంది. కోర్సు మొత్తం సీట్లు 16. ఇందులో 6 సీట్లు మన రాష్ట్రానికి, మిగతా 10 సీట్లు సెంట్రల్ కోటాకు కేటాయించారు. ఎంబీబీఎస్, బీఎస్సీ(న్యూట్రిషన్), బీఎస్సీ (హోంసైన్స్), బీఎస్సీ (బయోకెమిస్ట్రీ/న్యూట్రిషన్ ప్రధాన సబ్జెక్టులుగా), బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారు అర్హులు. 100 మార్కులకు ఉండే రాత పరీక్ష ద్వారా సీట్లు భర్తీ చేస్తారు. న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ నుంచి ప్రశ్నలు వస్తాయి. అవకాశాలు పుష్కలం: గతంతో పోల్చితే న్యూట్రిషన్ కోర్సు పూర్తిచేసిన వారికి అవకాశాలు పెరిగాయి. ఆసుపత్రులు, హోటల్స్, కార్పొరేట్ సంస్థలు, జిమ్ సెంటర్లలో అవకాశాలు లభిస్తున్నాయి. డైటీషియన్లు, న్యూట్రిషన్ నిపుణులకు బాగా డిమాండ్ ఉంది. ఆసుపత్రిలో రోగులకు ఆహార సలహాలు డైటీషియన్లే ఇవ్వాలి. న్యూట్రిషన్ కోర్సులు పూర్తిచేసిన వారు సొంతంగా కూడా ఉపాధి పొందొచ్చు. ప్రారంభంలో రూ.18 వేల వరకూ వేతనం అందుకోవచ్చు. పౌష్టికాహారంపై అవగాహన: తిండి దొరక్క కొందరు రక్తహీనతతో బాధపడుతుంటే.. స్తోమత ఉండి కూడా అవగాహనలేమితో మరి కొంత మంది.. ఎనీమియాను కొనితెచ్చుకుంటున్నారు. ఇలాంటి భిన్నమైన సమస్యలకు పరిష్కార మార్గాలు చూపేందుకు ఎన్ఐఎన్ కృషి చేస్తోంది. రక్తహీనత సమస్య మహిళల్లో అధికంగా కనిపిస్తోంది. దీనివల్ల పిల్లలూ బలహీనంగా జన్మిస్తున్నారు. అలాంటి పిల్లలే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీన్ని అధిగమించేందుకు మహిళల్లో అవగాహన కల్పించటం, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం ఇప్పించటం వంటివి చేస్తున్నాం. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకూ చేరటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జరిపిన సర్వేలో పల్లెల్లోనూ యువతలో ఊబకాయం పెరుగుతోందని గుర్తించాం. తగినంత శారీరకశ్రమ లేకపో వటంతో తరచూ అనారోగ్యం బారినపడుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యంపై యువత, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్నాం. మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాం. -
నెలకో వంట నూనె శ్రేయస్కరం
సాక్షి, హైదరాబాద్: వంటలలో దీర్ఘకాలం ఒకే రకం నూనె వినియోగించడం అనర్థదాయకమని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) మాజీ డెరైక్టర్ డాక్టర్ బి.శశికిరణ్ హెచ్చరించారు. నిత్యం ఒకే వంటనూనె వాడటం వల్ల గుండె, కాలేయం, పొట్ట ఇతర శరీర భాగాల్లో కొవ్వు పేరుకు పోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా సోమవారం ‘ఈట్ రైట్ విత్ లివర్ డిసీజ్-13’ అనే అంశంపై ఇక్కడ ఏర్పాటైన ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఒక నెల వేరుశనగ నూనె వాడితే, మరో నెల సన్‌ఫ్లవర్ నూనె, ఇంకో నెల సోయాబీన్ ఆయిల్ వాడడం మంచిదన్నారు. రెండు, మూడు రకాల నూనెలను కలిపి వాడటం ఆరోగ్యానికి అంత శ్రేయస్కరం కాదన్నారు. ఈ నూనెలతో పోలిస్తే ఆలివ్ ఆయిల్లో కొవ్వు శాతం చాలా తక్కువైనప్పటికీ, అధిక ధర వల్ల సామాన్యులకు అందుబాటులో లేదన్నారు. పోషకాహార లోపం వల్ల గర్భిణులు తక్కువ బరువుతో కూడిన పిల్లలకు జన్మనిస్తున్నారని, బిడ్డ త్వరగా ఎదగాలని నూనె పదార్థాలు ఎక్కువ మోతాదులో తినిపిస్తున్నారన్నారు. దీంతో పిల్లలు స్థూలకాయులుగా మారుతున్నారని చెప్పారు. ప్రముఖ ఉదరకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ రాజేష్ గుప్తా మాట్లాడుతూ మద్యం, మాంసం అధికంగా వాడడం, వ్యాయామం లోపించడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. క్లినికల్ న్యూట్రిషనిస్ట్ సీఎస్ మధులిక మాట్లాడుతూ, పిజ్జాలు, బర్గర్లు, ఎనర్జీ డ్రింక్స్ వల్ల నష్టాలే అధికమన్నారు. ఆహారంలో విధిగా తాజా కూరలు, పాలు, పండ్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఏసియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి, డాక్టర్ పి.ఎన్.రావు తదితరులు పాల్గొన్నారు.