సాక్షి, హైదరాబాద్: అంధత్వ నివారణ కోసం దేశంలో ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలకు విటమిన్–ఏ సప్లిమెంట్లు ఇచ్చే విషయంపై సమీక్ష జరగాలని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ సూచించింది. దశాబ్దాల కింద ప్రారంభించిన విటమిన్–ఏ సప్లిమెంటేషన్ కార్యక్రమం సత్ఫలితాలిచ్చిందని, ఇప్పుడు విటమిన్–ఏ లోపం ప్రజారోగ్య సమస్య కాదని పేర్కొంది. బెంగళూరులోని సెయింట్ జాన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఢిల్లీలోని సీతారామ్ భార్తియ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్‌తో కలసి నిర్వహించిన అధ్యయనం ద్వారా ఈ విషయం స్పష్టమైందని ఓ ప్రకటనలో తెలిపింది.
భారతీయ బాలల్లో విటమిన్–ఏ లోపం ప్రమాదం 20 శాతం కంటే తక్కువకు చేరిందని వివరించింది. ఐదేళ్ల వయసు వచ్చే వరకు 6 నెలలకోసారి భారీ మొత్తంలో విటమిన్–ఏ ఇచ్చే ప్రస్తుత పద్ధతిని కొనసాగిస్తే హైపర్ విటమినోసిస్ (అవసరానికి మించి విటమిన్లు) సమస్యకు దారితీయొచ్చని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా ఒకే పద్ధతి కాకుండా.. అవసరాలను బట్టి రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాన్ని చేపట్టొచ్చని సూచించింది. అధ్యయనం వివరాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురితమయ్యాయని పేర్కొంది.
చదవండి: బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ తప్పనిసరి
Comments
Please login to add a commentAdd a comment