Vitamin-A
-
విటమిన్–ఏ లోపం తగ్గింది.. డేంజర్ బెల్స్
సాక్షి, హైదరాబాద్: అంధత్వ నివారణ కోసం దేశంలో ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలకు విటమిన్–ఏ సప్లిమెంట్లు ఇచ్చే విషయంపై సమీక్ష జరగాలని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ సూచించింది. దశాబ్దాల కింద ప్రారంభించిన విటమిన్–ఏ సప్లిమెంటేషన్ కార్యక్రమం సత్ఫలితాలిచ్చిందని, ఇప్పుడు విటమిన్–ఏ లోపం ప్రజారోగ్య సమస్య కాదని పేర్కొంది. బెంగళూరులోని సెయింట్ జాన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఢిల్లీలోని సీతారామ్ భార్తియ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్‌తో కలసి నిర్వహించిన అధ్యయనం ద్వారా ఈ విషయం స్పష్టమైందని ఓ ప్రకటనలో తెలిపింది. భారతీయ బాలల్లో విటమిన్–ఏ లోపం ప్రమాదం 20 శాతం కంటే తక్కువకు చేరిందని వివరించింది. ఐదేళ్ల వయసు వచ్చే వరకు 6 నెలలకోసారి భారీ మొత్తంలో విటమిన్–ఏ ఇచ్చే ప్రస్తుత పద్ధతిని కొనసాగిస్తే హైపర్ విటమినోసిస్ (అవసరానికి మించి విటమిన్లు) సమస్యకు దారితీయొచ్చని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా ఒకే పద్ధతి కాకుండా.. అవసరాలను బట్టి రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాన్ని చేపట్టొచ్చని సూచించింది. అధ్యయనం వివరాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమయ్యాయని పేర్కొంది. చదవండి: బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ తప్పనిసరి -
విటమిన్ ఏది?
నార్నూర్(ఆసిఫాబాద్): చిన్నారులకు భవిష్యత్‌లో ఎలాంటి కంటి చూపు సమస్యలు రాకూడదనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉచితంగా విటమిన్ ఏ అందిస్తోంది. కానీ గత ఆరు నెలలుగా జిల్లాలో ఈ మందు సరఫరా నిలిచిపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 126 సబ్‌సెంటర్లు.. జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 05 అర్బన్ హెల్త్సెంటర్లు, 126 సబ్‌సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో 9 నెలల నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులు దాదాపు 30వేల మంది ఉన్నారు. చిన్నారులకు ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు ద్వారా ఇంటింటికి లేదా సబ్సెంటర్లలో ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఏ విటమిన్ సిరప్‌ను ఒక టీ స్పూన్ వేయాల్సి ఉంటుంది. ఆరు నెలలుగా ఏ విటమిన్ సిరప్ లేని కారణంగా చిన్నారులకు వేయడం లేదు. ఆరు నెలలుగా నిలిచిన సరఫరా.. చిన్నారులకు కంటి చూపునకు సంబంధించిన సమస్యలు రాకూడదనే ఉద్దేశంలో ఏ విటమిన్ సిరప్‌ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. కానీ ఆరు నెలలుగా సబ్ సెంటర్లకు ఏ విటమిన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో చిన్నారులు రేచీకటి బారిన పడే అవకాశం ఉంది ఆరు నెలలకో డోసు.. తొమ్మిది నెలలు నిండిన చిన్నారులకు ప్రతీ ఆరు నెలలకోసారి ఏ విటమిన్ సిరప్‌ను 5 ఏళ్ల చిన్నారుల వరకు అందిస్తారు. ఆరు నెలలుగా సరఫరా లేకపోవడంతో ఒక డోస్ సమయం ముగిసి రెండో డోస్ వచ్చే సమయం ఆసన్నమైనా ఇప్పటి వరకు ఏ విటమిన్ సరఫరా కావడం లేదు. 100 మిల్లీలీటర్ల ఏ విటమిన్ బాటిల్‌ను 2 ఎంఎల్ చొప్పున 50 మంది చిన్నారులకు ఏఎన్ఎంలు అందిస్తారు. బయట దొరకని సిరప్ డబ్ల్యూహెచ్‌వో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా ఉచితంగా సరఫరా చేసే టీకాలు, సిరప్లు సకాలంలో జిల్లా స్థాయి అధికారులు తీసుకురాకుండా చిన్నారుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఏ విటమిన్ ఎక్కడా మార్కెట్లో లభించదు. దీంతో చిన్నారుల కంటిచూపుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఏ విటమిన్ సిరప్ 9నెలల చిన్నారుల నుంచి 5 ఏళ్లలోను చిన్నారులకు ప్రతి ఆరు ఆరునెలలలకొకసారి తొమ్మది డోసులు వేయడంతో జీవితంలో వీరికి కంటి చూపునకు సంబందించిన సమస్యలు తలెత్తవు. ఇది పూర్తిగా చేప నూనెతో తయారు చేసిన ద్రావణం కాబట్టి ఇది మార్కెట్లో ఎక్కడ లభించదు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి సబ్‌సెంటర్లకు ఏ విటమిన్ సిరప్‌ను సరఫరా చేయాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అందుబాటులో ఉండేలా చూస్తాం విటమిన్ ఏ సిరప్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికీ అన్ని పీహెచ్‌సీల నుంచి చిన్నారుల వివరాలతోపాటు ఇండెంట్ తెప్పించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా సరఫరా లేదు. ప్రభుత్వం నుంచి విటమిన్ ఏ సిరప్ రాగానే సబ్ సెంటర్లకు పంపిణీ చేస్తాం. – రాజీవ్‌రాజ్, జిల్లా వైద్యాధికారి ఆదిలాబాద్ -
చిన్న‘చూపు’!
‘‘చిన్నారుల కంటిచూపు మెరుగునకు వేసే విటమిన్–ఏ ద్రావణం గడ్డకట్టింది. చివరి క్షణంలో విషయం బహిర్గతం కావడంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వెంటనే జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సమాచారమిచ్చింది. సోమ, మంగళవారాల్లో వేయాల్సిన చుక్కల మందు పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. సాక్షి, తిరుపతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చిన్నారుల కంటి చూపు మెరుగు కోసం విటమిన్–ఏ ద్రావణం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని 4.06లక్షల మంది 9నెలల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు కంటిచుక్కల మందు వేయాలని భా వించింది. జిల్లావ్యాప్తంగా 10,500 బాటిళ్లను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ద్రా వణం నాసిరకంగా తయారుకావడంతో పంపిణీకి ముందే బాటిళ్లలో గడ్డ కట్టినట్లు అధికారులు గుర్తించారు. అది కూడా ఆదివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బాటిళ్లను సరఫరా చేసే సమయంలో గుర్తించినట్లు తెలిసింది. చిన్నారుల ప్రాణాలతో ముడిపడిన ఈ ద్రావణంలో ఉన్నత ప్రమాణాలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఫార్మా కంపెనీలు నాణ్యతను పాటించలేదని వైద్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ద్రావణం గడ్డ కట్టిందని చర్చించుకుంటున్నారు. షాక్ అయిన వైద్యబృందం.. గడ్డ కట్టిన విటమిన్–ఏ ద్రావణాన్ని చూసి వైద్యులు షాక్‌కు గురయ్యారు. ఈ ద్రావణాన్ని పరిశీలించకుండా చిన్నారులకు పంపిణీ చేసి ఉంటే పరిస్థితి ఆందోళనకరంగా ఉండేదని వైద్య సిబ్బంది చర్చించుకున్నారు. ఈ విషయం బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. పీహెచ్‌సీలకు ఈ విషయాలేమీ తెలియపరచకుండా కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ఆదేశాలిచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల పరిధిలో గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. 9నెలలు నిండి 5సంవత్సరాల లోపు పిల్లలకు ఈ ద్రావణం వేయడం వల్ల కలిగే ప్రయాజనాల గురించి అవగాహన కల్పించారు. 9నెలల నుంచి ఏడాది లోపు వయస్సు కలిగిన పిల్లలకు ఒక ఎంఎల్, ఏడాది దాటి ఐదేళ్ల లోపు చిన్నారులకు 2ఎంఎల్ మోతాదుగా ద్రావణం పోయాలని నిర్ణయించారు. ఈ మేరకు గ్రామస్థాయిలో ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లను అప్రమత్తం చేశారు. సోమ, మంగళవారాల్లో పంపిణీ చేయాలని డీఎం అండ్ హెచ్‌వో నుంచి పీహెచ్‌సీలకు ఆదేశాలందాయి. కొన్ని పీహెచ్‌సీలకు ఇప్పటికే సరఫరా.. విటమిన్–ఏ ద్రావణాన్ని ఈనెల 23, 24 తేదీలలో పంపిణీ చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేసిన అధికారులు కొన్ని పీహెచ్‌సీలకు ఇప్పటికే సరఫరా చేశారు. మరికొంత డీఎంహెచ్‌వో కార్యాలయంలోనే స్టాకు ఉండిపోయింది. తమ వద్దనున్న స్టాకును కూడా పరీక్షించగా గడ్డకట్టి వినియోగానికి పనికిరాదని వైద్యాధికారులు నిర్ధారించారు. వెంటనే అప్రమత్తమై పంపిణీ వాయిదా వేయాలని ఆదేశించారు. -
క్యారట్... హెల్దీ రూట్!
గుడ్‌ఫుడ్ కంటి చూపు బాగుండటానికి క్యారట్ ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. దానిలో ఉండే విటమిన్–ఏ వల్ల మనకు ఈ ప్రయోజనం కలుగుతుంది. అలాగే క్యారట్ కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గించి గుండెజబ్బులను నివారిస్తుంది. మేని రంగులో నిగారింపు తెస్తుంది. దీనిలో ఉండే పీచు పదార్థాల కారణంగా అది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. మాక్యులార్ డీజనరేషన్ అనే కంటి వ్యాధిని నివారించగల శక్తి క్యారట్‌కు ఉంది. క్యారట్ తినడం వల్ల లాలాజలం ఎక్కువగా ఊరి చిగుర్లు ఆరోగ్యకరంగా ఉంటాయి. నోటి ఆరోగ్యం కూడా బాగుంటుంది. రక్తంలో చక్కెరపాళ్లను సైతం క్యారట్ నియంత్రిస్తుంది. -
కను‘పాప’లకేది రక్షణ ?
–జిల్లాలో రెండు నెలలుగా నిలిచిన విటమిన్ ఏ సరఫరా – అంధత్వ నివారణకు వేసే సిరప్ లేక ఇబ్బందులు – ఆందోళన చెందుతున్న చిన్నారుల తల్లిదండ్రులు నల్లగొండ టౌన్: చిన్నారులను అంధత్వం నుంచి కాపాడేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వేస్తున్న ఏ సిరఫ్ రెండు నెలలుగా నిలిచిపోయింది. దీని కోసం పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు, పట్టణ ఆరోగ్యకేంద్రాల చుట్టూ చిన్నారుల తల్లిదండ్రులు ప్రదక్షిణలు చేస్తున్నారు. వ్యాధి నిరోధక టీకాలతో పాటు విటమిన్ ఏ సిరఫ్ను జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా సరఫరా చేస్తుంటారు. విటమిన్ ఏ సిరప్‌ను చిన్నారులకు తాగించడం వలన వారికి ఎలాంటి కంటి జబ్బులు రాకుండా కాపాడవచ్చు. జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు , సబ్‌సెంటర్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో వ్యాధి నిరోధక టీకాలతో పాటు విటమిన్ ఏ సిరప్‌ను కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అందుబాటులో ఉంచుతుంది. 9 నెలలు దాటిన చిన్నారికి 1 యూనిట్(1 ఎంఎల్) విటమిన్ ఏ ను తాగిస్తారు. అనంతరం ప్రతి ఆరు నెలలకు ఒక సారి 2 యూనిట్లు(2 ఎంఎల్) సిరప్‌ను 5 సంవత్సరాల వయస్సు వరకు తాగించడం ద్వారా ఆ చిన్నారులను రేచీకటి, అంధత్వం రాకుండా కాపాడవచ్చు. అయితే జిల్లాలో ప్రతి నెలా 4లక్షల యూనిట్లు( 4లక్షల ఎంఎల్) విటమిన్ ఏ సిరప్ అవసరం ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రెండు నెలలుగా ఈ సిరప్‌ను ప్రభుత్వం సరఫరా చేయకపోవడంతో దీని కోసం ఆస్పత్రుల చుట్టూ చిన్నారుల తల్లిదండ్రులు తిరుగుతున్నారు. ప్రై వేట్ ఆస్పత్రులకు వెళ్లి సిరఫ్ వేయించాలంటే పెద్ద ఖర్చుతో కూడుకున్న పనేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చిన్నారుల పట్ల ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇమ్యునైజేషన్కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులతో సరఫరా చేయాల్సిన విటమిన్ ఏ ను ఎందుకు పంపిణీ చేయడం లేదని పలువును చిన్నారుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి విటమిన్ ఏ ను జిల్లాకు తెప్పించి చిన్నారులను కాపాడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేయగానే పంపిస్తాం జిల్లాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన విటమిన్ ఏ సిరప్ గత రెండు నెలలుగా సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వం నుంచి రాగానే అన్ని పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు, పట్టణ ఆరోగ్యకేంద్రాలకు పంపిస్తాము. – డాక్టర్ భానుప్రసాద్‌నాయక్, డీఎంహెచ్ఓ -
పాడి పశువు ఏటా ఈనాలంటే..
రోజూ 30-40 కిలోల పచ్చి గడ్డి వేయాలి బ్రీడింగ్ సీజన్లో ప్రతి పాడి పశువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. తొలకరి వర్షాలకు పెరిగిన పచ్చి గడ్డి పశువుల్లో పోషక విలువలు పెంచుతుంది. ఈ రోజుల్లో ప్రతి పశువుకూ రోజుకు కనీసం 30 నుంచి 40 కిలోల పచ్చిగడ్డి వేయాలి. అందులోని విటమిన్-ఏ పశువు ఎదకు రావడానికి, గర్భం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. పచ్చిగడ్డి లేని రైతులు ప్రతి పశువుకూ కనీసం కిలో దాణా, వారానికి ఒకసారి నాలుగు వేల ఇంటర్నేషన్ యూనిట్ల విటమిన్ ఇంజక్షన్ ఇప్పించాలి. రోజుకు 25 నుంచి 50 గ్రా. ఖనిజ లవణ మిశ్రమం ఇవ్వాలి. పోషణ సక్రమంగా ఉన్న పశువులు క్రమంగా ఎదకు వస్తాయి. ఎదను వేకువ జామున గుర్తించవచ్చు పశువు చూడి కట్టించడమనేది ఎదను గుర్తించడం పైనే ఆధారపడి ఉంటుంది. ఎదకు వచ్చినప్పుడు పశువు అరవడం, మానం వెంట తెల్లని తీగలు వేయడం, మానం ఉబ్బి లోపల ఎరుపు రంగులోకి రావడం జరుగుతుంది. అదే పనిగా మూత్రం పోయడం, పశువుల పైకి ఎక్కడం లాంటి పనులు చేస్తుంటాయి. ఇంకా మేత సరిగా తినకపోవడం, పాలు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వేసవిలో గేదేల్లో ఎద లక్షణాలు మరీ తక్కువగా ఉంటాయి. కొన్ని ముర్రా, గ్రేడేడ్ ముర్రా జాతి గేదె ల్లో ఎదకు వచ్చినా ఎలాంటి లక్షణాలు ప్రదర్శించని పరిస్థితి ఉంటుంది. దీనినే మూగ ఎద అంటారు. గేదెలు ఎక్కువగా రాత్రి సమయాల్లో ఎదకు వస్తాయి. ఆ లక్షణాలను వేకువ జామున సులభంగా గుర్తించవచ్చు. పశువుల్లో మూగ ఎదను గుర్తించడానికి టీజర్ ఆంబోతును ఉపయోగించవచ్చు. ఎక్కువ సంఖ్యలో పశువులుంటే టీజర్ ఆంబోతు తప్పని సరిగా ఉండాలి. పశువు ఒకసారి చూడి కట్టకుంటే 18 నుంచి 24 రోజుల మధ్య తప్పనిసరిగా ఎదకు వస్తుంది. సరైన సమయంలో చూడి కట్టించాలి సాధారణంగా ఆవులు, గేదెల్లో ఎదకాలం ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే ఉంటుంది. ఈ దశలో పశువు మానం వెంట పల్చని నీళ్ల లాంటి తీగలు పడుతుంటాయి. పశువు వెన్ను మీద నిమిరితే తోక కొంచెం పైకి ఎత్తుతుంది. ఈ దశలో తప్పని సరిగా చూడి కట్టించాలి. చూడి కట్టించే సమయంలో పశువును బాగా కడగాలి. ముఖ్యంగా మానం చుట్టూ పేడ, మట్టి లేకుండా చేయాలి. కొంతమంది రైతులు ఒకే సారి రెండు వీర్యదానాలు చేస్తుంటారు. అలా కాకుండా ఆరు గంటల వ్యవధిలో రెండో వీర్యదానం చేయిస్తే కట్టు శాతం పెరుగుతుంది. దున్నపోతులతో కట్టించేటప్పుడు దాని ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి. గర్భస్రావాలు కలుగజేసే వ్యాధులు లేవని నిర్ధారించుకున్నాకే.. వాడటం మేలు. రెండున్నరేళ్ల లోపు.. పదేళ్లు దాటిన దున్నపోతులతో చూడి కట్టించరాదు. ఒకే సారి ఎక్కువ పశువులను దున్నపోతుతో దాటిస్తే చివరి పశువులో చూడి శాతం తగ్గుతుంది. రెండేళ్లకోమారు దున్నపోతును మార్చాలి. చూడి కట్టించాక పశువును ఆ రోజు బయటకు విడవకూడదు. చల్లగా పరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో కట్టేయాలి. చల్లని నీటితో గేదేలను కడగాలి.