రోజూ 30-40 కిలోల పచ్చి గడ్డి వేయాలి
బ్రీడింగ్ సీజన్‌లో ప్రతి పాడి పశువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. తొలకరి వర్షాలకు పెరిగిన పచ్చి గడ్డి పశువుల్లో పోషక విలువలు పెంచుతుంది. ఈ రోజుల్లో ప్రతి పశువుకూ రోజుకు కనీసం 30 నుంచి 40 కిలోల పచ్చిగడ్డి వేయాలి. అందులోని విటమిన్-ఏ పశువు ఎదకు రావడానికి, గర్భం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. పచ్చిగడ్డి లేని రైతులు ప్రతి పశువుకూ కనీసం కిలో దాణా, వారానికి ఒకసారి నాలుగు వేల ఇంటర్‌నేషన్ యూనిట్ల విటమిన్ ఇంజక్షన్ ఇప్పించాలి. రోజుకు 25 నుంచి 50 గ్రా. ఖనిజ లవణ మిశ్రమం ఇవ్వాలి. పోషణ సక్రమంగా ఉన్న పశువులు క్రమంగా ఎదకు వస్తాయి.
ఎదను వేకువ జామున గుర్తించవచ్చు
పశువు చూడి కట్టించడమనేది ఎదను గుర్తించడం పైనే ఆధారపడి ఉంటుంది. ఎదకు వచ్చినప్పుడు పశువు అరవడం, మానం వెంట తెల్లని తీగలు వేయడం, మానం ఉబ్బి లోపల ఎరుపు రంగులోకి రావడం జరుగుతుంది. అదే పనిగా మూత్రం పోయడం, పశువుల పైకి ఎక్కడం లాంటి పనులు చేస్తుంటాయి. ఇంకా మేత సరిగా తినకపోవడం, పాలు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
వేసవిలో గేదేల్లో ఎద లక్షణాలు మరీ తక్కువగా ఉంటాయి. కొన్ని ముర్రా, గ్రేడేడ్ ముర్రా జాతి గేదె ల్లో ఎదకు వచ్చినా ఎలాంటి లక్షణాలు ప్రదర్శించని పరిస్థితి ఉంటుంది. దీనినే మూగ ఎద అంటారు. గేదెలు ఎక్కువగా రాత్రి సమయాల్లో ఎదకు వస్తాయి. ఆ లక్షణాలను వేకువ జామున సులభంగా గుర్తించవచ్చు. పశువుల్లో మూగ ఎదను గుర్తించడానికి టీజర్ ఆంబోతును ఉపయోగించవచ్చు. ఎక్కువ సంఖ్యలో పశువులుంటే టీజర్ ఆంబోతు తప్పని సరిగా ఉండాలి. పశువు ఒకసారి చూడి కట్టకుంటే 18 నుంచి 24 రోజుల మధ్య తప్పనిసరిగా ఎదకు వస్తుంది.
సరైన సమయంలో చూడి కట్టించాలి
సాధారణంగా ఆవులు, గేదెల్లో ఎదకాలం ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే ఉంటుంది. ఈ దశలో పశువు మానం వెంట పల్చని నీళ్ల లాంటి తీగలు పడుతుంటాయి. పశువు వెన్ను మీద నిమిరితే తోక కొంచెం పైకి ఎత్తుతుంది. ఈ దశలో తప్పని సరిగా చూడి కట్టించాలి. చూడి కట్టించే సమయంలో పశువును బాగా కడగాలి. ముఖ్యంగా మానం చుట్టూ పేడ, మట్టి లేకుండా చేయాలి.
కొంతమంది రైతులు ఒకే సారి రెండు వీర్యదానాలు చేస్తుంటారు. అలా కాకుండా ఆరు గంటల వ్యవధిలో రెండో వీర్యదానం చేయిస్తే కట్టు శాతం పెరుగుతుంది. దున్నపోతులతో కట్టించేటప్పుడు దాని ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి. గర్భస్రావాలు కలుగజేసే వ్యాధులు లేవని నిర్ధారించుకున్నాకే.. వాడటం మేలు. రెండున్నరేళ్ల లోపు.. పదేళ్లు దాటిన దున్నపోతులతో చూడి కట్టించరాదు. ఒకే సారి ఎక్కువ పశువులను దున్నపోతుతో దాటిస్తే చివరి పశువులో చూడి శాతం తగ్గుతుంది. రెండేళ్లకోమారు దున్నపోతును మార్చాలి. చూడి కట్టించాక పశువును ఆ రోజు బయటకు విడవకూడదు. చల్లగా పరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో కట్టేయాలి. చల్లని నీటితో గేదేలను కడగాలి.
పాడి పశువు ఏటా ఈనాలంటే..
Published Tue, Sep 9 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM
Advertisement