జన్నారం : పాడి పశువులు ప్రస్తుత సీజన్‌లో ఏఫీమెరల్ ఫీవర్‌కు గురవుతున్నాయి. ముందస్తుగా గుర్తించి వైద్య చికిత్స అందిస్తే నివారణ సులభమేనని, లేదంటే ప్రమాదకరమని తపాలపూర్ పశువైద్యాధికారి అజ్మీరా రాకేశ్ వివరించారు. దోమకాటు వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. దీనిని మూడు రోజుల జ్వరంగా పేర్కొంటారు. వర్షాకాలంలో జూలై నుంచి అక్టోబర్ మాసాల మధ్య పాడిపశువులను పట్టి పీడిస్తుంది. దీనిపై పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఏవైనా సందేహాలు ఉంటే ఫోన్‌లో సంప్రదించవచ్చు.
లక్షణాలు
దోమకాటుకు గురైన పశువుల్లో 104 నుంచి 106 ఫారెన్ హీట్ డిగ్రీల జ్వరం వస్తుంది. ఆకలి మందగిస్తుంది. నెమరు వేయవు. గడ్డి తినవు. నీళ్లు తాగవు. పార్డు లేక మలబద్ధకం కలిగి కంటి, ముక్కు నుంచి నీరు కారుతుంది. కీళ్లనొప్పులతో పశువులు లేవలేని స్థితిలో ఉంటాయి. కుంటుతాయి. జబ్బవాపు వ్యాధి వలే ఉంటుంది. ఆయాసం, దగ్గుతో పశువులు బాధపడుతాయి. ఇది మనుషులకు సోకే చికున్‌గున్యా వ్యాధి లక్షణాలు కలిగి ఉంటుంది.
చికిత్స
అతి జ్వరంతో బాధపడుతున్న పశువులకు సోడియం సాలిస్టేట్, పారాసెట్మాల్, నొప్పులు నివారించే ఇంజక్షన్‌ను పశువైద్యుల సూచన మేరకు ఇప్పించాలి. ఇది వైరల్ ఫివర్ కాబట్టి ఎటువంటి యాంటీబయాటిక్ మందులు ఇప్పించాల్సిన అవసరం లేదు. జ్వరం తగ్గిన తర్వాత నీరసం తగ్గించేందుకు బెలామీల్ ఇంజక్షన్ ఇప్పించాలి.
జాగ్రత్తలు
ఈ వ్యాధికి ప్రస్తుతం ఎలాంటి మందులు లేవు. వ్యాధి బారిన పడిన పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు రెండేళ్ల సమయం పడుతుంది. ఈ వ్యాధికి గురైన పశువుల పాకలో దోమలు లేకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. పాడి పశువుల పాకల్లో వేప ఆకులు, గుగ్గిలం పొగ పెట్టాలి. దోమ చక్రాలు వెలిగించాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. జ్వరం మూడు రోజులు ఉంటుంది కాబట్టి ప్రమాదకరం కాదు. అయితే సకాలంతో వైద్యం అందించకపోతే పశువు ప్రమాదానికి గురవుతుంది.
ఏఫీమెరల్ ఫీవర్‌తో జాగ్రత్త
Published Fri, Sep 26 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM
Advertisement