సాక్షి, అమరావతి: పాడి రైతులకు తోడుగా ప్రభుత్వం ఉంటుంటే చూడలేని రామోజీరావు తన పాడు రాతలతో ప్రభుత్వంపై బురద జల్లడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు. మూగజీవాలకు అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలపై కూడా ఈనాడులో విషంకక్కారు. 108 తరహాలోనే ఫోన్ చేసిన అరగంటలోపే పాడి రైతుల ఇంటి ముంగిటకు చేరుకొని వైద్య సేవలందిస్తున్న ఈ వాహన సేవలపై దుష్ప్రచారం చేశారు. ‘సంచార పశు వైద్యం చాపచుట్టేశారు’అంటూ ‘ఆవు కథ’మాదిరే ఈనాడులో ఓ కథనం అచ్చేశారు. ఆ కథనంలో వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిస్తే..
ఆరోపణ: కానరాని వాహనాలు
వాస్తవం : గతంలో పాడి పశువులకు చిన్న పాటి అనారోగ్యం వచ్చినా 5–20 కిలోమీటర్ల దూరంలోని పశువైద్యశాలలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో అందుబాటులోకి వచ్చిన పశు సంవర్ధక సహాయకులు సకాలంలో వ్యాక్సిన్లు, ప్రాథమిక వైద్యసేవలు అందిస్తున్నారు. నాణ్యమైన పశువైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో నియోజకవర్గానికి రెండు చొప్పున రాష్ట్రంలో రూ. 278 కోట్లతో 340 మొబైల్ అంబులేటరీ క్లినిక్స్‌ను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మొబైల్ వైద్యసేవల కోసం టోల్ ఫ్రీ నం.1962తో ప్రత్యేకంగా కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసింది.
ఆరోపణ: మూలనపడ్డ పరికరాలు
వాస్తవం : ప్రతి అంబులెన్స్‌లో పశువైద్యుడు, వెటర్నరీ డిప్లమో చేసిన సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్లను ఏర్పాటు చేసింది. 295 పశువైద్యులతోపాటు 337 పశువైద్య సహాయకులు సేవలందిస్తున్నారు. ప్రతి వాహనంలో 51 రకాల వైద్య పరికరాలను ఉంచారు.
20 రకాల పేడ సంబంధిత, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా ప్రతి వాహనంలో మైక్రో స్కోప్‌తో సహా 33 రకాల పరికరాలతో చిన్నపాటి లేబరేటరీని ఏర్పాటు చేశారు. కనీసం వెయ్యి కిలోల బరువున్న పశువులను సమీప వైద్యశాలకు తరలించేందుకు వీలుగా హైడ్రాలిక్ లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. హైడ్రాలిక్ లిఫ్ట్‌లో సాంకేతిక సమస్య వస్తే వెంటనే మరమ్మతులు చేçస్తున్నారు. ఒకవేళ మరమ్మతు ఆలస్యం అయితే సమీప మండల వాహనాలను వినియోగిస్తున్నారు.
ఆరోపణ: అరకొరగా వైద్య సేవలు.. జ్వరం మందులు లేవు
వాస్తవం : టోల్ ఫ్రీ నంబర్‌కు ప్రతి రోజూ వెయ్యికి పైగా కాల్స్ వస్తున్నాయి. ఫోన్ చేసిన అరగంటలోపే ఆయా గ్రామాలకు చేరుకొని ఉచితంగా సేవలందిస్తున్నారు. అవసరమైన చోట సమీప పశువైద్యశాలలకు తరలించి నాణ్యమైన, మెరుగైన సేవలు అందించి పైసా ఖర్చు లేకుండా వైద్యసేవలనంతరం తిరిగి రైతు ఇంటి వద్దకే తీసుకొచ్చి పశువులను అప్పగిస్తున్నారు. ప్రతి వాహనంలో రూ. 30 వేల విలువైన 81 రకాల మందులు అందుబాటులో ఉంచారు. ఏడాదిన్నరలో 6,97,116 పశువులకు ఉచిత చికిత్స అందించారు. 5,14,740 మంది పశుపోషకులు లబ్ధి పొందారు.
ఆరోపణ: సమ్మె బాట పట్టిన సిబ్బంది
వాస్తవం : సంచార పశువైద్య సేవ వాహనాల నిర్వహణ, వీటిలో పని చేస్తున్న వైద్య సిబ్బందికి సంబంధించిన జీత భత్యాలు చెల్లింపు బాధ్యత జీవీకే సంస్థకు అప్పగించారు. ఈ వాహనాల్లోని సిబ్బందికి ఆ సంస్థ సకాలంలో జీతభత్యాలు అందిస్తోంది. ఇప్పటివరకు ఏ ఒక్కరూ తమకు జీతభత్యాలు అందడం లేదంటూ సమ్మె నోటీసు ఇవ్వలేదు. అయినా నోటీసు ఇచ్చినట్టుగా ఈనాడు తన కథనంలో తప్పుడు ఆరోపణ చేసింది.
మరోవైపు ఏపీ స్ఫూర్తితో ఏపీ మోడల్‌లోనే పంజాబ్, కేరళ తదితర రాష్ట్రాల్లో మొబైల్ అంబులేటరీ వాహన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే సంచార పశువైద్యం చాపచుట్టేస్తున్నారంటూ ఈనాడు విషపు రాతలు రాయడం పాడి రైతులను విస్మయానికి గురిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment