సాక్షి, అమరావతి: పచ్చ పత్రిక ఈనాడుకు, దాని అధినేత రామోజీరావుకు ఒకటే ఎజెండా.. నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై ఏదో ఒక రూపేణా విషం చిమ్మడమే. ఇందులో భాగంగానే ‘ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యంతో సర్కారు చెలగాటం’ అంటూ అవాస్తవాలతో ఒక కథనాన్ని మంగళవారం ఈనాడులో వండివార్చారు. వాస్తవానికి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం సాహసించలేదు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇదంత సులువైన పని కాదని అక్కడ చేతులెత్తేశారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా సులువుగా 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. తద్వారా వారికి ప్రభుత్వ ఉద్యోగులకు లభించినట్టే అన్ని ప్రయోజనాలు కల్పిస్తున్నారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్)ను ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తింపజేశారు.
ఆర్టీసీ ఉద్యోగులు తమకు అనారోగ్యం కలిగితే ఈహెచ్‌ఎస్ కింద రాష్ట్రంలో మెరుగైన వైద్యం పొందుతున్నారు. అయినా ఇదంతా కళ్లుండి కూడా చూడలేని కబోధి రామోజీరావు యథేచ్ఛగా విషం కక్కారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్ కింద వైద్యం దక్కడం లేదంటూ అవాస్తవాలను అచ్చేశారు. అసలు వాస్తవాలేవో వివరిస్తూ ఈ ఫ్యాక్ట్ చెక్..
♦ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఈహెచ్‌ఎస్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు వైద్యం అందిస్తున్న అన్ని రిఫరల్ ఆస్పత్రుల్లో ఆర్టీసీ ఉద్యోగులు కూడా నాణ్యమైన వైద్య సేవలు పొందుతున్నారు. ఎంతోమంది ఉద్యోగులు ఆ సేవలతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారు.
♦ఈహెచ్‌ఎస్ రిఫరల్ ఆస్పత్రుల్లోనే కాకుండా 21 ఆర్టీసీ ఆస్పత్రుల్లో కూడా ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఓపీ, చికిత్స విషయంలో ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసేందుకు ప్రతి జిల్లాకు ఒక సమన్వయ అధికారిని నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందితే.. ఆ మేరకు బిల్లులను ఈహెచ్‌ఎస్ పోర్టల్‌లో సమర్పించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది.
♦ఆర్టీసీ ఉద్యోగులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కార్డియాక్ కేర్ ట్రై–ఓఆర్‌జీ మెషిన్ల ద్వారా గుండెపోటు సమస్యను ముందుగానే గుర్తించి తగిన వైద్యం అందిస్తున్నారు. ఆ విధంగా ఇప్పటివరకు 149 మందికి గుండెపోటు నివారణ చికిత్స అందించారు.
♦ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే మౌలిక వసతులను ఆర్టీసీ అభివృద్ధి చేస్తోంది. 5 రకాల వైద్య సేవలు అందించే వైఎస్సార్ ఆర్టీసీ ఏరియా ఆస్పత్రిని కడపలో 2021లోనే నెలకొల్పింది. అనంతపురం, రాజమండ్రిలో ఆర్టీసీ డిస్పెన్సరీలు ఏర్పాటు చేశారు. తిరుపతి, నరసరావుపేట, మచిలీపట్నంలలో కొత్తగా ఆర్టీసీ ఆస్పత్రుల నిర్మాణాన్ని చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment