ఒంగోలు టూటౌన్ : జిల్లాలో చాలా మంది రైతులు వ్యవసాయంతో పాటు పాడి పశువులను పోషిస్తున్నారు. పశువులు ఈనే ముందు, ఈనిన త ర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రైతులకు తెలియకపోవడం వల్ల కొన్నిసార్లు పశువులు మృత్యువాత పడుతున్నాయి. పశువులు ఈనే సమయంలో పశు పోషకులు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్థకశాఖ ఒంగోలు ఏడీఏ మురళీకృష్ణ తెలిపారు. పశుపోషకులకు ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
పశువులు ఈనే ముందు..
చూడి పశువు ఎక్కువ నీరు తాగకుండా చూడాలి. వాటిని మందతో పాటు బయటకు పంపకూడదు. ఎత్తు ప్రదేశాలకు వెళ్లకుండా చూసుకోవాలి. పరుగెత్తనీయకూడదు. బెదరగొట్టడం, దున్నపోతులు, ఆంబోతులు పొడవకుండా, దాటకుండా చూడాలి. చూడి పశువులను విడిగా ఉంచాలి. కొన్ని పశువుల్లో ఈనడానికి పది రోజుల ముందు పొదుగు భాగంలో నీరు దిగి వాపు వస్తుంది. ఇది సహజంగా వస్తుంది. దీనిని వ్యాధిగా భావించనవసరం లేదు.
ఈనిన తర్వాత..
వేడినీళ్లతో శరీరాన్ని శుభ్రం చేయాలి. వరిగడ్డితో బెడ్డింగ్ ఏర్పాటు చేయాలి. నీరసం తగ్గడానికి బెల్లం కలిపిన గోరువెచ్చని తాగునీరు ఇవ్వాలి. పశువులకు కొన్ని రోజుల వరకు కొద్దిగా దాణా అందిస్తూ రెండు వారాల్లో పూర్తిగా దాణా ఇవ్వాలి. ఈనిన రెండు నుంచి ఎనిమిది గంటల్లో మాయ వేస్తాయి. అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే పశువైద్యుని సంప్రదించాలి.
మాయని ఆశాస్త్రీయ పద్ధతిలో లాగితే గర్భకోశం చిట్లి, రక్తస్రావం కలిగి పశువులు తిరిగి పొర్లకుండా పోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు పశువు మరణించే ప్రమాదం ఉంది. ఈనిన తర్వాత పశువులు మాయ తినకుండా జాగ్రత్త పడాలి. ఆధిక పాల దిగుబడి ఉండే పశువులు ఈనిన వెంటనే రెండు రోజుల వరకు పాలను సంపూర్ణంగా పితకకూడదు. అధిక పాలిచ్చే పశువులు ఈనిన తర్వాత పాల జ్వరం రాకుండా కాల్షియం ఇంజక్షన్ వేయించాలి. ఈనే వారం రోజుల ముందు, తర్వాత విటమిన్ డీ ఇవ్వాలి.
పశువులు ఈనే ముందు..ఈనిన తర్వాత..
Published Mon, Oct 6 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM
Advertisement
Advertisement