విటమిన్ ఏ సిరప్
నార్నూర్(ఆసిఫాబాద్): చిన్నారులకు భవిష్యత్‌లో ఎలాంటి కంటి చూపు సమస్యలు రాకూడదనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉచితంగా విటమిన్ ఏ అందిస్తోంది. కానీ గత ఆరు నెలలుగా జిల్లాలో ఈ మందు సరఫరా నిలిచిపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో 126 సబ్‌సెంటర్లు..
జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 05 అర్బన్ హెల్త్‌సెంటర్‌లు, 126 సబ్‌సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో 9 నెలల నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులు దాదాపు 30వేల మంది ఉన్నారు. చిన్నారులకు ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు ద్వారా ఇంటింటికి లేదా సబ్‌సెంటర్లలో ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఏ విటమిన్ సిరప్‌ను ఒక టీ స్పూన్ వేయాల్సి ఉంటుంది. ఆరు నెలలుగా ఏ విటమిన్ సిరప్ లేని కారణంగా చిన్నారులకు వేయడం లేదు.
ఆరు నెలలుగా నిలిచిన సరఫరా..
చిన్నారులకు కంటి చూపునకు సంబంధించిన సమస్యలు రాకూడదనే ఉద్దేశంలో ఏ విటమిన్ సిరప్‌ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. కానీ ఆరు నెలలుగా సబ్ సెంటర్లకు ఏ విటమిన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో చిన్నారులు రేచీకటి బారిన పడే అవకాశం ఉంది
ఆరు నెలలకో డోసు..
తొమ్మిది నెలలు నిండిన చిన్నారులకు ప్రతీ ఆరు నెలలకోసారి ఏ విటమిన్ సిరప్‌ను 5 ఏళ్ల చిన్నారుల వరకు అందిస్తారు. ఆరు నెలలుగా సరఫరా లేకపోవడంతో ఒక డోస్ సమయం ముగిసి రెండో డోస్ వచ్చే సమయం ఆసన్నమైనా ఇప్పటి వరకు ఏ విటమిన్ సరఫరా కావడం లేదు. 100 మిల్లీలీటర్ల ఏ విటమిన్ బాటిల్‌ను 2 ఎంఎల్ చొప్పున 50 మంది చిన్నారులకు ఏఎన్‌ఎంలు అందిస్తారు.
బయట దొరకని సిరప్
డబ్ల్యూహెచ్‌వో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా ఉచితంగా సరఫరా చేసే టీకాలు, సిరప్‌లు సకాలంలో జిల్లా స్థాయి అధికారులు తీసుకురాకుండా చిన్నారుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఏ విటమిన్ ఎక్కడా మార్కెట్‌లో లభించదు. దీంతో చిన్నారుల కంటిచూపుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఏ విటమిన్ సిరప్ 9నెలల చిన్నారుల నుంచి 5 ఏళ్లలోను చిన్నారులకు ప్రతి ఆరు ఆరునెలలలకొకసారి తొమ్మది డోసులు వేయడంతో జీవితంలో వీరికి కంటి చూపునకు సంబందించిన సమస్యలు తలెత్తవు. ఇది పూర్తిగా చేప నూనెతో తయారు చేసిన ద్రావణం కాబట్టి ఇది మార్కెట్‌లో ఎక్కడ లభించదు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి సబ్‌సెంటర్లకు ఏ విటమిన్ సిరప్‌ను సరఫరా చేయాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
అందుబాటులో ఉండేలా చూస్తాం
విటమిన్ ఏ సిరప్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికీ అన్ని పీహెచ్‌సీల నుంచి చిన్నారుల వివరాలతోపాటు ఇండెంట్ తెప్పించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా సరఫరా లేదు. ప్రభుత్వం నుంచి విటమిన్ ఏ సిరప్ రాగానే సబ్ సెంటర్లకు పంపిణీ చేస్తాం.
– రాజీవ్‌రాజ్, జిల్లా వైద్యాధికారి ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment