కను‘పాప’లకేది రక్షణ ?
Published Sat, Jul 23 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
–జిల్లాలో రెండు నెలలుగా నిలిచిన విటమిన్ ఏ సరఫరా
– అంధత్వ నివారణకు వేసే సిరప్ లేక ఇబ్బందులు
– ఆందోళన చెందుతున్న చిన్నారుల తల్లిదండ్రులు
నల్లగొండ టౌన్: చిన్నారులను అంధత్వం నుంచి కాపాడేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వేస్తున్న ఏ సిరఫ్ రెండు నెలలుగా నిలిచిపోయింది. దీని కోసం పీహెచ్‌సీలు, సబ్సెంటర్లు, పట్టణ ఆరోగ్యకేంద్రాల చుట్టూ చిన్నారుల తల్లిదండ్రులు ప్రదక్షిణలు చేస్తున్నారు. వ్యాధి నిరోధక టీకాలతో పాటు విటమిన్ ఏ సిరఫ్‌ను జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా సరఫరా చేస్తుంటారు. విటమిన్ ఏ సిరప్‌ను చిన్నారులకు తాగించడం వలన వారికి ఎలాంటి కంటి జబ్బులు రాకుండా కాపాడవచ్చు. జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు , సబ్‌సెంటర్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో వ్యాధి నిరోధక టీకాలతో పాటు విటమిన్ ఏ సిరప్‌ను కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అందుబాటులో ఉంచుతుంది. 9 నెలలు దాటిన చిన్నారికి 1 యూనిట్(1 ఎంఎల్) విటమిన్ ఏ ను తాగిస్తారు. అనంతరం ప్రతి ఆరు నెలలకు ఒక సారి 2 యూనిట్‌లు(2 ఎంఎల్) సిరప్‌ను 5 సంవత్సరాల వయస్సు వరకు తాగించడం ద్వారా ఆ చిన్నారులను రేచీకటి, అంధత్వం రాకుండా కాపాడవచ్చు. అయితే జిల్లాలో ప్రతి నెలా 4లక్షల యూనిట్‌లు( 4లక్షల ఎంఎల్) విటమిన్ ఏ సిరప్ అవసరం ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రెండు నెలలుగా ఈ సిరప్‌ను ప్రభుత్వం సరఫరా చేయకపోవడంతో దీని కోసం ఆస్పత్రుల చుట్టూ చిన్నారుల తల్లిదండ్రులు తిరుగుతున్నారు. ప్రై వేట్ ఆస్పత్రులకు వెళ్లి సిరఫ్ వేయించాలంటే పెద్ద ఖర్చుతో కూడుకున్న పనేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చిన్నారుల పట్ల ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇమ్యునైజేషన్‌కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులతో సరఫరా చేయాల్సిన విటమిన్ ఏ ను ఎందుకు పంపిణీ చేయడం లేదని పలువును చిన్నారుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి విటమిన్ ఏ ను జిల్లాకు తెప్పించి చిన్నారులను కాపాడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం సరఫరా చేయగానే పంపిస్తాం
జిల్లాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన విటమిన్ ఏ సిరప్ గత రెండు నెలలుగా సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వం నుంచి రాగానే అన్ని పీహెచ్‌సీలు, సబ్సెంటర్లు, పట్టణ ఆరోగ్యకేంద్రాలకు పంపిస్తాము.
– డాక్టర్ భానుప్రసాద్‌నాయక్, డీఎంహెచ్‌ఓ
Advertisement