పది మందిలో ఏడుగురి అభిప్రాయం
విశ్రాంత నిధిపై అవగాహన ఇప్పటికీ తక్కువే
యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఐరిస్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: పదవీ విరమణ (రిటైర్మెంట్) తర్వాత సౌకర్యవంతమైన జీవనానికి రూ.కోటి సరిపోతుందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ప్రతి పది మందికి గాను ఏడుగురు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే విశ్రాంత జీవన అవసరాలకు ఎంత నిధి కావాలన్న విషయమై ఇప్పటికీ అవగాహనన తక్కువగానే ఉందని యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ అధ్యయనం ‘ఐరిస్ 5.0’లో తెలిసింది.
→ ఐరిస్ ఇండెక్స్ స్కోరు 2022లో 44గా ఉంటే 2025లో 48కి చేరింది. ఈ సూచీ రిటైర్మెంట్ సన్నద్ధతను సూచిస్తుంది. నిజానికి గతేడాది 49 పాయింట్ల స్థాయిలో ఉండగా, అక్కడి నుంచి ఒక పాయింట్ తగ్గినట్టు తెలుస్తోంది.
→ ఆరోగ్యపరమైన సన్నద్ధత మెరుగుపడింది. పదవీ విరమణానంతరం సురక్షిత జీవనానికి ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారు.
→ 25–65 ఏళ్ల వసులోని 2,242 మంది అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. వీరిలో 50 శాతం మంది వేతన జీవులు కాగా, మిగిలిన వారు స్వయం ఉపాధిపై ఆధారపడి ఉన్నారు.
→ ఆర్జన ఆరంభమైన వెంటనే లేదా 35 ఏళ్లలోపే రిటైర్మెంట్ ప్రణాళిక మొదలు కావాలని 50 శాతం మంది చెప్పారు.
→ తమ విశ్రాంత జీవన ప్రణాళికను ఎలా ఆరంభించాలన్న దానిపై కొందరు అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. వీరికి విశ్వసనీయమైన సలహాలు అవసరమని ఈ సర్వే పేర్కొంది.
‘‘వివేకమైన, సమగ్రమైన పదవీ విరమణ ప్రణాళిక వైపు స్పష్టమైన మార్పును ఐరిస్ 5.0 సూచిస్తోంది. ఆరోగ్యం పట్ల నేడు మంచి అవగాహన పెరుగుతోంది. ఉత్పత్తులపై అవగాహన, స్థిరమైన ఆర్థిక విశ్వాసం కనిపిస్తోంది’’అని యాక్సిస్ మ్యాక్స్‌లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో సుమిత్ మదన్ తెలిపారు.


