గడ్డ కట్టిన విటమిన్–ఏ ద్రావణం బాటిళ్లు
‘‘చిన్నారుల కంటిచూపు మెరుగునకు వేసే విటమిన్–ఏ ద్రావణం గడ్డకట్టింది. చివరి క్షణంలో విషయం బహిర్గతం కావడంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వెంటనే జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సమాచారమిచ్చింది. సోమ, మంగళవారాల్లో వేయాల్సిన చుక్కల మందు పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది.
సాక్షి, తిరుపతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చిన్నారుల కంటి చూపు మెరుగు కోసం విటమిన్–ఏ ద్రావణం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని 4.06లక్షల మంది 9నెలల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు కంటిచుక్కల మందు వేయాలని భా వించింది. జిల్లావ్యాప్తంగా 10,500 బాటిళ్లను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ద్రా వణం నాసిరకంగా తయారుకావడంతో పంపిణీకి ముందే బాటిళ్లలో గడ్డ కట్టినట్లు అధికారులు గుర్తించారు. అది కూడా ఆదివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బాటిళ్లను సరఫరా చేసే సమయంలో గుర్తించినట్లు తెలిసింది. చిన్నారుల ప్రాణాలతో ముడిపడిన ఈ ద్రావణంలో ఉన్నత ప్రమాణాలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఫార్మా కంపెనీలు నాణ్యతను పాటించలేదని వైద్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ద్రావణం గడ్డ కట్టిందని చర్చించుకుంటున్నారు.
షాక్ అయిన వైద్యబృందం..
గడ్డ కట్టిన విటమిన్–ఏ ద్రావణాన్ని చూసి వైద్యులు షాక్‌కు గురయ్యారు. ఈ ద్రావణాన్ని పరిశీలించకుండా చిన్నారులకు పంపిణీ చేసి ఉంటే పరిస్థితి ఆందోళనకరంగా ఉండేదని వైద్య సిబ్బంది చర్చించుకున్నారు. ఈ విషయం బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. పీహెచ్‌సీలకు ఈ విషయాలేమీ తెలియపరచకుండా కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ఆదేశాలిచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల పరిధిలో గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. 9నెలలు నిండి 5సంవత్సరాల లోపు పిల్లలకు ఈ ద్రావణం వేయడం వల్ల కలిగే ప్రయాజనాల గురించి అవగాహన కల్పించారు. 9నెలల నుంచి ఏడాది లోపు వయస్సు కలిగిన పిల్లలకు ఒక ఎంఎల్, ఏడాది దాటి ఐదేళ్ల లోపు చిన్నారులకు 2ఎంఎల్ మోతాదుగా ద్రావణం పోయాలని నిర్ణయించారు. ఈ మేరకు గ్రామస్థాయిలో ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ వర్కర్లను అప్రమత్తం చేశారు. సోమ, మంగళవారాల్లో పంపిణీ చేయాలని డీఎం అండ్ హెచ్‌వో నుంచి పీహెచ్‌సీలకు ఆదేశాలందాయి.
కొన్ని పీహెచ్‌సీలకు ఇప్పటికే సరఫరా..
విటమిన్–ఏ ద్రావణాన్ని ఈనెల 23, 24 తేదీలలో పంపిణీ చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేసిన అధికారులు కొన్ని పీహెచ్‌సీలకు ఇప్పటికే సరఫరా చేశారు. మరికొంత డీఎంహెచ్‌వో కార్యాలయంలోనే స్టాకు ఉండిపోయింది. తమ వద్దనున్న స్టాకును కూడా పరీక్షించగా గడ్డకట్టి వినియోగానికి పనికిరాదని వైద్యాధికారులు నిర్ధారించారు. వెంటనే అప్రమత్తమై పంపిణీ వాయిదా వేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment