Nutritional disorders
-
విటమిన్–ఏ లోపం తగ్గింది.. డేంజర్ బెల్స్
సాక్షి, హైదరాబాద్: అంధత్వ నివారణ కోసం దేశంలో ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలకు విటమిన్–ఏ సప్లిమెంట్లు ఇచ్చే విషయంపై సమీక్ష జరగాలని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ సూచించింది. దశాబ్దాల కింద ప్రారంభించిన విటమిన్–ఏ సప్లిమెంటేషన్ కార్యక్రమం సత్ఫలితాలిచ్చిందని, ఇప్పుడు విటమిన్–ఏ లోపం ప్రజారోగ్య సమస్య కాదని పేర్కొంది. బెంగళూరులోని సెయింట్ జాన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఢిల్లీలోని సీతారామ్ భార్తియ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్‌తో కలసి నిర్వహించిన అధ్యయనం ద్వారా ఈ విషయం స్పష్టమైందని ఓ ప్రకటనలో తెలిపింది. భారతీయ బాలల్లో విటమిన్–ఏ లోపం ప్రమాదం 20 శాతం కంటే తక్కువకు చేరిందని వివరించింది. ఐదేళ్ల వయసు వచ్చే వరకు 6 నెలలకోసారి భారీ మొత్తంలో విటమిన్–ఏ ఇచ్చే ప్రస్తుత పద్ధతిని కొనసాగిస్తే హైపర్ విటమినోసిస్ (అవసరానికి మించి విటమిన్లు) సమస్యకు దారితీయొచ్చని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా ఒకే పద్ధతి కాకుండా.. అవసరాలను బట్టి రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాన్ని చేపట్టొచ్చని సూచించింది. అధ్యయనం వివరాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమయ్యాయని పేర్కొంది. చదవండి: బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ తప్పనిసరి -
బరువు తక్కువ బాల్యం!
సాక్షి, అమరావతి: ఆటపాటలతో ఆనందంగా బాల్యాన్ని గడపాల్సిన చిన్నారులు బరువు తక్కువ, పౌష్టికాహార లోపాలతో భారంగా గడుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న లక్షల మంది చిన్నారులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద సర్కారు కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నా చిన్నారులను పౌష్టికాహార లోపం పట్టిపీడించడం గమనార్హం. ఊబకాయం, ఎదుగుదల లోపాలు రాష్ట్రంలోని పిల్లల్లో ఎదుగుదల సరిగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. ఐదేళ్లలోపు పిల్లలు 23.82 లక్షల మంది ఉండగా ఏకంగా 36.4 శాతం అంటే 8.69 లక్షల మందిలో ఎదుగుదల సరిగా లేదని తేలింది. మరోవైపు ఊబకాయం ముప్పు కూడా విస్తరిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలో 12.7 శాతం మంది ఐదేళ్ల లోపు పిల్లలు ఊబకాయంతో బాధపడుతుండగా ఈ ఏడాది జనవరి నాటికి ఇది 14.6 శాతానికి పెరిగింది. 3.45 లక్షల మంది చిన్నారులు ఊబకాయంతో సతమతమవుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నివేదిక స్పష్టం చేసింది. కర్నూలులో పౌష్టికాహార లేమి కర్నూలు జిల్లా పిల్లల్లో పౌష్టికాహార లోపాలు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. కర్నూలు జిల్లాల్లో ఐదేళ్లలోపు పిల్లలు 2.75 లక్షల మంది ఉండగా 1.24 లక్షల మందిలో ఎదుగుదల సరిగా లేదు. ఇదే జిల్లాలో 56,600 మంది తక్కువ బరువుతో సతమతం అవుతున్నారు. 26,500 మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. 21,800 మందిలో ఎత్తుకు తగినట్లుగా బరువు లేదు. ఎస్టీల పరిస్థితి దయనీయం ఇక ఇతర మండలాలకన్నా ఎస్టీలు అధికంగా నివసించే 30 మండలాల్లో చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రభుత్వ నివేదికలో స్పష్టమైంది. 30 ఎస్టీ మండలాల్లో బరువు తక్కువగల పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో సగటున బరువు తక్కువ పిల్లలు రెండు శాతం మంది ఉంటే 30 ఎస్టీ మండలాల్లో ఏకంగా 4.2 శాతం మంది బరువు తక్కువగల పిల్లలున్నారు. జిల్లాలవారీగా చూస్తే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 14 శాతం మంది తక్కువ బరువున్న పిల్లలున్నారు. ఊబకాయం కలిగిన పిల్లల సంఖ్య శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మినహా అన్ని చోట్లా పెరగడం ఆందోళన కలిగిస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
విటమిన్ –డి తో పిల్లలకు పుష్టి!
దేశంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతన్న పిల్లలు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వీరందరికీ తగినన్ని పోషకాలు అందించేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే విటమిన్ – డి ని అందిస్తే అది పిల్లలు పుష్టిగా ఎదిగేందుకు మాత్రమే కాకుండా, బరువు పెరిగేందుకు, కదలికలకు సంబంధించిన నైపుణ్యాలను వేగంగా అందుకునేందుకు కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు పంజాబ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలతో కలిసి జరిపిన అధ్యయనం ద్వారా తాము ఈ విషయాన్ని తెలుసుకోగలిగామని డాక్టర్ జవేరియా సలీమ్ తెలిపారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. ఆరు నెలల నుంచి ఐదేళ్ల మధ్య వయస్కులపై విటమిన్ – డి ప్రభావం బాగా ఉంది. ఎనిమిది వారాలపాటు వీరిలో కొంతమందికి ఐదు మిల్లీగ్రాములు లేదా రెండు లక్షల ఐంటర్నేషనల్ యూనిట్ల విటమిన్ – డి అందించారు. మిగిలినవారికి అధిక శక్తి గల ఆహారం, కొంతమందికి సాధారణ ఆహారం అందించారు. ఆ తరువాత పిల్లలను పరిశీలించగా ఎన్నో ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. మిగిలిన వారితో పోలిస్తే వేగంగా నడవడం మొదలుకొని బరువు కూడా పెరిగారని సలీమ్ తెలిపారు. విటమిన్ – డి కేంద్ర నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుందనేందుకు ఈ అధ్యయనం తొలి నిదర్శనమని, మరిన్ని పరిశోధనల ద్వారా ఈ విషయాలను నిర్ధారించుకుంటే పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు చవకైన, సులువైన మార్గం దొరికినట్లేనని వివరించారు. -
40 మంది కాదు.. 18 మందే మృతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న శిశు గృహాల్లో 2017 జనవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు 18 మరణాలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. వీరంతా చెత్తకుండీల్లో, మార్కెట్ల వద్ద దొరికిన శిశువులని, దొరికే సమయానికే వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, శక్తి వంచన లేకుండా డాక్టర్లు ప్రయత్నించినా వీరి ప్రాణాలను కాపాడలేకపోయారని తెలిపింది. ఇలా జరిగిన మరణాలే తప్ప, నిర్లక్ష్యం వల్ల, పౌష్టికాహార లోపం వల్ల శిశు గృహాల్లో ఏ ఒక్క శిశువూ మరణించలేదని వివరించింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న శిశు గృహాల్లో పెద్ద ఎత్తున శిశు మరణాలు సంభవిస్తున్నాయని, శిశు విక్రయాలు కూడా జరుగుతున్నాయని, ఇందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి విచారణ జరిపేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుతరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. శిశు గృహాల్లో 40 మంది శిశువులు చనిపోయింది వాస్తవమో కాదో తెలియచేయాలని ప్రభుత్వాన్ని గత విచారణ సమయంలో ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఓ నివేదికను ధర్మాసనం ముందు ఉంచింది. -
పొత్తిళ్లలోనే ప్రాణాలు పోతున్నాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధి సూచికలు నేల చూపులు చూస్తున్నాయి. మాతా, శిశు మరణాలను తగ్గించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. పౌష్టికాహార లోపం, రక్తహీనత వంటివి రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నాయి. కాన్పు సమయంలో తల్లీబిడ్డల మరణాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అది ఆచరణలో సఫలం కావడం లేదని తాజాగా ప్రణాళికా శాఖ నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలో శిశు మరణాలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మూడు త్రైమాసికాలను పరిశీలిస్తే తొలి త్రైమాసికంలో శిశు మరణాల సంఖ్య కంటే ఆ తరువాత రెండు, మూడు త్రైమాసికాల్లో మరణాల సంఖ్య పెరగడం గమనార్హం. నెలకు 782 మంది చొప్పున ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 9 నెలల్లో 7,037 మంది శిశువులు మృతిచెందారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 6,966 మంది పసిబిడ్డలు మరణించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 9 నెలల్లోనే అంతకంటే ఎక్కువమంది మృత్యువాత పడ్డారు. కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో రెండో త్రైమాసికం కంటే మూడో త్రైమాసికంలో శిశు మరణాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. చిత్తూరు జిల్లాలో రెండో త్రైమాసికంలో 164 శిశు మరణాలు సంభవించగా, మూడో త్రైమాసికంలో ఆ సంఖ్య 253కి పెరిగింది. పశ్చిమగోదావరి జిల్లాల్లో రెండో త్రైమాసికంలో 29 మంది, మూడో త్రైమాసికంలో 60 మంది శిశువులు మృతిచెందారు. పసిప్రాయం.. పౌష్టికాహారానికి దూరం కాన్పు సమయంలో తల్లుల మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. గత ఆర్థిక సంవత్సరంలో మాతా మరణాల సంఖ్య 517 కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 9 నెలల్లోనే 460 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ఐదేళ్లలోపు పిల్లల్లో పెరుగుదల లోపం ఉన్న వారు గతంలో 27.7 శాతం కాగా, ప్రస్తుతం 31.4 శాతానికి పెరింది. ఐదేళ్ల లోపు పిల్లల్లో బరువు తక్కువగా ఉన్న వారు గతంలో 27.3 శాతం కాగా, ఇప్పుడు 31.9 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో 10 లక్షల మంది గర్భిణులు రక్తహీనత, కాల్షియం లోపంతో బాధపడుతున్నారని, వీరిలో కేవలం 3.1 లక్షల మందికే పౌష్టికాహారం అందుతోందని ప్రణాళికా శాఖ నివేదిక స్పష్టం చేసింది. అలాగే ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు వయసున్న 19 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సి ఉండగా, 15.58 లక్షల మందికే అందుతోందని వెల్లడించింది. మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు వయసున్న 24 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సి ఉండగా, 8.31 లక్షల మందికే పేర్కొంది. -
ఎండిన పొట్టలు.. బాగా నిండిన పొట్టలు!
ఒక పొట్ట.. రెండు సమస్యలు.. ఒక దేశం.. రెండు పరస్పర విరుద్ధ పరిస్థితులు.. ఓవైపు పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్యలో మన దేశం ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉంది.. అదే సమయంలో అధిక బరువుతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్యలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.. జంక్‌ఫుడ్ అనేసరికి అమెరికన్లు వాళ్లు ఎక్కువగా తింటారు.. అందుకే వారంతా లావుగా ఉంటారు.. అని అనుకుంటుంటాం. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎందుకంటే మన దేశంలో ఊబకాయంతో బాధపడే చిన్నారుల సంఖ్య అమెరికాను దాటిపోయిందట. ఈ జాబితాలో చైనా తొలిస్థానంలో ఉంది. గత దశాబ్ద కాలంలో దేశంలో ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య దాదాపు రెట్టింపైంది. లాన్సెట్ జర్నల్ తాజా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 1975–2016 మధ్య 200 దేశాల్లో బీఎంఐ(బాడీ మాస్ ఇండెక్స్) ట్రెండ్స్‌పై ఈ సర్వే నిర్వహించారు. ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 5–19 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఊబకాయంతో బాధపడే బాలికల సంఖ్య గత 40 ఏళ్ల కాలంలో 50 లక్షల నుంచి 5 కోట్లకు పెరిగింది. ఇదే వయసు కలిగిన బాలుర సంఖ్య 60 లక్షల నుంచి 7.4 కోట్లకు చేరింది. ఇక పోషకాహారలోపాన్ని ఊబకాయంతో పోల్చి చూస్తే పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. అటు పోషకాహారలోపం.. ఇటు ఊబకాయం దేశంపై దాదాపు సమానస్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. పోషకాహార లోపం కలిగిన వారి సంఖ్య గత పదేళ్లలో మూడింట ఒక వంతు శాతం తగ్గినా.. ఇప్పటికీ దేశంలో నిర్దేశిత బరువు కంటే తక్కువ ఉన్న, వయసుకు తగ్గ ఎత్తు లేని, పోషకాహార లోపం కలిగిన చిన్నారుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఏ ఇతర దేశాలతో పోల్చి చూసినా ఈ సంఖ్య ఎక్కువే. అయితే, నిరుపేద ఆఫ్రికా దేశాల కంటే ఈ విషయంలో భారత్ వెనకబడి ఉండటానికి అధిక జనాభానే కారణం. మనకంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలు కూడా ప్రజలకు ఆరోగ్యకరమైన, స్థిరమైన ఆహారాన్ని అందిస్తున్నాయి. ఈ విషయంలో మనం వెనుకబడి ఉండటం గమనార్హం. దేశంలో ఊబకాయం కలిగి ఉన్న వారి సంఖ్య ఎక్కువున్న జిల్లాలు ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండగా.. పోషకాహారలోపం ఉన్నవారు ఎక్కువగా ఉన్న జిల్లాల సంఖ్య మధ్య భారతంలో అధికం. ఒబేసిటీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంటే.. పోషకాహారలోపం ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలకు కారణమవుతోంది. -
వీలైతే నివారిద్దాం... లేదంటే అధిగమిద్దాం
అంగవైకల్యం ఎవరూ కోరుకోని స్థితి. ఎవరిమీదో ఆధారపడాల్సిన పరిస్థితి. వీలైతే ఆ స్థితిని నివారించడం లేదా దాన్ని అధిగమించడం ఎవరైనా చేయాల్సిన పనులు. ఎవరిలోనైనా ఒక అంగం వైకల్యానికి లోనైతే... మిగతా అంగాలు మరింత సామర్థ్యాన్ని పుంజుకుని, దాన్ని భర్తీ చేస్తాయని ఒక నానుడి. ఆ మాటను నిజం చేసే దృష్టాంతాలెన్నో! వారిలోనే కాదు... అంగవైకల్యం లేనివారిలోనూ స్ఫూర్తి నింపే ఉదంతాలెన్నో... ప్రపంచ వైకల్య దినం సందర్భంగా... పిల్లల్లో వచ్చే వైకల్యాలు, వాటి రకాలు, కారణాలు, నివారణ వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. అంగవైకల్యాలకు ప్రధాన కారణాలు =అంటువ్యాధులు = చిన్నప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్లు =త్వరగా మాతృత్వానికి దగ్గర కావడం =పోషకాహార లోపాలు =ఆసుపత్రి సేవలు అందుబాటులో లేకపోవడం =అపరిశుభ్రత =దగ్గరి బంధువుల్లో పెళ్లిళ్లు అంగవైకల్యాలను పురిగొలిపే రిస్క్ ఫ్యాక్టర్లు =గర్భవతిగా ఉన్నప్పుడు జ్వరం =గర్భంతో ఉన్నప్పుడు రేడియేషన్‌కు గురికావడం =బిడ్డ కడుపులో ఉండగా తల్లి ఏ రూపంలోనైనా పొగాకును వాడటం =తల్లిగర్భంలో ఉండగా వచ్చే దుష్ర్పభావాలు / ప్రసూతి సమయంలో దుష్ర్పభావాలు = పుట్టీపుట్టగానే వచ్చే కామెర్లు తీవ్రం కావడం వల్ల మెదడుపై దుష్ర్పభావం పడటం పుట్టిన తర్వాత బిడ్డ చాలా ఆలస్యంగా ఏడ్వటం = వికాసంలో వచ్చే మార్పులు ఆలస్యం కావడం (డిలేడ్ మైల్‌స్టోన్స్) = తల్లిదండ్రుల నిరక్షరాస్యతతో అనేక ఆరోగ్య సంబంధమైన అంశాలపై అవగాహన లేకపోవడం = చిన్నప్పుడు ఫిట్స్ / తలకు గాయం. వైకల్యంలో రకాలు స్థూలంగా... పిల్లల్లో రకరకాలైన వైకల్యాలు రావచ్చు. వాటిలో అంగాలకు సంబంధించే గాక, బుద్ధికి సంబంధించి కూడా ఉండవచ్చు. వైకల్యంలోని అనేక రకాల్లో కొన్ని... ఆటిజమ్ = చెవుడు/వినికిడి శక్తి తక్కువగా ఉండటం =అంధత్వం / దృష్టికి సంబంధించిన లోపాలు = బుద్ధిమాంద్యం = అర్థం చేసుకోగల సామర్థ్యం తక్కువగా ఉండటం =ఒకటి కంటే ఎక్కువ అంగవైకల్యాలు ఉండటం =శరీర అవయవాలకు సంబంధించిన వైకల్యాలు (ఆర్థోపెడిక్ ఇంపెయిర్మెంట్) =నేర్చుకునే శక్తి తక్కువగా ఉండటం =మూగతనం =తలకు (మెదడుకు) తీవ్రమైన గాయం కావడం వల్ల వచ్చే వైకల్యాలు (అక్వైర్డ్ బ్రెయిన్ ఇంజ్యురీ-ఏబీఐ) =సెరిబ్రల్ పాల్సీ వైకల్య లోపాలను నివారించడం / అధిగమించడం ఎలా? సాధారణ నివారణ చర్యలు (జనరల్ ప్రివెన్షన్) =లోపాన్ని వీలైనంత త్వరగా కని పెట్టి అధిగమించడాన్ని త్వరగా మొదలుపెట్టడం =ప్రాథమిక స్థాయిలో ఆరోగ్యాన్ని కాపాడే చర్యలను తీసుకోవడం =అన్ని టీకాలూ సకాలంలో అందేలా చూడటం =ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించేలా చేయడం =వాతావరణ ప్రమాదాలను (ఎన్విరాన్మెంటల్ హజార్డ్) నివారించడం =అంగవైకల్యం, పునరావాసం వంటి అంశాలపై అవగాహనపెంచే కార్యక్రమాల నిర్వహణ. ఆరోగ్య సంబంధమైన పరీక్షలు చూపు వినికిడి దంతాలు వ్యాధినిరోధక అంశాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించడం న్యూట్రిషనల్ అసెస్మెంట్ డెవలప్మెంటల్ అసెస్మెంట్ తరచూ రక్తహీనత, రక్తంలో విషపదార్థాల అంచనా, క్షయ వంటి జబ్బులకు సంబంధించిన పరీక్షలు. ఒక్కొక్క అంశంపై విడివిడి జాగ్రత్తలు చూపు కాపాడటానికి : పిల్లల్లో అంధత్వానికి ప్రధాన కారణం విటమిన్-ఏ లోపం. కాబట్టి విటమిన్ ఏ పుష్కలంగా ఉండే పదార్థాలు ఇవ్వడం ద్వారా చూపు కాపాడటమే కాకుండా, నైట్బ్లైండ్నెస్ వంటి జబ్బులను నివారించవచ్చు. పిల్లలకు తరచూ కంటి పరీక్షలు చేయిస్తుండటం వల్ల వాళ్లలో చూపునకు సంబంధించిన సమస్యలను త్వరగా గుర్తించి అవసరాన్ని బట్టి అద్దాలతో సరిచేయదగిన వాటిని సరిదిద్దడం లేదా అవసరాన్ని బట్టి చికిత్స చేయడం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చు. మెల్లకన్ను వంటివి ఉన్నప్పుడు దాన్ని చక్కదిద్దడానికి అవసరమైన కంటి వ్యాయామాలను నేర్పడం చేయవచ్చు. వినికిడి శక్తిని కాపాడటానికి: తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు వచ్చే కామెర్లవ్యాధికి వీలైనంత త్వరగా చికిత్స చేయించాలి. కుటుంబంలో ఎవరికైనా వినికిడి లోపాలు ఉంటే, తరచూ పిల్లలకు వినికిడి పరీక్ష చేయించాలి. బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వస్తే అది తగ్గేవరకూ పూర్తి చికిత్స చేయించాలి. పుట్టుకతో వచ్చే వినికిడి లోపాలను ముందుగానే తెలుసుకుని, కాక్లియర్ / హియరింగ్ ఎయిడ్ అమర్చడం వంటి చికిత్సలు చేయిస్తే వారికి వినికిడి శక్తి మాత్రమే గాక... మాట్లాడే శక్తి కూడా వస్తుంది. బుద్ధిమాంద్యత: పిల్లల్లో బుద్ధిమాంద్యానికి ప్రధాన కారణం హైపోథైరాయిడిజమ్. దీన్ని ఎంత త్వరగా గుర్తించి థైరాక్సిన్ హార్మోన్‌ను ఇస్తే అంత త్వరగా బుద్ధిమాంద్యతను నివారించవచ్చు. ఇక తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే ‘ఐయొడైజ్డ్ ఉప్పు’ వాడటం వల్ల పిల్లల్లో బుద్ధిమాంద్యత ను నివారించవచ్చు. పుట్టుకతో వచ్చే అంగవైకల్యాల నివారణ/చికిత్స ఇలా... న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ (స్పైనా బైఫిడా): కాబోయే తల్లికి తగినంత ఫోలిక్ యాసిడ్ అనే పోషకం అందకపోతే బిడ్డలో ఏర్పడాల్సిన వెన్నుపాము (న్యూరల్ ట్యూబ్) సరిగా రూపొందకపోవచ్చు. ఈ పరిస్థితిని స్పైనా బైఫిడా అంటారు. ఈ వైకల్యం ఏర్పడితే బిడ్డ కడుపులో ఉండగానే మృతి చెందవచ్చు. ఒకవేళ పుట్టి బతికితే శారీరకంగా, మానసికంగా వైకల్యాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని తెలుసుకోవడం కోసం అవసరమైన పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. డౌన్స్ సిండ్రోమ్: బిడ్డలో ఉండాల్సిన క్రోమోజోముల సంఖ్య 46. ఏదైనా కారణాల వల్ల ఒక అదనపు క్రోమోజోము ఉంటే ఆ బిడ్డకు డౌన్స్ సిండ్రోమ్ అనే కండిషన్ వస్తుంది. దీనివల్ల బిడ్డలో బుద్ధిమాంద్యం కలుగుతుంది. ముప్ఫై అయిదేళ్ల తర్వాత గర్భం ధరించే మహిళల్లో బిడ్డకు డౌన్స్ సిండ్రోమ్ వచ్చే రిస్క్ ఎక్కువ. అందుకే ఈ వయసు లో గర్భధారణ జరిగిన మహిళలతో పాటు మిగతా గర్భవతు లూ కొన్ని పరీక్షలు చేయించుకోవడం అవసరం. గర్భధారణ తర్వాత 11 - 14 వారాల మధ్యన కాబోయే తల్లి ఎన్టీ స్కాన్ పరీక్ష చేయించాలి. దీన్నే ఫస్ట్ సెమిస్టర్ స్క్రీనింగ్ అంటారు. ఒకవేళ ఎవరైనా పైపరీక్ష చేయించుకోకపోతే 15వ వారం నుంచి 20 వ వారం లోపున ట్రిపుల్ సీరమ్ స్క్రీనింగ్ లేదా క్వాడ్రపుల్ పరీక్ష చేయించుకోవాలి. ఇందులో కడుపులోని పిండం తల్లి గర్భంలోకి విడుదల చేసే 3 - 4 రకాల ప్రోటీన్లను పరిశీలిస్తారు. వాటి పాళ్ల నిష్పత్తిని బట్టి బిడ్డకు వైకల్యం వస్తుందో రాదో చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీనితో డౌన్స్ సిండ్రోమ్ తెలుసుకునేందుకు 60- 70 శాతం అవకాశాలున్నా ఒక్కోసారి తప్పుడు ఫలితం రావచ్చు. అందుకే దీంతో పాటు ‘టిఫా’ స్కాన్ అనే పరీక్ష చేయిస్తే తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం తగ్గుతుంది. పైన పేర్కొన్న పరీక్షలో పాజిటివ్ వచ్చినంత మాత్రాన బిడ్డకు తప్పక వైకల్యం వస్తుందని కాదు. అందుకే 15వ వారంలో ట్రిపుల్ లేదా క్వాడ్రపుల్ పరీక్ష చేయించి, ఫాల్స్ పాజిటివ్ గనక వస్తే... అప్పుడు గర్భధారణ తర్వాత 16వ వారంలో యామ్నియోసెంటైసిస్ అనే పరీక్షను చేయించుకుని, మొదట వచ్చింది నిజమైన పాజిటివా లేక ఫాల్స్ పాజిటివా అని నిర్ధారణ చేసుకోవాలి. నిర్మాణపరమైన అవయవ లోపాల కోసం టిఫా పరీక్ష: ఎవరిలోనైనా కడుపులోని బిడ్డలో అవయవ నిర్మాణాల పరమైన లోపాలు (స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్) ఉన్నట్లు అనుమానిస్తే వారికి టిఫా స్కాన్ అనే ప్రత్యేకమైన స్కానింగ్ చేయించాలి. జెనెటిక్ సోనోగ్రామ్ పరీక్షలు: బిడ్డ నిర్మాణంలో ఏవైనా లోపాలున్నాయా అని ఈ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు. ఇందులో క్రోమోజోమల్ సమస్యలూ తెలుస్తాయి. ఈ పరీక్ష ద్వారా బిడ్డ లోపలి అవయవాలైన గుండె, మెదడు, మూత్రపిండాలు, కాళ్లు-చేతులు, ముఖం, కళ్లు, ఊపిరితిత్తులు, వెన్నెముక, అబ్డామినల్ అవయవాల (కడుపు లోపలి భాగాల) గురించి తెలుసుకోవచ్చు. - నిర్వహణ: యాసీన్ దగ్గరి బంధువులను పెళ్లి చేసుకుంటే వైకల్యాలు ఎందుకు ఎక్కువ? రక్తసంబంధీకులు లేదా దగ్గరి బంధువుల మధ్య వివాహాలు జరిగితే... వాళ్లకు పుట్టబోయే బిడ్డల్లో అంగవైకల్యాలు, ఆరోగ్యసమస్యలు ఎక్కువ. ఎందుకంటే... బిడ్డలో తల్లివి 23, తండ్రివి 23 క్రోమోజోములు తల్లిదండ్రుల నుంచి పుట్టబోయే బిడ్డలకు వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తాయి. కాసేపు దంపతులిద్దరూ రక్తసంబంధీకులు కాదని అనుకుందాం. అప్పుడు ఒక సమాచారాన్ని బిడ్డకు చేరవేసే ఒక జన్యువు తండ్రిలో లోపభూయిష్టంగా ఉందనుకుంటే... తల్లి తాలూకు మంచి జన్యువుతో ఆ లోపం భర్తీ అవుతుంది. అదే తల్లిలో ఉండే లోపభూయిష్టమైన అదే తరహా జన్యువును తండ్రి తాలూకు జన్యువు డామినేట్ చేసి, బిడ్డలో లోపం రాకుండా చూస్తుంది. కానీ ఇద్దరూ ఒకే కుటుంబాలకు సంబంధించిన వారైతే, ఇద్దరిలోనూ సదరు సమాచారాన్ని తీసుకెళ్లే జన్యువులో లోపం ఉందనుకుందాం. అప్పుడు దాన్ని అధిగమించేలా చేయడానికి డామినెంట్ జన్యువు ఏదీ లేకపోవడంతో బిడ్డ లో జన్యుపరమైన లోపం వచ్చేందు కు అవకాశాలు ఎక్కువ. అందుకే ఆరోగ్యకరమైన బిడ్డలు కావాలనుకు నేవారు, బిడ్డలకు వైకల్యం లేకుండా, ఉండాలనుకునేవారు రక్తసంబంధీకుల్లో వివాహాలు చేసుకోకపోవడమే మంచిది. డా. శివ నారాయణరెడ్డి వెన్నపూస కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ రెయిన్బో హాస్పిటల్స్, సికింద్రాబాద్