వీలైతే నివారిద్దాం... లేదంటే అధిగమిద్దాం | Disablity Prevention or surmount | Sakshi
Sakshi News home page

వీలైతే నివారిద్దాం... లేదంటే అధిగమిద్దాం

Published Tue, Dec 3 2013 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM

Disablity Prevention or surmount

అంగవైకల్యం ఎవరూ కోరుకోని స్థితి. ఎవరిమీదో ఆధారపడాల్సిన పరిస్థితి. వీలైతే  ఆ స్థితిని నివారించడం లేదా దాన్ని అధిగమించడం ఎవరైనా చేయాల్సిన పనులు. ఎవరిలోనైనా ఒక అంగం వైకల్యానికి లోనైతే... మిగతా అంగాలు మరింత సామర్థ్యాన్ని పుంజుకుని, దాన్ని భర్తీ చేస్తాయని ఒక నానుడి. ఆ మాటను నిజం చేసే దృష్టాంతాలెన్నో!  వారిలోనే కాదు... అంగవైకల్యం లేనివారిలోనూ స్ఫూర్తి నింపే ఉదంతాలెన్నో... ప్రపంచ వైకల్య దినం సందర్భంగా... పిల్లల్లో వచ్చే వైకల్యాలు, వాటి రకాలు, కారణాలు, నివారణ వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.
 
 అంగవైకల్యాలకు ప్రధాన కారణాలు
 =అంటువ్యాధులు
 = చిన్నప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్లు  
 =త్వరగా మాతృత్వానికి దగ్గర కావడం  
 =పోషకాహార లోపాలు
 =ఆసుపత్రి సేవలు అందుబాటులో లేకపోవడం  
 =అపరిశుభ్రత  
 =దగ్గరి బంధువుల్లో పెళ్లిళ్లు
 
 అంగవైకల్యాలను పురిగొలిపే రిస్క్ ఫ్యాక్టర్లు
 =గర్భవతిగా ఉన్నప్పుడు జ్వరం  
 =గర్భంతో ఉన్నప్పుడు రేడియేషన్‌కు గురికావడం  
 =బిడ్డ కడుపులో ఉండగా తల్లి ఏ రూపంలోనైనా పొగాకును వాడటం  
 =తల్లిగర్భంలో ఉండగా వచ్చే దుష్ర్పభావాలు / ప్రసూతి సమయంలో దుష్ర్పభావాలు
 = పుట్టీపుట్టగానే వచ్చే కామెర్లు తీవ్రం కావడం వల్ల మెదడుపై దుష్ర్పభావం పడటం  పుట్టిన తర్వాత బిడ్డ చాలా ఆలస్యంగా ఏడ్వటం
 = వికాసంలో వచ్చే మార్పులు ఆలస్యం కావడం (డిలేడ్ మైల్‌స్టోన్స్)
 = తల్లిదండ్రుల నిరక్షరాస్యతతో అనేక ఆరోగ్య సంబంధమైన అంశాలపై అవగాహన లేకపోవడం
 = చిన్నప్పుడు ఫిట్స్ / తలకు గాయం.
 
 వైకల్యంలో రకాలు స్థూలంగా...
 పిల్లల్లో రకరకాలైన వైకల్యాలు రావచ్చు. వాటిలో అంగాలకు సంబంధించే గాక, బుద్ధికి సంబంధించి కూడా  ఉండవచ్చు. వైకల్యంలోని అనేక రకాల్లో కొన్ని...  ఆటిజమ్
 = చెవుడు/వినికిడి శక్తి తక్కువగా ఉండటం
 =అంధత్వం / దృష్టికి సంబంధించిన లోపాలు
 = బుద్ధిమాంద్యం
 = అర్థం చేసుకోగల సామర్థ్యం తక్కువగా ఉండటం  
 =ఒకటి కంటే ఎక్కువ అంగవైకల్యాలు ఉండటం  
 =శరీర అవయవాలకు సంబంధించిన వైకల్యాలు (ఆర్థోపెడిక్ ఇంపెయిర్‌మెంట్)  
 =నేర్చుకునే శక్తి తక్కువగా ఉండటం  
 =మూగతనం  
 =తలకు (మెదడుకు) తీవ్రమైన గాయం కావడం వల్ల వచ్చే వైకల్యాలు (అక్వైర్‌డ్ బ్రెయిన్ ఇంజ్యురీ-ఏబీఐ)  
 =సెరిబ్రల్ పాల్సీ
 
 వైకల్య లోపాలను నివారించడం / అధిగమించడం ఎలా?
 సాధారణ నివారణ చర్యలు (జనరల్ ప్రివెన్షన్)
 =లోపాన్ని వీలైనంత త్వరగా కని పెట్టి అధిగమించడాన్ని త్వరగా మొదలుపెట్టడం  =ప్రాథమిక స్థాయిలో ఆరోగ్యాన్ని కాపాడే చర్యలను తీసుకోవడం
 =అన్ని టీకాలూ సకాలంలో అందేలా చూడటం  
 =ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించేలా చేయడం  
 =వాతావరణ ప్రమాదాలను (ఎన్విరాన్‌మెంటల్ హజార్డ్) నివారించడం  
 =అంగవైకల్యం, పునరావాసం  వంటి అంశాలపై అవగాహనపెంచే కార్యక్రమాల నిర్వహణ.
 
 ఆరోగ్య సంబంధమైన పరీక్షలు  
 చూపు  
 వినికిడి
 దంతాలు  
 వ్యాధినిరోధక అంశాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించడం  
 న్యూట్రిషనల్ అసెస్‌మెంట్
 డెవలప్‌మెంటల్ అసెస్‌మెంట్  
 తరచూ రక్తహీనత, రక్తంలో విషపదార్థాల అంచనా, క్షయ వంటి జబ్బులకు సంబంధించిన పరీక్షలు.                                                                    
 
 ఒక్కొక్క అంశంపై విడివిడి జాగ్రత్తలు
 చూపు కాపాడటానికి : పిల్లల్లో అంధత్వానికి ప్రధాన కారణం విటమిన్-ఏ లోపం. కాబట్టి విటమిన్ ఏ పుష్కలంగా ఉండే పదార్థాలు ఇవ్వడం ద్వారా చూపు కాపాడటమే కాకుండా, నైట్‌బ్లైండ్‌నెస్ వంటి జబ్బులను నివారించవచ్చు.
 
 పిల్లలకు తరచూ కంటి పరీక్షలు చేయిస్తుండటం వల్ల వాళ్లలో చూపునకు సంబంధించిన సమస్యలను త్వరగా గుర్తించి అవసరాన్ని బట్టి అద్దాలతో సరిచేయదగిన వాటిని సరిదిద్దడం లేదా అవసరాన్ని బట్టి చికిత్స చేయడం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చు. మెల్లకన్ను వంటివి ఉన్నప్పుడు దాన్ని చక్కదిద్దడానికి అవసరమైన కంటి వ్యాయామాలను నేర్పడం చేయవచ్చు.
 
 వినికిడి శక్తిని కాపాడటానికి: తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు వచ్చే కామెర్లవ్యాధికి వీలైనంత త్వరగా చికిత్స చేయించాలి. కుటుంబంలో ఎవరికైనా వినికిడి లోపాలు ఉంటే, తరచూ పిల్లలకు వినికిడి పరీక్ష చేయించాలి. బ్రెయిన్ ఇన్ఫెక్షన్  వస్తే అది తగ్గేవరకూ పూర్తి చికిత్స చేయించాలి. పుట్టుకతో వచ్చే వినికిడి లోపాలను ముందుగానే తెలుసుకుని, కాక్లియర్ / హియరింగ్ ఎయిడ్ అమర్చడం వంటి చికిత్సలు చేయిస్తే వారికి వినికిడి శక్తి మాత్రమే గాక... మాట్లాడే శక్తి కూడా  వస్తుంది.
 
 బుద్ధిమాంద్యత: పిల్లల్లో బుద్ధిమాంద్యానికి ప్రధాన కారణం హైపోథైరాయిడిజమ్. దీన్ని ఎంత త్వరగా గుర్తించి థైరాక్సిన్ హార్మోన్‌ను ఇస్తే అంత త్వరగా బుద్ధిమాంద్యతను నివారించవచ్చు. ఇక తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే ‘ఐయొడైజ్‌డ్ ఉప్పు’ వాడటం వల్ల పిల్లల్లో బుద్ధిమాంద్యత ను నివారించవచ్చు.
 
 పుట్టుకతో వచ్చే  అంగవైకల్యాల నివారణ/చికిత్స ఇలా...
 న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ (స్పైనా బైఫిడా):  కాబోయే తల్లికి తగినంత ఫోలిక్ యాసిడ్ అనే పోషకం అందకపోతే బిడ్డలో ఏర్పడాల్సిన వెన్నుపాము (న్యూరల్ ట్యూబ్) సరిగా రూపొందకపోవచ్చు. ఈ పరిస్థితిని స్పైనా బైఫిడా అంటారు. ఈ వైకల్యం ఏర్పడితే బిడ్డ కడుపులో ఉండగానే మృతి చెందవచ్చు. ఒకవేళ పుట్టి బతికితే శారీరకంగా, మానసికంగా వైకల్యాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని తెలుసుకోవడం కోసం అవసరమైన పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.  
 
 డౌన్స్ సిండ్రోమ్: బిడ్డలో ఉండాల్సిన క్రోమోజోముల సంఖ్య 46. ఏదైనా కారణాల వల్ల ఒక అదనపు క్రోమోజోము ఉంటే ఆ బిడ్డకు డౌన్స్ సిండ్రోమ్ అనే కండిషన్ వస్తుంది. దీనివల్ల బిడ్డలో బుద్ధిమాంద్యం కలుగుతుంది. ముప్ఫై అయిదేళ్ల తర్వాత గర్భం ధరించే మహిళల్లో బిడ్డకు డౌన్స్ సిండ్రోమ్ వచ్చే రిస్క్ ఎక్కువ. అందుకే ఈ వయసు లో గర్భధారణ జరిగిన మహిళలతో పాటు మిగతా గర్భవతు లూ కొన్ని పరీక్షలు చేయించుకోవడం అవసరం.
 
 గర్భధారణ తర్వాత 11 - 14 వారాల మధ్యన కాబోయే తల్లి ఎన్‌టీ స్కాన్ పరీక్ష చేయించాలి. దీన్నే ఫస్ట్ సెమిస్టర్ స్క్రీనింగ్ అంటారు.
 
 ఒకవేళ ఎవరైనా పైపరీక్ష చేయించుకోకపోతే 15వ వారం నుంచి 20 వ వారం లోపున ట్రిపుల్ సీరమ్ స్క్రీనింగ్ లేదా క్వాడ్రపుల్ పరీక్ష చేయించుకోవాలి. ఇందులో కడుపులోని పిండం తల్లి గర్భంలోకి విడుదల చేసే 3 - 4 రకాల ప్రోటీన్లను పరిశీలిస్తారు. వాటి పాళ్ల నిష్పత్తిని బట్టి బిడ్డకు వైకల్యం వస్తుందో రాదో చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీనితో డౌన్స్ సిండ్రోమ్ తెలుసుకునేందుకు 60- 70 శాతం అవకాశాలున్నా ఒక్కోసారి తప్పుడు ఫలితం రావచ్చు. అందుకే దీంతో పాటు ‘టిఫా’ స్కాన్ అనే పరీక్ష చేయిస్తే తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం తగ్గుతుంది.
 
  పైన పేర్కొన్న పరీక్షలో పాజిటివ్ వచ్చినంత మాత్రాన బిడ్డకు తప్పక  వైకల్యం వస్తుందని కాదు. అందుకే 15వ వారంలో ట్రిపుల్ లేదా క్వాడ్రపుల్ పరీక్ష చేయించి, ఫాల్స్ పాజిటివ్ గనక వస్తే... అప్పుడు గర్భధారణ తర్వాత 16వ వారంలో యామ్నియోసెంటైసిస్ అనే పరీక్షను చేయించుకుని, మొదట వచ్చింది నిజమైన పాజిటివా లేక ఫాల్స్ పాజిటివా అని నిర్ధారణ చేసుకోవాలి.
 
 నిర్మాణపరమైన అవయవ లోపాల కోసం టిఫా పరీక్ష: ఎవరిలోనైనా కడుపులోని బిడ్డలో అవయవ నిర్మాణాల పరమైన లోపాలు (స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్) ఉన్నట్లు అనుమానిస్తే వారికి టిఫా స్కాన్ అనే ప్రత్యేకమైన స్కానింగ్ చేయించాలి.
 
 జెనెటిక్ సోనోగ్రామ్ పరీక్షలు: బిడ్డ నిర్మాణంలో ఏవైనా లోపాలున్నాయా అని ఈ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు. ఇందులో క్రోమోజోమల్ సమస్యలూ తెలుస్తాయి. ఈ పరీక్ష ద్వారా బిడ్డ లోపలి అవయవాలైన గుండె, మెదడు, మూత్రపిండాలు, కాళ్లు-చేతులు, ముఖం, కళ్లు, ఊపిరితిత్తులు, వెన్నెముక, అబ్డామినల్ అవయవాల (కడుపు లోపలి భాగాల) గురించి తెలుసుకోవచ్చు.
 
 - నిర్వహణ: యాసీన్
 
 దగ్గరి బంధువులను పెళ్లి చేసుకుంటే వైకల్యాలు ఎందుకు ఎక్కువ?

 రక్తసంబంధీకులు లేదా దగ్గరి బంధువుల మధ్య వివాహాలు జరిగితే... వాళ్లకు పుట్టబోయే బిడ్డల్లో అంగవైకల్యాలు, ఆరోగ్యసమస్యలు ఎక్కువ. ఎందుకంటే... బిడ్డలో తల్లివి 23, తండ్రివి 23 క్రోమోజోములు తల్లిదండ్రుల నుంచి పుట్టబోయే బిడ్డలకు వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తాయి. కాసేపు దంపతులిద్దరూ రక్తసంబంధీకులు కాదని అనుకుందాం. అప్పుడు ఒక సమాచారాన్ని బిడ్డకు చేరవేసే ఒక జన్యువు తండ్రిలో లోపభూయిష్టంగా ఉందనుకుంటే... తల్లి తాలూకు మంచి జన్యువుతో ఆ లోపం భర్తీ అవుతుంది. అదే తల్లిలో ఉండే లోపభూయిష్టమైన అదే తరహా జన్యువును తండ్రి తాలూకు జన్యువు డామినేట్ చేసి, బిడ్డలో లోపం రాకుండా చూస్తుంది. కానీ ఇద్దరూ ఒకే కుటుంబాలకు సంబంధించిన వారైతే, ఇద్దరిలోనూ సదరు సమాచారాన్ని తీసుకెళ్లే జన్యువులో లోపం ఉందనుకుందాం. అప్పుడు దాన్ని అధిగమించేలా చేయడానికి డామినెంట్ జన్యువు ఏదీ లేకపోవడంతో బిడ్డ లో జన్యుపరమైన లోపం వచ్చేందు కు అవకాశాలు ఎక్కువ. అందుకే ఆరోగ్యకరమైన బిడ్డలు కావాలనుకు నేవారు, బిడ్డలకు వైకల్యం లేకుండా, ఉండాలనుకునేవారు  రక్తసంబంధీకుల్లో వివాహాలు చేసుకోకపోవడమే మంచిది.
 
 డా. శివ నారాయణరెడ్డి వెన్నపూస
 కన్సల్టెంట్ పీడియాట్రీషియన్
 రెయిన్‌బో హాస్పిటల్స్, సికింద్రాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement