అన్నం తక్కువ తిందాం..! | National Institute of Nutrition Review of Indian Eating Habits | Sakshi
Sakshi News home page

అన్నం తక్కువ తిందాం..!

Published Wed, Sep 30 2020 6:05 AM | Last Updated on Wed, Sep 30 2020 6:05 AM

National Institute of Nutrition Review of Indian Eating Habits - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తిండి కలిగితే కండ కలదోయ్‌... కండకలవాడేను మనిషోయ్‌.. అన్నాడు కవి గురజాడ. అలాగని ఏది పడితే అది తింటే అనారోగ్యానికి దారితీసే అవకాశాలే ఎక్కువ. ప్రస్తుతం దేశంలో మెజార్టీ జనాలు ప్రొటీన్లు, విటమిన్లు ఉండే ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకుంటూ.. కొవ్వులు, గ్లూకోజ్‌లు అధికంగా ఉండే పదార్థాలను ఎక్కువగా లాగించేస్తున్నారు. దీంతో శరీర సౌష్టవం దెబ్బతినడంతో పాటు అనారోగ్యానికి దారితీస్తోంది. దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలను వేరుగా విభజించి ప్రజల ఆహారపు అలవాట్లపై నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌), ఇండియన్‌  కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) సంయుక్తంగా పరిశీలన చేశాయి. అనవసరమైన, శరీరానికి భారమయ్యే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నట్లు గుర్తించాయి. ఈ క్రమంలో ఏయే పదార్థాలను ఎంత మోతాదులో తింటే మేలు అన్న దానిపై ఎన్‌ఐఎన్, ఐసీఎంఆర్‌ పలు సూచనలు చేశాయి. అలాగే వీటన్నింటినీ వివరిస్తూ ‘వాట్‌ ఇండియా ఈట్స్‌’ నివేదికను విడుదల చేశాయి. 

పరిశీలన సాగిందిలా... 
దేశాన్ని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్, నార్త్‌ ఈస్ట్‌గా విభజించి అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు, తీసుకుంటున్న విధానాన్ని 24 గంటల(ఒక రోజు)ను ఒక యూనిట్‌ గా పరిగణించి పరిశీలన చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు భిన్న ఆహారపు అలవాట్లున్నా... తీసుకునే విధానం మాత్రం సరిగా లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో గోధుమ రొట్టెలను, దక్షిణాది రాష్ట్రాల్లో అన్నం, జొన్న రొట్టెలు అధికంగా> తింటున్నారు. దీంతో ప్రొటీన్ల కంటే గ్లూకోజు అధికంగా పోగవుతూ.. క్రమంగా కొవ్వుల రూపంలోకి మారి అనారోగ్యానికి కారణమవుతోంది. దేశవ్యాప్తంగా తృణ, చిరుధాన్యాల వినియోగం అధికంగా ఉంది. పప్పులను తక్కువగా, మాంసాహారాన్ని మోతాదులోనే భుజిస్తున్నారు. పాల ఉత్పత్తులతో పాటు కాయగూరలు, పండ్లు, గింజలను తక్కువగా తీసుకుంటున్నారు. దుంపలను ఎక్కువగా తీసుకుంటుండగా... పట్టణ ప్రాంతాల్లో కొవ్వు పదార్థాల వినియోగం అధికంగా ఉంది. 

‘మై ప్లేట్‌ ఫర్‌ ది డే’ మెనూ ప్రకారం
ఒక వ్యక్తికి రోజుకు సగటున 2 వేల కిలో కెలోరీల ఆహారం సరిపోతుంది. దీన్ని సరైన మోతాదులో తీసుకోవడం, వ్యాయామంతో శరీర సౌష్టవం, చక్కని ఆరోగ్యం  సొంతమవుతుందని ఎన్‌ ఐఎన్‌  సూచిస్తోంది. రోజువారీగా ఏయే పదార్థాలు ఎంత శాతం తీసుకోవాలన్న దానిపై ఒక మెనూను రూపొందించి ‘మై ప్లేట్‌ ఫర్‌ ది డే’ పేరు పెట్టింది. ఇందులో 40% ఆహారంగా బియ్యం లేదా గోధుమలు, మొక్కజొన్నతో పాటు తృణ ధాన్యాలైన జొన్నలు, రాగులు, అరకలు, సజ్జలతో వండిన పదార్థాలు కూడా తీసుకోవాలి. 11%  పప్పులు, 6% మాంసాహారం, 10% పాలు లేదా పెరుగు, 5% కాయగూరలు, 3% పండ్లు, 8% బాదం, ఖాజు, పల్లీ తదితర నట్స్‌ తినాలి. కొవ్వు లేదా నూనె పదార్థాలను 12% తీసుకోవాలి. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా సగటు మనిషి ప్రామాణిక బరువును ఐదు కిలోలు పెంచగా, మనిషికి కావాల్సిన కేలరీలను వారి శ్రమ ఆధారంగా పోలుస్తూ మార్పులు చేశారు. 

► పప్పుదినుసులతో చేసిన ఆహారానికి బదులుగా గుడ్లు, మాంసం, చేపలను అదే మోతాదులో తీసుకోవచ్చు.  
► పండ్లను జూస్‌ల రూపంలో కాకుండా నేరుగా తినేలా తీసుకోవాలి. 
► కొవ్వులు, నూనె పదార్థాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నిత్యం ఒకే రకమైన నూనె పదార్ధాలు కాకుండా వేరువేరుగా తీసుకోవాలి. 
► ఊబకాయం ఉన్నవారు, లేదా బరువు తగ్గాలనుకున్న వారు బియ్యం, గోధుమ తదితర ధాన్యాలతో చేసిన పదార్థాలను తగ్గించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement