బడి పిల్లలకు బడిలోనే మధ్యాహ్నం భోజనం పెట్టే సదుపాయం చాలా దేశాల్లో అమల్లో వుంది. ఈ పథకం భారతదేశంలో భారీ స్థాయిలో ఉన్నట్లు యునెస్కో ప్రశంసించింది. ఈ విద్యా సంవత్సరంలో 12.65 లక్షల పాఠశాలల్లోని పన్నెండు కోట్ల మంది పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నివేదిక తెలియజేస్తోంది. పాఠశాలల్లో డ్రాపవుట్సును నివారించి, విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించటం ప్రధాన లక్ష్యం. అన్ని సంక్షేమ పథకాల్లో ప్రవేశిస్తున్నట్లే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పేరుతో ప్రభుత్వేతర సంస్థల (ఎన్జీవోలు) ముసుగులో ప్రైవేట్ సంస్థలు ఇందులోనూ వ్యాపిస్తున్నవి. వాటిలో అక్షయ పాత్ర ఫౌండేషన్, ఏక్తా శక్తి ఫౌండేషన్, నాంది ఫౌండేషన్, జయ్ గీ హ్యుమానిటేరియన్ సొసైటీ, పీపుల్స్ ఫోరమ్ అనేవి కొన్ని.
అన్నిటి కంటే అక్షయ పాత్ర ఫౌండేషన్ పెద్దది. అది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్‌నెస్ (ఇస్కాన్) అనుబంధ సంస్థ. పన్నెండు రాష్ట్రాల్లో 14,702 ప్రభుత్వ పాఠశాలల్లోని 17.60 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నట్లు అక్షయ పాత్ర చెబుతోంది. గతంలోనే కొన్ని రాష్ట్రాల్లో అక్షయ పాత్ర ఫౌండేషన్ సరఫరా చేసే భోజనంపైన అభ్యంతరాలు వ్యక్తమైనవి. మధ్యాహ్న భోజన పథకంలో అక్షయ పాత్ర భాగస్వామ్యాన్ని తొలగించాలని సామాజిక కార్యకర్తలు కేంద్ర విద్యాశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రాయోజిత పథకంగా1995 ఆగస్టు15 నుండి దేశమంతటా అమల్లోకి వచ్చిన మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం యిచ్చిన మార్గదర్శకాల ప్రకారం అమలు చేయాలి. ప్రొటీన్లు గల ఆహారం అందివ్వాలి. అందుకు అవసరమైన బియ్యం/గోధుమలు, పప్పులు, కూరగాయలు/ ఆకుకూరలు, నూనె/ఫ్యాట్, ఉప్పు, పోపు దినుసులతో వండిన భోజనం పెట్టాలి. వారంలో కనీసం మూడు రోజులు ఉడకబెట్టిన కోడిగుడ్లు వడ్డించాలి. కోడిగుడ్డుకు బదులు పాలు లేదా అరటి పండు ఇవ్వడాన్ని కూడా జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్‌ఐఎన్) అంగీకరించలేదు.
మధ్యాహ్న భోజన పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం యిచ్చిన మార్గదర్శకాలు, జాతీయ పౌష్టికాహార సంస్థ చేసిన సిఫార్సులు, సుప్రీంకోర్టు తీర్పులోని ఆదేశాలకు విరుద్ధంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రవర్తిస్తోంది. అధునాతన యంత్రాలతో కేంద్రీకృత వంటశాలలు నెలకొల్పి బడికి అందుబాటులో ఉండే బడుగు బలహీన వర్గాల మహిళలకు అవకాశం లేకుండా చేశారు. తెల్లవారుజామున వండి, కంటెయినర్లలో పెట్టి, మైళ్లకొద్దీ వాహనాల్లో రవాణా చేసి, మధ్యాహ్నంకి చల్లారిన భోజనం పెడుతున్నారు. రోజూ ఒకే రకమైన ఆహార పదార్ధాలతో రుచి లేకపోవడం వలన విద్యార్థులు యిష్టంగా తినలేక పోతున్నారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2005 లోనే 187 శాంపిల్సును పరిశీలించి వాటిలో నిర్దేశిత పోషకాలు లేవని, పదార్థాల పరిమాణం కూడా తక్కువగా ఉంటుందని తేల్చింది.
పౌష్టికాహారం అయిన కోడిగుడ్లు వడ్డించటం లేదు. అంతేకాదు ఆ వంట కంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా వేయటం లేదు. విద్యార్థులకు యిష్టమైన భోజనం కాకుండా సాత్వికాహారం పేరుతో అక్షయ పాత్ర ఫౌండేషన్ వారి మతాచార ఆహారాన్నే నిర్బంధంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వుండే విద్యార్థుల్లో 95 శాతం మంది మాంసాహారులు. వంట చేసే వారు మాత్రం మాంసాహార వ్యతిరేకులు. భోజనం చేసేవారు దళితులు, గిరిజనులు, బహుజనులు కాగా వండి వార్చేదేమో అగ్రవర్ణ సంస్థ. పాఠశాలల్లోనే వంట చేయకుండా అస్పృశ్యత పాటిస్తున్న ఫౌండేషన్ పట్ల 2013 లోనే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కమీషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
నిరసనలు వెల్లువెత్తడంతో ఫౌండేషన్ కూడా కొంత దిగొచ్చి స్కూల్ మేనేజిమెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ)ల ద్వారా కోడిగుడ్లను విద్యార్థులకు అందించుకోవచ్చని, అందుకు చెల్లించాల్సిన సొమ్మును తనకిచ్చే బిల్లు నుండి మినహాయించుకోవచ్చని అంగీకరించింది. అంతేకానీ తాను మాత్రం కోడిగుడ్లు వడ్డించేది లేదని తెగేసి చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కోడిగుడ్లు వేరే ఏజెన్సీల ద్వారా పెట్టిస్తున్నారు. తెలంగాణలో అది కూడా లేదు. పైగా స్థానిక సంస్కృతీ, ఆహార అలవాట్లను అణిచివేసి సాత్వికాహారం పేరుతో రుచిలేని చప్పటి తిండి పెట్టి విద్యార్థుల కడుపు కాలుస్తున్నారు.
అక్షయ పాత్ర ఫౌండేషన్ భాగస్వామ్యంలోని అనర్ధాలను ఎవరూ పట్టించుకోక పోవడం అన్యాయం. ఇది బాలల హక్కుల సమస్య, భావి భారత పౌరుల పౌష్టికాహార సమస్య. దేశ ప్రయోజనాల పేరుతో వేలాది స్వచ్ఛంద (ఎన్జీవో) సంస్థలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం భోజనం పేరుతో ప్రభుత్వ నిధులు, ప్రైవేట్ విరాళాలు పోగేసుకుంటూ విద్యార్థుల జీవి తాలతో ఆడుకుంటున్న సంస్థను కొనసాగనివ్వడం నేరం కాదా?
వ్యాసకర్త: నాగటి నారాయణ, విద్యారంగ విశ్లేషకులు, మొబైల్ : 94903 00577
Comments
Please login to add a commentAdd a comment