ఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత మరీ దారుణంగా ఉందని పార్లమెంట్లో భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తన నివేదికలో తెలిపింది. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతా లోపంతో పాటు విద్యార్థుల తప్పుడు లెక్కలు చూపుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని నివేదికలో పేర్కొంది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు సంఖ్య పెంచడం, పౌష్ఠికాహారాన్ని అందించడం లాంటి సదుద్దేశాలతో ప్రభుత్వం 1995 లో తొలుత ఈ పథకాన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభించింది. అనంతరం 2008-09 విద్యా సంవత్సరం నుండి ఉన్నత పాఠశాలల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ పథకం అమలవుతోంది.
పౌష్ఠిక అహారం సంగతేమోగాని కనీసం ప్రమాణాలు కూడా పాటించడం లేదని నివేదిక తెలిపింది. 2,102 శాంపిల్స్ ను సేకరించి జరిపిన పరిశీలనతో 1,876 (89 శాతం) శాంపిల్లు నిర్ణీత ప్రమాణాలు పాటించడంలో విఫలమయ్యాయని కాగ్ వెల్లడించింది. సరైన పర్యవేక్షణ లేకపోవడం మధ్యాహ్న భోజన పథకం దుర్వినియోగం కావడానికి ప్రధాన కారణంగా కాగ్ తెలిపింది.