సాక్షి, అమరావతి: ‘2020 డిసెంబర్‌లో జరిగిన ఏలూరు ఘటనపై విభన్న కోణాల్లో పరిశోధన జరిగింది. వివిధ జాతీయ సంస్థలు మూర్ఛకు కారణాలను అన్వేషించి, నివేదికలిచ్చాయి. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మూర్ఛ లక్షణాలతో సొమ్మసిల్లి పడిపోవడం అనేది బాక్టీరియా లేదా వైరస్‌వల్ల కాదని తేలింది. నీటి నమూనాలను పరీక్షించగా, క్రిమిసంహారక మందుల అవశేషాలు కలిశాయని స్పష్టమైంది. ఇందులో ఆర్గానో ఫాస్ఫరస్ పెస్టిసైడ్ మూలాలున్నాయని జాతీయ పోషకాహార సంస్థ చెప్పింది. ఢిల్లీలోని ఎయిమ్స్ లాంటి సంస్థ ఆర్గానో ఫాస్ఫరస్ వల్ల మూర్ఛ రావచ్చని.. కానీ, తాము సేకరించిన నమూనాల్లో దాని మూలాల్లేవని చెప్పింది.
అందుకే అన్ని సంస్థల అభిప్రాయాలను క్రోడీకరించాక ఆర్నెల్లపాటు లోతైన పరిశోధన చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం మూడు జాతీయ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం’.. అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఏలూరు ఘటనపై మంత్రి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏలూరులో 600 మందికి పైగా అంతుచిక్కని వ్యాధితో బాధితులు నమోదైతే ఒక్క ప్రాణనష్టం కూడా లేకుండా చేశామన్నారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తదితరులు కూడా పాల్గొన్నారు.
నేటి నుంచి రెండో విడత కోవిడ్ వ్యాక్సిన్
రాష్ట్రంలో రెండో విడత కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇటీవల వ్యాక్సిన్ తీసుకున్నాక చనిపోయిన ఆశా వర్కర్ కుటుంబానికి మంగళవారం రూ.50 లక్షలు అందించామన్నారు. ఒంగోలు ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు డా.ధనలక్ష్మికి మెరుగైన వైద్యం అందించేందుకు చెన్నె అపోలో ఆసుపత్రికి తరలించామని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment