ఆహార చదువులు.. ఊరించే కొలువులు
గెస్ట్ కాలమ్
దేశ జనాభాలో అధిక శాతం మంది ప్రజలు పేదరికం వల్ల పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.. ఈ అంశంపై సరైన అవగాహన లేనికార ణంగా గర్భిణులు, పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో.. గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యంపై దృష్టిసారించి పరిశోధనలు చేయడంతోపాటు పలు కోర్సులను అందిస్తున్న హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) ఇంచార్జి డెరైక్టర్ కల్పగం పొలాసతో ప్రత్యేక ఇంటర్వ్యూ...
సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చడమే లక్ష్యం:
పౌష్టికాహార ప్రయోగాలు, పరిశోధనలు, ఫలాలను ప్రజలకు చేరువచేయటం ఎన్‌ఐఎన్ లక్ష్యం. ప్రజలకు పోషకాహారంపై అవగాహన కల్పించటం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చే దిశగా కృషిచేస్తున్నాం. అయోడైజ్డ్ ఉప్పు తప్పనిసరి వాడకంలోకి వచ్చిందంటే అందుకు ఎన్‌ఐఎన్ కృషి ప్రధాన కారణమని చెప్పొచ్చు.
ఆహారం.. ప్రయోగాలు.. పరిశోధనలు:
ఎన్‌ఐఎన్ మూడు విభాగాల్లో పనిచేస్తుంది. అవి..ఫుడ్ అండ్ డ్రగ్ టాక్సికాలజీ రీసెర్చ్ సెంటర్, నేషనల్ సెంటర్ ఫర్ లేబొరేటరీ యానిమల్ సెన్సైస్, నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ బ్యూరో(ఎన్‌ఎన్‌ఎంబీ). ఎన్‌ఎన్‌ఎంబీ ద్వారా 16 రాష్ట్రాల్లో ఆహారపు అలవాట్లపై పరిశోధనలు చేస్తున్నాం. నేత్ర సమస్యల నుంచి క్యాన్సర్ వ్యాధి వరకూ.. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పౌష్టికాహార లోపమే కారణం. కాబట్టి ఆహారజాగ్రత్తలపై పరిశోధనలు సాగుతున్నాయి.
కోర్సులివే:
ఎంఎస్సీ అప్లయిడ్ న్యూట్రిషియన్ కోర్సుతోపాటు టెక్నిక్స్ ఫర్ అసెస్‌మెంట్ ఆఫ్ న్యూట్రిషినల్ ఎనిమియాస్, పీజీ సర్టిఫికెట్ కోర్సు ఇన్ న్యూట్రిషియన్, యానువల్ లేబొరేటరీ యానిమల్ టెక్నీషియన్ కోర్సు, యానువల్ లేబొరేటరీ యానిమల్ సూపర్‌వైజర్ కోర్సు అందుబాటులో ఉన్నాయి. ట్రైనింగ్ కోర్సులు కావటంతో 10 రోజుల నుంచి నెలల వ్యవధి వరకూ ఉంటాయి.
పోటీ ఎంతో తీవ్రం:
ఎంఎస్సీ అప్లయిడ్ న్యూట్రిషన్ కోర్సుకు పోటీ తీవ్రంగా ఉంటుంది. ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్‌సెన్సైస్‌కు అనుబంధంగా ఎన్‌ఐఎన్ ఈ కోర్సును నిర్వహిస్తుంది. కోర్సు మొత్తం సీట్లు 16. ఇందులో 6 సీట్లు మన రాష్ట్రానికి, మిగతా 10 సీట్లు సెంట్రల్ కోటాకు కేటాయించారు. ఎంబీబీఎస్, బీఎస్సీ(న్యూట్రిషన్), బీఎస్సీ (హోంసైన్స్), బీఎస్సీ (బయోకెమిస్ట్రీ/న్యూట్రిషన్ ప్రధాన సబ్జెక్టులుగా), బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారు అర్హులు. 100 మార్కులకు ఉండే రాత పరీక్ష ద్వారా సీట్లు భర్తీ చేస్తారు. న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ నుంచి ప్రశ్నలు వస్తాయి.
అవకాశాలు పుష్కలం:
గతంతో పోల్చితే న్యూట్రిషన్ కోర్సు పూర్తిచేసిన వారికి అవకాశాలు పెరిగాయి. ఆసుపత్రులు, హోటల్స్, కార్పొరేట్ సంస్థలు, జిమ్ సెంటర్లలో అవకాశాలు లభిస్తున్నాయి. డైటీషియన్లు, న్యూట్రిషన్ నిపుణులకు బాగా డిమాండ్ ఉంది. ఆసుపత్రిలో రోగులకు ఆహార సలహాలు డైటీషియన్లే ఇవ్వాలి. న్యూట్రిషన్ కోర్సులు పూర్తిచేసిన వారు సొంతంగా కూడా ఉపాధి పొందొచ్చు. ప్రారంభంలో రూ.18 వేల వరకూ వేతనం అందుకోవచ్చు.
పౌష్టికాహారంపై అవగాహన:
తిండి దొరక్క కొందరు రక్తహీనతతో బాధపడుతుంటే.. స్తోమత ఉండి కూడా అవగాహనలేమితో మరి కొంత మంది.. ఎనీమియాను కొనితెచ్చుకుంటున్నారు. ఇలాంటి భిన్నమైన సమస్యలకు పరిష్కార మార్గాలు చూపేందుకు ఎన్‌ఐఎన్ కృషి చేస్తోంది. రక్తహీనత సమస్య మహిళల్లో అధికంగా కనిపిస్తోంది. దీనివల్ల పిల్లలూ బలహీనంగా జన్మిస్తున్నారు. అలాంటి పిల్లలే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీన్ని అధిగమించేందుకు మహిళల్లో అవగాహన కల్పించటం, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం ఇప్పించటం వంటివి చేస్తున్నాం.
మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకూ చేరటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జరిపిన సర్వేలో పల్లెల్లోనూ యువతలో ఊబకాయం పెరుగుతోందని గుర్తించాం. తగినంత శారీరకశ్రమ లేకపో వటంతో తరచూ అనారోగ్యం బారినపడుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యంపై యువత, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్నాం. మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాం.