నెలకో వంట నూనె శ్రేయస్కరం
సాక్షి, హైదరాబాద్: వంటలలో దీర్ఘకాలం ఒకే రకం నూనె వినియోగించడం అనర్థదాయకమని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్) మాజీ డెరైక్టర్ డాక్టర్ బి.శశికిరణ్ హెచ్చరించారు. నిత్యం ఒకే వంటనూనె వాడటం వల్ల గుండె, కాలేయం, పొట్ట ఇతర శరీర భాగాల్లో కొవ్వు పేరుకు పోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా సోమవారం ‘ఈట్ రైట్ విత్ లివర్ డిసీజ్-13’ అనే అంశంపై ఇక్కడ ఏర్పాటైన ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఒక నెల వేరుశనగ నూనె వాడితే, మరో నెల సన్‌ఫ్లవర్ నూనె, ఇంకో నెల సోయాబీన్ ఆయిల్ వాడడం మంచిదన్నారు. రెండు, మూడు రకాల నూనెలను కలిపి వాడటం ఆరోగ్యానికి అంత శ్రేయస్కరం కాదన్నారు. ఈ నూనెలతో పోలిస్తే ఆలివ్ ఆయిల్‌లో కొవ్వు శాతం చాలా తక్కువైనప్పటికీ, అధిక ధర వల్ల సామాన్యులకు అందుబాటులో లేదన్నారు. పోషకాహార లోపం వల్ల గర్భిణులు తక్కువ బరువుతో కూడిన పిల్లలకు జన్మనిస్తున్నారని, బిడ్డ త్వరగా ఎదగాలని నూనె పదార్థాలు ఎక్కువ మోతాదులో తినిపిస్తున్నారన్నారు.
దీంతో పిల్లలు స్థూలకాయులుగా మారుతున్నారని చెప్పారు. ప్రముఖ ఉదరకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ రాజేష్ గుప్తా మాట్లాడుతూ మద్యం, మాంసం అధికంగా వాడడం, వ్యాయామం లోపించడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. క్లినికల్ న్యూట్రిషనిస్ట్ సీఎస్ మధులిక మాట్లాడుతూ, పిజ్జాలు, బర్గర్లు, ఎనర్జీ డ్రింక్స్ వల్ల నష్టాలే అధికమన్నారు. ఆహారంలో విధిగా తాజా కూరలు, పాలు, పండ్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఏసియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి, డాక్టర్ పి.ఎన్.రావు తదితరులు పాల్గొన్నారు.