ముంబై: బాంబే హైలో శనివారం రాత్రి గ్యాస్ లీకయింది. ఓఎన్జీసీ వెంటనే డ్రిల్లింగ్ను నిలిపివేసి సిబ్బందిని అక్కడి నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలిస్తోంది. లీకేజీ సమయంలో 80 మంది సిబ్బంది ఉండగా, 40 మందిని అక్కడి నుంచి తరలించారు. లీకేజీని అదుపు చేసేందుకు నిపుణులను రంగంలోకి దించినట్టు అధికారులు తెలిపారు. సహాయక చర్యల కోసం హెలీకాప్టర్లను వినియోగిస్తున్నారు.
గ్యాస్ లీకయిన రిగ్ బాంబే తీరానికి 150 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ సంఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేదని అధికారులు తెలిపారు. కిలో మీటర్ లోతున డ్రిల్లింగ్ చేస్తుండగా ప్రమాదం సంభవించింది. ఇంత లోతున గ్యాస్ లీకవడం అసాధారణమని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు.