Bombay High
-
తీర్పులాంటి ప్రశ్న ఇదేం ఆర్గ్యుమెంట్?
కూతురి మీద తల్లి ‘గృహహింస’ కేసు పెట్టింది. ఆ కేసు కింది కోర్టు నుంచి బాంబే హైకోర్టుకు వచ్చింది. కూతురి లాయర్, తల్లి లాయర్ ఎవరికి వారు తమ వాదనలు వినిపిస్తున్నారు. కూతురి లాయర్ వాదన ముగిసింది. తల్లి లాయర్ మొదలు పెట్టాడు. వాదిస్తూ వాదిస్తూ చప్పున.. ‘‘ఆ అమ్మాయికి చాలామంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు’’ అనేశాడు! వెంటనే జడ్జిగారు అతడిని స్టాప్ చేశారు. పాయింట్లోకి రమ్మన్నారు. ‘‘అది ఆమె వ్యక్తిగత విషయం. ఈ కేసుకు సంబంధం లేనిది’’ అన్నారు. ఆ మధ్య బాంబే హై కోర్టులోనే నివ్వెరపోయే తీర్పులు కొన్ని వచ్చాయి. అందుకు భిన్నంగా ఇప్పుడు స్త్రీ జాతికి గౌరవాన్ని నిలబెడుతూ ఈ మాట! ఏప్రిల్ 19 న తీర్పు రాబోతోంది. తీర్పు ఎలా వచ్చినా ఈ మాట మాత్రం మొత్తం సమాజమే శిరసావహించవలసిన తీర్పు! ‘మంచివాడు కాదు’ అనే మాటకు అనేక అర్థాలుంటాయి. ‘మంచిది కాదు’ అనే మాటకు మాత్రం ఒకటే అర్థం. మగాళ్లతో మాట్లాడుతుందని! ఒక స్త్రీని కించపరచడానికి, అవమానించడానికి, ఆత్మస్థయిర్యాన్ని నీరు కార్చడానికి, ఆమె ప్రతిష్టను దెబ్బతీయడానికి పురుషుల దగ్గరుండే మారణాయుధం లాంటి దారుణమైన మాట.. ‘మంచిది కాదు’! మంచిది కాదు అని అనడం అంటే ఆ స్త్రీ ఎంత పనైనా చేయగలిగిన మనిషి అని నిందించడం. ఆమెను తలెత్తుకోలేకుండా చెయ్యడానికి, ఆమె తిరుగుబాటు చేయకుండా ఉండేందుకు సమాజం ఇలాంటి ‘స్లట్ షేమింగ్’కి దిగుతుంది. స్లట్ షేమింగ్ అంటే ఆడమనిషి క్యారెక్టర్‌పై బురదచల్లడం. బాంబే హైకోర్టుకు గతవారం ఓ కేసు వచ్చింది. కింది కోర్టు నుంచి వచ్చిన కేసు అది. కూతురు తనను గృహహింస పెడుతోందని ఒక తల్లి కేసు వేసింది. వాళ్లిద్దరూ ముంబైలోనే ఉంటారు. కేసు నడుస్తున్న సమయంలో కూతురుకి ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాలో అవకాశం వచ్చింది. కేసు తన విదేశీ విద్యకు అడ్డంకి అవుతుందని కింది కోర్టు తనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును రద్దు చేయమని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. వాదనలు మొదలయ్యాయి. కూతురు తన క్లయింట్‌ని తల్లి అని కూడా చూడకుండా ఆమెను నిరాదరించడం కూడా గృహ హింసేనని తల్లి లాయర్ వాదించారు. తల్లి తన క్లయింట్‌ని కూతురు అని చూడకుండా తన స్వార్థం కోసం ఆమె భవిష్యత్తుని నాశనం చేసేందుకు గృహహింస కేసు పెట్టిందని కూతురి లాయర్ కెన్నీ థక్కర్ వాదించారు. ఈ లాయర్ మహిళ. తల్లి తరఫు లాయర్ పురుషుడు. వాదనల క్రమంలో ఆ పురుష లాయర్.. ‘‘కూతురు మంచిది కాదు కాబట్టే, తల్లి కేసు పెట్టింది. ఆమెకు చాలామంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు’’ అని ఆరోపించారు! వాదనలు వింటున్న జస్టిస్ షిండే, జస్టిస్ మనీష్ పితాలే ఒక్కసారిగా అతడి మాటలకు నివ్వెరపోయారు. జస్టిస్ మనీష్ పితాలే వెంటనే స్పందిస్తూ.. అతడికి అడ్డుకున్నారు. కేసుకు సంబంధం లేని విషయం మాట్లాడొద్దని వారించారు. ‘అది ఆమె వ్యక్తిగత విషయం’ అని అన్నారు. ఆమెకు ఎంతమంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారన్నది అసలు ఆర్గ్యుమెంటే కాదని స్పష్టంగా చెప్పారు. తీర్పు ఏప్రిల్ 19 కు వాయిదా పడింది. ‘పోక్సో’ చట్టం కింద నమోదైన కేసులు ఇటీవల బాంబే హైకోర్టుకు వచ్చినప్పుడు ఆ కేసుల్లో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి పోక్సో పరిధిలోకి రాని నేరం అంటూ నిందితులకు బెయిల్ ఇవ్వడం అనేక విమర్శలకు దారి తీసింది. ఇప్పుడీ తాజా కేసులో జడ్జిలు.. ‘చాలామంది బాయ్‌ఫ్రెండ్స్ ఉండటం అన్నది ఆర్గ్యుమెంట్‌కు సంబంధం లేని పాయింట్’ అని వ్యాఖ్యానించడం ప్రశంసనీయం అవుతోంది. -
ప్రజల సొమ్ముతో నేతలకు భద్రతా..?
సాక్షి,ముంబయి: ప్రజల సొమ్ముతో రాజకీయ నాయకులకు పోలీసు భద్రత సమకూర్చడం పట్ల బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నేతలకు పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో భద్రత కల్పించడం అవసరమా అని మహారాష్ట్ర సర్కార్‌ను సూటిగా ప్రశ్నించింది.రాజకీయ నాయకులు తమకు పోలీసు భద్రత అవసరమనుకుంటే ఆయా పార్టీలు స్వీకరించే నిధులను వెచ్చించాలని ప్రధాన న్యాయమూర్తి మంజులా చెల్లుర్, జస్టిస్ ఎంఎస్ సొనక్తో కూడిన హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. రాజకీయ నేతలకు ప్రజా ధనంతో పోలీసు భద్రత కల్పించడం తగదని మహారాష్ట్ర సర్కార్‌కు తేల్చిచెప్పింది. ప్రైవేట్ వ్యక్తులకు పోలీసు భద్రత కల్పించే ప్రస్తుత విధానాలను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వీఐపీలు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలకు భద్రత కల్పించినందుకు వారి నుంచే బకాయిలు రాబట్టాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారిస్తోంది.మహారాష్ట్రలో ప్రైవేట్ వ్యక్తులకు దాదాపు 1000 మంది పోలీసు సిబ్బంది భద్రతా విధుల్లో నిమగ్నమయ్యారని పిటిషన్ పేర్కొంది. -
'ఆ హీరోకు ఐదేళ్లు జైలుశిక్ష వేయడం కరెక్టే'
ముంబై: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు సెషన్స్ కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించడం సబబేనని, అతను నేరం చేసినట్టు నిరూపితమైందని బాంబే హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ షిండే వాదించినట్టు సమాచారం. జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. నిందితుడు సల్మాన్ ఖాన్‌పై ఎలాంటి కనికరం చూపాల్సిన అవసరం లేదని, కింది కోర్టు విధించిన శిక్షను అమలు చేయాలని సందీప్ షిండే హైకోర్టును కోరారు. 2002 నాటి హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్‌ను దోషిగా పేర్కొన్న ముంబై సెషన్స్ కోర్టు అతడి ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేయగా.. బాంబే హైకోర్టు ఆ తీర్పును రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ ప్రస్తుతం బాంబే హైకోర్టులో సాగుతోంది. కింది కోర్టు తీర్పును రద్దు చేయాలంటూ సల్మాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఏ ఆర్ జోషి విచారిస్తున్నారు. కోర్టులో సందీప్ షిండే, ప్రాసిక్యూటర్ పూర్ణిమా కంథారియా తమ వాదనలు వినిపిస్తూ.. 'ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్ మద్యం సేవించాడు. ఆ మరుసటి రోజు వైద్య పరీక్షల కోసం అతడిని ఆస్పత్రికి తీసుకువచ్చినపుడు మద్యం తాగినట్టు వాసన వచ్చింది' అని కోర్టుకు తెలియజేసినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్ కారు డ్రైవర్ అశోక్ సింగ్ వాహనాన్ని నడుపుతున్నాడని, టైరు పేలడంతో వాహనం అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిందన్న సల్మాన్ తరపు న్యాయవాదుల వాదనను తోసిపుచ్చారు. ప్రమాద స్థలంలో సల్మాన్ ఉన్నాడని సందీప్ షిండే, పూర్ణిమా కంథారియా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. -
గణేశ్ ఉత్సవాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
మరికొద్ది రోజుల్లో గణపతి నవరాత్రి వహోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వేడుకల నిర్వహణపై బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ముంబై నగరంలోని ప్రఖ్యాత శివాజీ పార్కులో రథయాత్ర నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ శ్రీకృష్ణా కాన్షియస్నెస్) సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించిన కోర్టు ఈ విధంగా స్పందించింది.. న్యాయ నిబంధనల దృష్ట్యా ఇలాంటి కార్యక్రమాలకు మేం వ్యతిరేకం అంటూనే నగరంలోని అన్ని ప్రాంతాలు స్తంభించిపోయేలా గణేశ్ చతుర్థి, నవరాత్రి, ఇతర ముఖ్య పండుగలను భారీ హంగులతో బహిరంగంగా నిర్వహించడం ఇకనైనా మానుకోవాలని సూచించింది. ఒక వార్డుకు ఒక మండపం మాత్రమే ఉండాలని జస్టీస్ వీఎం కనడే, షాలిని పన్సల్కర్ లతో కూడిన ధర్మాసనం అభిప్రాయాపడింది. 'ఒకవేళ లోకమాన్య తిలక్ గనుక బతికుంటే.. ప్రస్తుతం ఉత్సవాలు జరుగుతున్న తీరును తప్పక నిరసించేవారు. ఇంత భారీగా జరుగుతున్న తంతుతో ఎవరికి లాభం? వినాయక మండపాల పేరుతో ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్నారు. నిజం చెప్పాలంటే ఇవి ఫక్తు బలవంతపు వసూళ్లే. మండపాల వద్ద పెద్ద పెద్ద మైక్ సెట్లతో భారీ శబ్ధాలు. ఏం? గణేశ్ పూజలు నిశ్శబ్ధంగా నిర్వహించలేమా!'అని కోర్టు మండిపడింది. ప్రజలు భారీ ఎత్తున పాల్గొనే రథయాత్రను క్రీడా ప్రాంగణంలో నిర్వహించేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఇస్కాన్ కు తేల్చిచెప్పిన కోర్టు.. రథయాత్ర వల్ల గ్రౌండ్ పరిసరాలేకాక, పిచ్ కూడా దెబ్బతింటుందని, తద్వారా చిన్నారులు, యువకులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని పేర్కొంది. పూరీలో జగన్నాథ రథయాత్రను ప్రస్తావిస్తూ ఆ ఉత్సవం భారీ రహదారిపై జరుగుతుంది గనుక సమంజసమేనని తెలిపింది. -
బాంబే హైలో గ్యాస్ లీక్
ముంబై: బాంబే హైలో శనివారం రాత్రి గ్యాస్ లీకయింది. ఓఎన్జీసీ వెంటనే డ్రిల్లింగ్‌ను నిలిపివేసి సిబ్బందిని అక్కడి నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలిస్తోంది. లీకేజీ సమయంలో 80 మంది సిబ్బంది ఉండగా, 40 మందిని అక్కడి నుంచి తరలించారు. లీకేజీని అదుపు చేసేందుకు నిపుణులను రంగంలోకి దించినట్టు అధికారులు తెలిపారు. సహాయక చర్యల కోసం హెలీకాప్టర్లను వినియోగిస్తున్నారు. గ్యాస్ లీకయిన రిగ్ బాంబే తీరానికి 150 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ సంఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేదని అధికారులు తెలిపారు. కిలో మీటర్ లోతున డ్రిల్లింగ్ చేస్తుండగా ప్రమాదం సంభవించింది. ఇంత లోతున గ్యాస్ లీకవడం అసాధారణమని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు.