ప్రతీకాత్మక చిత్రం
కూతురి మీద తల్లి ‘గృహహింస’ కేసు పెట్టింది. ఆ కేసు కింది కోర్టు నుంచి బాంబే హైకోర్టుకు వచ్చింది. కూతురి లాయర్, తల్లి లాయర్ ఎవరికి వారు తమ వాదనలు వినిపిస్తున్నారు. కూతురి లాయర్ వాదన ముగిసింది. తల్లి లాయర్ మొదలు పెట్టాడు. వాదిస్తూ వాదిస్తూ చప్పున.. ‘‘ఆ అమ్మాయికి చాలామంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు’’ అనేశాడు! వెంటనే జడ్జిగారు అతడిని స్టాప్ చేశారు. పాయింట్‌లోకి రమ్మన్నారు. ‘‘అది ఆమె వ్యక్తిగత విషయం. ఈ కేసుకు సంబంధం లేనిది’’ అన్నారు. ఆ మధ్య బాంబే హై కోర్టులోనే నివ్వెరపోయే తీర్పులు కొన్ని వచ్చాయి. అందుకు భిన్నంగా ఇప్పుడు స్త్రీ జాతికి గౌరవాన్ని నిలబెడుతూ
ఈ మాట! ఏప్రిల్ 19 న తీర్పు రాబోతోంది. తీర్పు ఎలా వచ్చినా ఈ మాట మాత్రం మొత్తం సమాజమే శిరసావహించవలసిన తీర్పు!
‘మంచివాడు కాదు’ అనే మాటకు అనేక అర్థాలుంటాయి. ‘మంచిది కాదు’ అనే మాటకు మాత్రం ఒకటే అర్థం. మగాళ్లతో మాట్లాడుతుందని! ఒక స్త్రీని కించపరచడానికి, అవమానించడానికి, ఆత్మస్థయిర్యాన్ని నీరు కార్చడానికి, ఆమె ప్రతిష్టను దెబ్బతీయడానికి పురుషుల దగ్గరుండే మారణాయుధం లాంటి దారుణమైన మాట.. ‘మంచిది కాదు’! మంచిది కాదు అని అనడం అంటే ఆ స్త్రీ ఎంత పనైనా చేయగలిగిన మనిషి అని నిందించడం. ఆమెను తలెత్తుకోలేకుండా చెయ్యడానికి, ఆమె తిరుగుబాటు చేయకుండా ఉండేందుకు సమాజం ఇలాంటి ‘స్లట్ షేమింగ్’కి దిగుతుంది. స్లట్ షేమింగ్ అంటే ఆడమనిషి క్యారెక్టర్‌పై బురదచల్లడం.
బాంబే హైకోర్టుకు గతవారం ఓ కేసు వచ్చింది. కింది కోర్టు నుంచి వచ్చిన కేసు అది. కూతురు తనను గృహహింస పెడుతోందని ఒక తల్లి కేసు వేసింది. వాళ్లిద్దరూ ముంబైలోనే ఉంటారు. కేసు నడుస్తున్న సమయంలో కూతురుకి ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాలో అవకాశం వచ్చింది. కేసు తన విదేశీ విద్యకు అడ్డంకి అవుతుందని కింది కోర్టు తనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును రద్దు చేయమని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. వాదనలు మొదలయ్యాయి. కూతురు తన క్లయింట్‌ని తల్లి అని కూడా చూడకుండా ఆమెను నిరాదరించడం కూడా గృహ హింసేనని తల్లి లాయర్ వాదించారు. తల్లి తన క్లయింట్‌ని కూతురు అని చూడకుండా తన స్వార్థం కోసం ఆమె భవిష్యత్తుని నాశనం చేసేందుకు గృహహింస కేసు పెట్టిందని కూతురి లాయర్ కెన్నీ థక్కర్ వాదించారు.
ఈ లాయర్ మహిళ. తల్లి తరఫు లాయర్ పురుషుడు. వాదనల క్రమంలో ఆ పురుష లాయర్.. ‘‘కూతురు మంచిది కాదు కాబట్టే, తల్లి కేసు పెట్టింది. ఆమెకు చాలామంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు’’ అని ఆరోపించారు! వాదనలు వింటున్న జస్టిస్ షిండే, జస్టిస్ మనీష్ పితాలే ఒక్కసారిగా అతడి మాటలకు నివ్వెరపోయారు. జస్టిస్ మనీష్ పితాలే వెంటనే స్పందిస్తూ.. అతడికి అడ్డుకున్నారు. కేసుకు సంబంధం లేని విషయం మాట్లాడొద్దని వారించారు. ‘అది ఆమె వ్యక్తిగత విషయం’ అని అన్నారు. ఆమెకు ఎంతమంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారన్నది అసలు ఆర్గ్యుమెంటే కాదని స్పష్టంగా చెప్పారు. తీర్పు ఏప్రిల్ 19 కు వాయిదా పడింది.
‘పోక్సో’ చట్టం కింద నమోదైన కేసులు ఇటీవల బాంబే హైకోర్టుకు వచ్చినప్పుడు ఆ కేసుల్లో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి పోక్సో పరిధిలోకి రాని నేరం అంటూ నిందితులకు బెయిల్ ఇవ్వడం అనేక విమర్శలకు దారి తీసింది. ఇప్పుడీ తాజా కేసులో జడ్జిలు.. ‘చాలామంది బాయ్‌ఫ్రెండ్స్ ఉండటం అన్నది ఆర్గ్యుమెంట్‌కు సంబంధం లేని పాయింట్’ అని వ్యాఖ్యానించడం ప్రశంసనీయం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment