personal matters
-
కోర్టు బోనెక్కి సాక్ష్యం చెప్పనున్న ప్రిన్స్ హ్యారీ
లండన్: బ్రిటన్ రాజు చార్లెస్ –3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ సాక్ష్యం ఇవ్వడానికి వచ్చే వారంలో కోర్టుకు హాజరుకానున్నారు. రాజకుటుంబానికి చెందినవారు ఇలా కోర్టు బోనెక్కడం 130 ఏళ్లలో ఇది తొలిసారి. డైలీ మిర్రర్, సండే మిర్రర్ వంటి వార్తా పత్రికల ప్రచురణ సంస్థ మిర్రర్ గ్రూప్ న్యూస్‌పేపర్స్ (ఎంజీఎన్) సెలిబ్రిటీల వ్యక్తిగత అంశాలను సేకరించడం కోసం చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై 100 మంది సెలిబ్రిటీలతో పాటు ప్రిన్స్ హ్యారీ కూడా మిర్రర్ గ్రూప్‌పై కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును విచారిస్తున్న లండన్ హైకోర్టులో ప్రిన్స్ హ్యారీ హాజరై ఫోన్ ట్యాంపింగ్‌పై సాక్ష్యం ఇవ్వనున్నారు. గతంలో 1870లో ఎడ్వర్డ్–7 ఒక విడాకుల కేసులో సాక్ష్యమిచ్చారు. -
ఆమె ప్రేమే నన్ను మార్చింది!
సూపర్ స్టార్ రజనీకాంత్ ఏ వేడుకలో పాల్గొన్నా సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడతారు. వ్యక్తిగత విషయాలు మాట్లాడిన దాఖలాలు దాదాపు లేవు. అలాంటిది ఇటీవల తన వ్యక్తిగత అలవాట్ల గురించి, తన భార్య లత కారణంగా తాను మారిన విషయం గురించి చెప్పి ఆశ్చర్యపరిచారు. రజనీకాంత్ మాట్లాడుతూ – ‘‘నేను బస్ కండక్టర్‌గా ఉద్యోగం చేస్తున్న సమయంలో మద్యం సేవించేవాడిని. ధూమపానం బాగా అలవాటు. మాంసాహారం కూడా కాస్త ఎక్కువగానే తీసుకునేవాడిని. మద్యం–మాంసాహారం–సిగరెట్.. ఈ మూడూ మంచి కాంబినేషన్. అయితే ఈ చెడు అలవాట్లు ఉంటే 60 ఏళ్లకు పైన బతకరు. ఈ అలవాట్లు ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని, కొంతకాలం తర్వాత ఇవి మన అనారోగ్యానికి కారణమవుతాయని అనిపించింది. నా భార్య లత వల్లే నా చెడు అలవాట్లకు నేను దూరం కాగలిగాను. ఆమె తన ప్రేమతో నన్ను మార్చింది. లత ప్రేమ వల్లే ఇప్పుడు వీటికి దూరంగా ఉంటూ, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతున్నాను. 73ఏళ్లలోనూ నేనింత ఆరోగ్యంగా ఉండటానికి కారణం తనే. అందుకే నా భార్య లతకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే లతను నాకు పరిచయం చేసిన మహేంద్రన్ (లత బావ, నటుడు, రచయిత వైజీ మహేంద్రన్‌ని ఉద్దేశించి)కూ రుణపడి ఉంటాను’’ అని చెప్పుకొచ్చారు రజనీకాంత్. వైజీ మహేంద్రన్ రూ΄÷ందించిన ‘చారుకేశి’ నాటికకు సంబంధించిన వేడుకలో పాల్గొన్న రజనీ తన అలవాట్ల గురించి ఈ విధంగా చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. -
విడాకుల కన్నా అదే ఎక్కువ బాధించింది: బిల్‌గేట్స్
ప్రతీ వివాహ బంధం.. ఒక దశ దాటిన తర్వాత మార్పునకు లోనవుతుంది. పిల్లలు పెరిగి పెద్దవ్వడం, పెళ్లి చేసుకుని లేదంటే ఉద్యోగాల కోసమే ఇల్లు విడిచిపెట్టాల్సి వస్తుంది. కానీ, నా వరకు వచ్చేసరికి ఆ మార్పు విడాకుల రూపంలో ఎదురైంది అని అంటున్నారు టెక్ దిగ్గజం బిల్‌గేట్స్. సండే టైమ్స్‌తో తొలిసారి తన విడాకులు.. ఇతర పరిణామాలపై స్పందించాడు బిల్‌గేట్స్. అయితే విడాకులు తీసుకోవడం కన్నా.. పిల్లలకు దూరంగా ఉండడం తనను ఎంతో బాధించిందని గేట్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక మిలిందా ఫ్రెంచ్‌తో వివాహం, విడాకులు.. ఇప్పుడు ఆమెతో కలిసి ఫౌండేషన్ కోసం కలిసి పని చేయడంపై ఆయనకు ప్రశ్నలు ఎదురు అయ్యాయి ఈ ఇంటర్వ్యూలో. అవసరమైతే తాను మళ్లీ మెలిండాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే అన్న సంకేతాలు ఇచ్చారు ఆయన. మిలిందాతో వైవాహిక బంధం అద్భుతంగా సాగింది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే నాకు ప్రస్తుతం ఎటువంటి ప్రణాళికలు లేవు. కానీ కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని సూచిస్తున్నట్లు బిల్ గేట్స్ చెప్పారు. ఒకవేళ మిలిందాను మళ్లీ పెళ్లి చేసుకోవాల్సి వస్తే.. ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ అవకాశం వదులుకోను అంటూ వ్యాఖ్యానించారాయన. గడిచిన రెండేళ్లు చాలా నాటకీయంగా సాగినట్లు బిల్ గేట్స్ తెలిపారు. విడాకులు, కరోనా కన్నా.. పిల్లలు తనను వదిలి వెళ్లడం బాధ కలిగించినట్లు చెప్పారు. ప్రస్తుతం మిలిందాతో కలిసి వర్కింగ్ రిలేషన్షిప్లో ఉన్నానని, ఫౌండేషన్ కోసం పనిచేస్తున్న ఇద్దరూ మీటింగ్ సమయంలో మంచి స్నేహితులుగా మాట్లాడుకుంటున్నామని, అది అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడాయన. ఇంతగా ప్రేమించినప్పుడు.. వివాహ బంధం ఎందుకు ముగిసిందని ప్రశ్న ఎదురుకాగా.. పెళ్లిళ్లు క్లిష్టమైనవి. వాటి గురించి లోతుగా చర్చించడం సరికాదు. మా వివాహ బంధం ఎందుకు విఫలమైందని విషయం ఇప్పుడు అప్రస్తుతం అని దాటవేత ధోరణి ప్రదర్శించాడు. 2021 మే నెలలో బిల్, మిలిందా విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. 2021 ఆగస్టులో వారికి విడాకులు కన్ఫర్మ్ అయ్యింది. బిల్ గేట్స్, మిలిందా జంటకు జెన్నిఫర్, రోరీ, ఫోబో అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. చదవండి: బిల్‌గేట్స్ పై మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు!! -
తీర్పులాంటి ప్రశ్న ఇదేం ఆర్గ్యుమెంట్?
కూతురి మీద తల్లి ‘గృహహింస’ కేసు పెట్టింది. ఆ కేసు కింది కోర్టు నుంచి బాంబే హైకోర్టుకు వచ్చింది. కూతురి లాయర్, తల్లి లాయర్ ఎవరికి వారు తమ వాదనలు వినిపిస్తున్నారు. కూతురి లాయర్ వాదన ముగిసింది. తల్లి లాయర్ మొదలు పెట్టాడు. వాదిస్తూ వాదిస్తూ చప్పున.. ‘‘ఆ అమ్మాయికి చాలామంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు’’ అనేశాడు! వెంటనే జడ్జిగారు అతడిని స్టాప్ చేశారు. పాయింట్లోకి రమ్మన్నారు. ‘‘అది ఆమె వ్యక్తిగత విషయం. ఈ కేసుకు సంబంధం లేనిది’’ అన్నారు. ఆ మధ్య బాంబే హై కోర్టులోనే నివ్వెరపోయే తీర్పులు కొన్ని వచ్చాయి. అందుకు భిన్నంగా ఇప్పుడు స్త్రీ జాతికి గౌరవాన్ని నిలబెడుతూ ఈ మాట! ఏప్రిల్ 19 న తీర్పు రాబోతోంది. తీర్పు ఎలా వచ్చినా ఈ మాట మాత్రం మొత్తం సమాజమే శిరసావహించవలసిన తీర్పు! ‘మంచివాడు కాదు’ అనే మాటకు అనేక అర్థాలుంటాయి. ‘మంచిది కాదు’ అనే మాటకు మాత్రం ఒకటే అర్థం. మగాళ్లతో మాట్లాడుతుందని! ఒక స్త్రీని కించపరచడానికి, అవమానించడానికి, ఆత్మస్థయిర్యాన్ని నీరు కార్చడానికి, ఆమె ప్రతిష్టను దెబ్బతీయడానికి పురుషుల దగ్గరుండే మారణాయుధం లాంటి దారుణమైన మాట.. ‘మంచిది కాదు’! మంచిది కాదు అని అనడం అంటే ఆ స్త్రీ ఎంత పనైనా చేయగలిగిన మనిషి అని నిందించడం. ఆమెను తలెత్తుకోలేకుండా చెయ్యడానికి, ఆమె తిరుగుబాటు చేయకుండా ఉండేందుకు సమాజం ఇలాంటి ‘స్లట్ షేమింగ్’కి దిగుతుంది. స్లట్ షేమింగ్ అంటే ఆడమనిషి క్యారెక్టర్‌పై బురదచల్లడం. బాంబే హైకోర్టుకు గతవారం ఓ కేసు వచ్చింది. కింది కోర్టు నుంచి వచ్చిన కేసు అది. కూతురు తనను గృహహింస పెడుతోందని ఒక తల్లి కేసు వేసింది. వాళ్లిద్దరూ ముంబైలోనే ఉంటారు. కేసు నడుస్తున్న సమయంలో కూతురుకి ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాలో అవకాశం వచ్చింది. కేసు తన విదేశీ విద్యకు అడ్డంకి అవుతుందని కింది కోర్టు తనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును రద్దు చేయమని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. వాదనలు మొదలయ్యాయి. కూతురు తన క్లయింట్‌ని తల్లి అని కూడా చూడకుండా ఆమెను నిరాదరించడం కూడా గృహ హింసేనని తల్లి లాయర్ వాదించారు. తల్లి తన క్లయింట్‌ని కూతురు అని చూడకుండా తన స్వార్థం కోసం ఆమె భవిష్యత్తుని నాశనం చేసేందుకు గృహహింస కేసు పెట్టిందని కూతురి లాయర్ కెన్నీ థక్కర్ వాదించారు. ఈ లాయర్ మహిళ. తల్లి తరఫు లాయర్ పురుషుడు. వాదనల క్రమంలో ఆ పురుష లాయర్.. ‘‘కూతురు మంచిది కాదు కాబట్టే, తల్లి కేసు పెట్టింది. ఆమెకు చాలామంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు’’ అని ఆరోపించారు! వాదనలు వింటున్న జస్టిస్ షిండే, జస్టిస్ మనీష్ పితాలే ఒక్కసారిగా అతడి మాటలకు నివ్వెరపోయారు. జస్టిస్ మనీష్ పితాలే వెంటనే స్పందిస్తూ.. అతడికి అడ్డుకున్నారు. కేసుకు సంబంధం లేని విషయం మాట్లాడొద్దని వారించారు. ‘అది ఆమె వ్యక్తిగత విషయం’ అని అన్నారు. ఆమెకు ఎంతమంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారన్నది అసలు ఆర్గ్యుమెంటే కాదని స్పష్టంగా చెప్పారు. తీర్పు ఏప్రిల్ 19 కు వాయిదా పడింది. ‘పోక్సో’ చట్టం కింద నమోదైన కేసులు ఇటీవల బాంబే హైకోర్టుకు వచ్చినప్పుడు ఆ కేసుల్లో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి పోక్సో పరిధిలోకి రాని నేరం అంటూ నిందితులకు బెయిల్ ఇవ్వడం అనేక విమర్శలకు దారి తీసింది. ఇప్పుడీ తాజా కేసులో జడ్జిలు.. ‘చాలామంది బాయ్‌ఫ్రెండ్స్ ఉండటం అన్నది ఆర్గ్యుమెంట్‌కు సంబంధం లేని పాయింట్’ అని వ్యాఖ్యానించడం ప్రశంసనీయం అవుతోంది. -
ఏది పడితే అది రాయొద్దు!
‘అమితాబ్ బచ్చన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు’, ‘ కాలేయ సంబంధిత సమస్యలంట’ అనేవి శుక్రవారం అమితాబ్ ఆరోగ్యానికి సంబంధించి చక్కర్లు కొట్టిన వార్తలు. శనివారం రాత్రి అమితాబ్ తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ– ‘‘అనారోగ్యం, మెడికల్ ఇష్యూలు అనేవి ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు. వాటి గురించి ఏది పడితే అది రాయకూడదు. ఆ కోడ్‌ను ఎప్పుడూ బ్రేక్ చేయకూడదు. అలా చేయడం ఫ్రొఫెషనల్ కోడ్‌ను ఉల్లంఘించడమే. ఆ వ్యక్తిగత స్పేస్‌ను అర్థం చేసుకొని, గౌరవం ఇవ్వండి. ప్రపంచంలో అన్ని విషయాలూ అమ్మకానికి కాదు’’ అని ఘాటుగా రాసుకొచ్చారు అమితాబ్. -
'సర్వేలో వ్యక్తిగత అంశాలు చెప్పనక్కర్లేదు'
సర్వేలో వ్యక్తిగత అంశాలను ప్రస్తావించాల్సిన అవసరం లేదని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు డి.శ్రీనివాస్ అన్నారు. సీఎల్పీ ఆఫీసులో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్సీలు హాజరు కాగా, ఇద్దరు మాత్రం గైర్హాజరయ్యారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి రాబోయే బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా డీఎస్ అన్నారు. ప్రతిపక్షంగా తాము పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పారు. సర్కారు చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఆ ఫార్మాట్‌ను చూసి మాత్రం కొందరు భయాందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు.