
సాక్షి,ముంబయి: ప్రజల సొమ్ముతో రాజకీయ నాయకులకు పోలీసు భద్రత సమకూర్చడం పట్ల బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నేతలకు పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో భద్రత కల్పించడం అవసరమా అని మహారాష్ట్ర సర్కార్‌ను సూటిగా ప్రశ్నించింది.రాజకీయ నాయకులు తమకు పోలీసు భద్రత అవసరమనుకుంటే ఆయా పార్టీలు స్వీకరించే నిధులను వెచ్చించాలని ప్రధాన న్యాయమూర్తి మంజులా చెల్లుర్, జస్టిస్ ఎంఎస్ సొనక్‌తో కూడిన హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది.
రాజకీయ నేతలకు ప్రజా ధనంతో పోలీసు భద్రత కల్పించడం తగదని మహారాష్ట్ర సర్కార్‌కు తేల్చిచెప్పింది. ప్రైవేట్ వ్యక్తులకు పోలీసు భద్రత కల్పించే ప్రస్తుత విధానాలను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
వీఐపీలు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలకు భద్రత కల్పించినందుకు వారి నుంచే బకాయిలు రాబట్టాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారిస్తోంది.మహారాష్ట్రలో ప్రైవేట్ వ్యక్తులకు దాదాపు 1000 మంది పోలీసు సిబ్బంది భద్రతా విధుల్లో నిమగ్నమయ్యారని పిటిషన్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment