పోలీస్ కమిషనర్ కార్యాలయం, విశాఖపట్నం
మూన్నెళ్లకోసారి ఇదే తంతు
తెర వెనుక విషయం వేరు
జనాన్ని నమ్మించేందుకే నాటకాలు
విశాఖపట్నం: ఖద్దరుతో ఖాకీ జత కట్టకపోతే జత కట్టేలా చేయడం ఖద్దరుకు అలవాటు.. ఖద్దరు ఏం చెబితే అదే చేసుకుపోవడం ఖాకీకి తప్పని గ్రహపాటు. ఈ రెండు వర్గాల మధ్య విడదీయలేని బంధం ఉంటుంది. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూవుంటారు. జిల్లా ఎస్పీ, నగర పోలీస్ కమిషనర్ తమకు సహకరించడం లేదని ఓపక్క ప్రజాప్రతినిధులు రుసరుసలాడుతుంటారు. మరోపక్క తెర వెనుక ఒకరికొకరు సహకరించుకుంటూనే ఉంటారు. పోలీసు బదిలీలు, నియామకాల విషయంలో తమ మాట చెల్లలేదని ఎమ్మెల్యేలు గతంలో సీఎంకు ఫిర్యాదు చేశారు.
మంత్రి కల్పించుకొని పోలీసు ఉన్నతాధికారులకు క్లాస్ తీసుకోవడంతో సద్దుమణిగింది. ఇది జరిగి కొన్ని నెలలు గడిచిపోయింది. తాజాగా పోలీస్ కమిషనరేట్ కొత్త భవనం ప్రారంభోత్సవానికి సీఎం వస్తుంటే ఆ కార్యక్రమానికి తమకు ఆహ్వానం సరిగ్గా అందలేదంటూ కొందరు ఎమ్మెల్యేలు వివాదం లేవనెత్తారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లామని చెప్పుకొస్తున్నారు. మళ్లీ ఈ ట్విస్ట్ ఏమిటని ఆరా తీస్తే అసలు డ్రామా బయటపడింది. నాలుగు రోజుల క్రితం చిరు వ్యాపారుల మార్కెట్‌ను అధికారులు బలవంతంగా కూలగొట్టారు.
పోలీసులు అంత కఠినంగా వ్యవహరించడానికి కారణం ఓ ప్రజాప్రతినిధి. ఆయన పంతం పట్టి ఆ మార్కెట్‌లో జనాన్ని అక్కడి నుంచి తప్పించాల్సిందేనని, అంత వరకూ కదిలేది లేదని జీవీఎంసీ కమిషనర్ ఎదుట కూర్చున్నారట. కమిషనర్ చేసేది లేక సిటీ పోలీస్ కమిషనర్ సహాయాన్ని కోరారు. జీవీఎంసీ సిబ్బంది, పోలీసులు, ఎమ్మెల్యే ఏకమై అలా మార్కెట్‌ను కూలగొట్టారు. అ విషయం బయటకు పొక్కడంతో అప్రతిష్ట పాలవుతామని గ్రహించిన ఆ ఎమ్మెల్యే మర్నాడు బాధితులను పరామర్శించి మొసలి కన్నీరు కార్చారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు, పోలీసులు చేసిన పనితో తమకు సంబంధం లేదని జనాన్ని నమ్మించేందుకే ఈ కమిషనరేట్ డ్రామా ఆడారని అంతా భావిస్తున్నారు. నిజానికి ఇటు నగరంలోనూ, అటు రూరల్‌లోనూ ప్రజాప్రతినిధులు చెప్పిందే పోలీస్ స్టేషన్‌లో నడుస్తోంది. దాని ఫలితంగానే ఎన్నడూ లేనంతగా హత్యలు, భూ కబ్జాలు, రౌడీయిజం పెచ్చుమీరుతున్నాయి. ఇది ఎంత దాచేసినా దాగని సత్యం.