సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ప్రధాన ఘట్టం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఆరు బల్దియాల్లో 189 వార్డులు ఉండగా, ఆదిలాబాద్‌లోని 34వ వార్డు, భైంసాలో మూడో వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
మిగిలిన 187 వార్డులకు ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆరు పట్టణాల్లో 3.57 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 325 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పర్యవేక్షక అధికారులతో పాటు, ప్రత్యేక అధికారులను నియమించారు. ఎన్నికల సిబ్బంది శనివారం సాయంత్రానికే ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికల ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిశీలించింది.
1,095 అభ్యర్థుల్లో అదృష్టవంతులెవరో..
మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం 2010 సెప్టెంబర్‌లో ముగిసింది. సుమారు నాలుగేళ్లుగా బల్దియాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఎట్టకేలకు ఈనెల 3న మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 10 నుంచి 14 వరకు నామినేషన్లు స్వీకరించారు. ప్రధాన, ప్రధానేతర పార్టీలతోపాటు, స్వతంత్రులు కౌన్సిలర్ పదవులకు భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు.
ఈనెల 15న నామినేషన్ల పరిశీలన పూర్తవగా, చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈనెల 18న బరిలో ఉండే 1095 అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈ అభ్యర్థులు పది రోజులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ప్రారంభంలో హంగు, ఆర్భాటం లేకుండా సాగిన ప్రచారం, చివరిరోజు శుక్రవారం మాత్రం హోరెత్తింది. శనివారం అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. డబ్బు, మద్యం పంపకాలతో ఓటర్లను ప్రలోభపెట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఓటు హక్కు వినియోగంపై విస్తృతంగా ప్రచారం జరిగింది. ఎన్నికల సంఘంతోపాటు, పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంఘాలు ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రచారం నిర్వహించాయి.
భారీ బందోబస్తు
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. పోలింగ్ జరుగుతున్న ఆరు మున్సిపాలిటీల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. భైంసా, నిర్మల్ మున్సిపాలిటీల్లో 43 అత్యంత సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక బలగాలు మోహరించాయి. ఏపీఎస్పీ, సీఆర్‌పీఎఫ్ కంపెనీలను దించారు. ఆరు మున్సిపాలిటీల్లో 326 పోలింగ్ కేంద్రాలుండగా, 136 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా పోలీసు శాఖ గుర్తించింది.
165 సమస్యాత్మక కేంద్రాలుగా భావిస్తోంది. జిల్లా ఎస్పీ గజరావు భూపాల్‌తోపాటు, ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 70 ఏఎస్సైలు ఎన్నికల బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. జిల్లా పోలీసు సిబ్బంది.. 220 హెడ్‌కానిస్టేబుళ్లు, 1,200 మంది కానిస్టేబుళ్లు, 80 మంది హోంగార్డులు, 40 మంది మహిళా కానిస్టేబుళ్లు ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారు. ఏపీఎస్పీ నాలుగు కంపెనీలు, ఒక సీఆర్‌పీఎఫ్ కంపెనీల బలగాలను పట్టణాల్లో మోహరించారు.
‘పుర’ పోలింగ్
Published Sun, Mar 30 2014 12:46 AM | Last Updated on Wed, Sep 26 2018 5:38 PM
Advertisement