సాక్షి, నల్లగొండ: రెండు విడతలుగా జరిగే ప్రాదేశిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ప్రభాకర్‌రావు తెలిపారు. గురువారం ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మొదటి విడతలో 33మండలాలు, రెండో విడతలో 26మండలాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నాం. అన్ని రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు సోదాలు చేస్తున్నాం. 2,739 పోలింగ్ కేంద్రాల్లో పోలీసులను మోహరిస్తాం.
మొదటి విడతలో సున్నిత 242, అతి సున్నిత 130 ప్రాంతాలను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. సున్నిత ప్రాంతాల్లో నలుగురు, అతి సున్నిత ప్రాంతాల్లో ఐదుగురు పోలీసులు విధులు నిర్వహిస్తారు. సాధారణ ప్రాంతాల్లో ఇద్దరు ఉంటారు. సున్నిత, అతి సున్నిత ప్రాంతాల్లో కొన్ని రోజుల క్రితమే పికెట్లు ఏర్పాట్లు చేశాం. అంతేగాక ఈ సమస్యాత్మక ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించాం. ఇక్కడ మోటార్ సైకిళ్లపై పోలీసులు తిరుగుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటారు. రేయింబవళ్లు వీరు విధుల్లో నిమగ్నమై ఉంటారు.
4వేల మందితో బందోబస్తు....
మొదటి విడత ప్రాదేశిక ఎన్నికలకు మొత్తం 4వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 3,500మంది పోలీసులు ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి 11 ఏపీఎస్పీ ప్లాటూన్లను రప్పిస్తాం. అవసరమైతే ఇతర యూని ఫాం ఉద్యోగులను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. వీలైతే మాజీ సైనికులను వారి ఆసక్తిని బట్టి ఆహ్వానిస్తాం.
విస్తృతంగా సోదాలు...
ప్రతి నియోజకవర్గానికి ఒక డీఎస్పీని.. ప్రతి మండలానికి ఇన్‌స్పెక్టర్‌ను కేటాయించి పర్యవేక్షిస్తున్నాం. క్షేత్రస్థాయిలో రూట్ మొబైల్ వాహనాలు తిరుగుతూ తనిఖీలు చేస్తుంటాయి. ఫ్లయింగ్ స్క్వాడ్‌లూ తని ఖీలు చేపడతాయి. దీనికితోడు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ నియోజకవర్గస్థాయిలో డీఎస్పీ పరిధిలో ఉం టాయి. ప్రతి నియోజకవర్గంలో 3బృందాలు విడతల వారీగా తనిఖీలు చేస్తాయి. వీటి ప్రధాన విధి.. డబ్బు, మద్యం రవాణాను అడ్డుకోవడం.
భారీగా నగదు పట్టివేత...
పోలీసులు విస్తృతంగా తనిఖీ చేయడంతో పెద్ద ఎత్తున నగదు, మద్యం పట్టుబడింది. ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలూ లేకుండా తరలిస్తున్న రూ. 3.86 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నాం. ఈ డబ్బును ఆదాయ పన్ను శాఖాధికారులకు అప్పగించాం. 605 కేసుల్లో నేరచరిత్ర, గతంలో విధ్వంసాలకు పాల్పడిన 6166 మందిని బైండోవర్ చేశాం. నాటుసారా దాదాపు ఏడువేల లీటర్లు, రెండు వేలకుపైగా బీర్లు, ఆరు వేల క్వార్టర్లు, 443 హాఫ్ మద్యం బాటిళ్లు, 345 ఫుల్ బాటిళ్లు, 66,500 కిలోల నల్లబెల్లం, 1500 కిలోల పటిక స్వాధీనం చేసుకున్నాం. 21 వాహనాలను సీజ్ చేశాం. లెసైన్స్ కలిగిన 790 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం.
నిష్పక్షపాతంగా....
అధికార పార్టీ, విపక్ష పార్టీ నేతలన్న పక్షపాతం మాకు లేదు. మాకు అందరూ సమానమే. రాగద్వేషాలకు అతీతంగా, పారదర్శకంగా విధులు నిర్వహిస్తున్నాం. గతంతో పోల్చుకుంటే.. ప్రస్తుతం మాపై ఎటువంటి ఒత్తిడీ లేదు. ఇప్పుడు స్వేచ్ఛగా మా విధులు నిర్వర్తించుకోగలుతున్నాం.
సస్పెన్షన్ తప్పదు....
అభ్యర్థులు, పార్టీల నాయకుల నుంచి పోలీసులు డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాకపోతే రాతపూర్వకంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదు. ఒకవేళ ఫిర్యాదులు అందితే పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. డబ్బులు తీసుకున్నారని తేలితే ఆ పోలీసులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించం. రెండో ఆలోచన లేకుండా సస్పెన్షన్ వేటేస్తాం. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే పోలీసులకు వివరించాం.
ప్రజలూ సమాచారం ఇవ్వొచ్చు...
డబ్బు, మద్యం పంపిణీ, ఇతర ప్రలోభాలకు గురిచేసినట్లు తెలిస్తే వెంటనే రంగంలోకి దిగుతున్నాం. ఇంటింటికీ తిరిగి సోదాలు చేయడం అసాధ్యం. ప్రజల వద్ద సమాచారం ఉంటే 100 నంబర్‌కు డయల్ చేసి వివరాలు తెలియజేయవచ్చు.
పటిష్ట నిఘా...
Published Fri, Apr 4 2014 2:10 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement
Advertisement