దొంగ ఓట్లన్నీ ఆ పార్టీ తమ్ముళ్లవే.. | - | Sakshi
Sakshi News home page

దొంగ ఓట్లన్నీ ఆ పార్టీ తమ్ముళ్లవే..

Published Sat, Dec 9 2023 12:10 AM | Last Updated on Sat, Dec 9 2023 9:00 AM

- - Sakshi

సాక్షి, అనంతపురం: 'తెలుగుదేశం పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావడం కోసం అడ్డదారులు తొక్కుతోంది. మైనర్లను ఓటర్లుగా చేర్పించడం.. అనుకూలమైన వారికి రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు కల్పించడం చేస్తోంది. అవకాశమున్న చోట్ల భారీగా దొంగ ఓట్లను జాబితాలోకి చేరుస్తోంది. చేసేదంతా చేసి తమకే పాపమూ ఎరుగనట్టు వైఎస్సార్‌సీపీపైకి నెపం నెడుతోంది. జాబితాను పరిశీలిస్తే టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన దొంగ ఓట్ల దందా ఇట్టే తెలిసిపోతుంది.'

ఆత్మకూరు రాప్తాడు నియోజకవర్గం తమకు కంచుకోటగా భావిస్తూ వచ్చిన టీడీపీకి 2019 ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి 25వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఓటర్లు దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వడాన్ని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ప్రజల పక్షాన నిలిచి ఓటర్లను తమవైపు ఆకట్టుకోవడం మరచి.. తప్పుడుదారిని ఎంచుకున్నారు. నియోజకవర్గంలోని ఆత్మకూరుతో పాటు మరికొన్ని మండలాల్లో కొంతమంది టీడీపీ నాయకులు తమకు తగ్గిపోయిన ఓట్ల స్థానంలో బోగస్‌ ఓటర్ల ద్వారా భర్తీ చేసుకోవాలని భావించారు.

తమకు అనుకూలంగా ఉన్నవారికి అవకాశమున్న చోట్ల డబుల్‌ ఓటు హక్కుకు దరఖాస్తు చేయించారు. చాలా చోట్ల అమ్మాయిలు పెళ్లిళ్లయ్యి మెట్టినిళ్లకు వెళ్లిపోయినా.. వారి ఓట్లను స్థానికంగా తొలగించకుండా అలానే ఉంచారు. అంతేకాదు పద్దెనిమిదేళ్లలోపు వయసు కలిగిన వారిని ఓటరుగా చేర్పించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఓటరు జాబితా సవరణలోనూ దొంగ ఓట్లను తొలగించడానికి టీడీపీ నాయకులు ససేమిరా అంటుండటం గమనార్హం.

ఈ ఓటరు కార్డులో ఉన్న వ్యక్తి పేరు నరేంద్ర చౌదరి. ఈయనకు ఆత్మకూరు మండలం సిద్దరాంపురం, అనంతపురం రూరల్‌ మండలం పాపంపేటలో రెండు చోట్ల ఓటు హక్కు ఉంది.

ఈ బాలుడి పేరు మనేరి దేవ నంద. ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామం. ఆధార్‌ వివరాల ప్రకారం 2007 సంవత్సరంలో పుట్టాడు. 16 ఏళ్ల వయసున్న ఈ బాలుడికి టీడీపీ కార్యకర్తలు ఓటు హక్కు కల్పించే ప్రయత్నం చేశారు.

ఈ ఓటరు కార్డులో కనిపించే మహిళ పేరు సాయి గీత. ఈమెకు ఆత్మకూరు మండలం సిద్దరాంపురంలోను, ఉరవకొండ మండలం 9వ వార్డులోను ఓటు హక్కు ఉంది.

రాప్తాడు మండలం గాండ్లపర్తి గ్రామంలో అలివేలమ్మ స్థానికంగాను, అనంతపురంలోను ఓటు హక్కు కలిగి ఉంది. అలాగే తిమ్మక్కకు గాండ్లపర్తి, అనంతపురంలో రెండు చోట్ల ఓటు హక్కు ఉంది. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా చాలా చోట్ల టీడీపీ సానుభూతి పరులు రెండు చోట్ల ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

ఓటమి భయంతోనేనా..?
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టారు. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చి బీడు భూములను సస్యశ్యామలం చేశారు. ఉచితంగా పొలాల్లో బోర్లు వేయించారు. రైతులు, కూలీల వలసలు తగ్గించారు. అనారోగ్యంతో ఉన్న వారిని, పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక భరోసా కల్పించి అండగా నిలిచారు.

మహిళలు ఆర్థికంగా ఎదగడానికి అమ్మ డెయిరీ ఏర్పాటు చేశారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందేలా చూశారు. ప్రజల్లో ప్రకాష్‌రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం టీడీపీకి పట్టుకుంది. ఈ క్రమంలోనే దొంగ ఓట్లను చేర్చడం ద్వారా ఓటమి నుంచి గట్టెక్కాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని వారికి కూడా రామగిరి మండలంలో ఓటు హక్కు కల్పించినట్లు గతంలో సాక్ష్యాలతో సహా బయటపడ్డాయి.
ఇవి చ‌ద‌వండి: మానవత్వంతో స్పందించిన సీఎం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement