కొమురవెల్లి/సిద్దిపేట: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ధర్మకర్తల మండలి పదవీ కాలం గత సెప్టెంబర్ 20 తో ముగిసింది. వెంటనే దేవదాయశాఖ అధికారులు రెగ్యులర్ కమిటీకి నోటిఫికేషన్ జారీ చేయవలసి ఉంటుంది. అందుకు అప్పుడు కొంత మంది బీఆర్‌ఎస్ పార్టీ నేతలు పావులు కదిపినా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆలయ రెగ్యులర్ కమిటీకి నోటిఫికేషన్ నిలిచిపోయింది.
సమయం లేకపోవడంతో..
ఇటీవల ఎన్నికల ప్రక్రియ పూర్తవడం, నూతనంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పుడు అందరి చూపు మల్లన్న ఆలయ ధర్మకర్తల మండలి నియామకం వైపు మళ్లింది. జనవరి 7న స్వామి కల్యాణం జరగనుంది. దీంతో దేవదాయశాఖకు రెగ్యులర్ కమిటీ నియమించే సమయంలేదు. రెగ్యులర్ కమిటీని నియమించాలంటే నోటిపికేషన్ జారీచేసి 45 రోజుల సమయం ఇచ్చి దరఖాస్తులు కోరాలి. ఆ తర్వాత వాటిని పరిశీలించి, విచారించి కమిటీని ప్రకటించాలి. స్వామి కల్యాణం వచ్చే నెల 7 ఉండడం, అదేవిధంగా సంకాంత్రి నుంచి జాతర మొదలు కానుడడంతో మూడు నెలల కోసం ఉత్సవ కమిటీని నియమించే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి.
పైరవీలు ప్రారంభం!
కమిటీ ఏర్పాటుకు అధికారులు సిద్ధమవుతున్న నేపథ్యంలో కొంత మంది కాంగ్రెస్ నాయకులు పైరవీలు ప్రారంభించినట్లు సమాచారం. సుమారు పదేళ్లు ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో ఆ నాయకులకు నామినేటేడ్ పదవులకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఆ ప్రాంత నాయకులు ఉత్సవ, రెగ్యులర్ కమిటీలలో స్థానం కోసం పాకులాడుతున్నారు. చేర్యాల మాజీ జెడ్పీటీసీ నర్సింగరావు, చేర్యాల మాజీ ఎంపీపీ బోడిగె నర్సింహులు, మహదేవుని శ్రీనివాస్, కొయ్యడ శ్రీనివాస్, వల్లాద్రి అంజిరెడ్డి, లింగంపల్లి కనకరాజు, చెరుకు రమణారెడ్డి, జంగనిరవి, జీవన్‌రెడ్డి, ముస్త్యాల యాదగిరితో పాటు జనగామ, మద్దూరు నర్మేట్ట, హుస్నాబాద్‌కు చెందిన మరి కొందరి నేతల పేర్లు చైర్మన్ రేసులో ఉన్నట్టు వినిపిస్తున్నాయి.
పొన్నం అనుచరులకే..
మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ ప్రధాన అనుచరులకు చైర్మన్‌గా అవకాశం కల్పిస్తారని పలువురు స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు. చేర్యాల, కొమురవెల్లి మండలలాకు చెందిన స్థానిక నేతలకే చైర్మన్ పదవి కట్టబెట్టాలని పలువురు కోరుతు న్నట్టు సమాచారం. కొంత కాలంగా ఆలయంలో ధర్మకర్తల మండలి లేకపోవడంతో ఆలయంలో అధికారులు తమ ఇష్టానుసారంగా పని చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆలయ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని, ప్రభుత్వం, దేవదాయశాఖ అధికారులు స్పందించి వెంటనే ఆలయంలో ధర్మకర్తల మండలి నియమించాలని చాలా మంది కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment