పోస్టింగ్ కావాలా నాయనా?
పోస్టింగ్ కావాలా నాయనా?
Published Sat, Jun 24 2017 3:36 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
- ఎస్సైకి 2 లక్షలు
- సీఐకి 5 లక్షలు
- డీఎస్పీకి 20 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు పోస్టింగులపై రాజకీయ పెత్తనం పెరిగిపోయింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమకు కావాల్సిన చోట, కోరుకున్న అధికారులకు పోస్టింగులు కట్టబెడుతున్నారు. రూ.లక్షల్లో ముడుపులు పుచ్చుకుంటూ సిఫార్సు లేఖలు ఇస్తున్నారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు సొంతంగా పోస్టింగులు ఇవ్వలేని పరిస్థితిలో పడిపోయారు. మరోవైపు డబ్బు లు పెట్టి కీలక చోట్ల పోస్టింగులు పొందుతున్న అధికారులు.. ఆ సొమ్ముకు రెట్టింపు రాబట్టుకునేందుకు అవినీతి, అక్రమాలు, వసూళ్ల దందాకు తెరలేపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఒక్క హైదరాబాద్ తప్ప..
రాష్ట్ర రాజధానిలోని హైదరాబాద్ కమిషనరేట్ తప్ప మిగతా అన్ని జిల్లాల్లోని పోలీసు పోస్టింగుల్లో నేతల ప్రభావం సాగుతోందని పోలీసు ఉన్నతాధికార వర్గాలు పేర్కొంటు న్నాయి. ఒక అధికారి ఒక పోస్టులో కనీసం రెండేళ్ల పాటు పనిచేయాలంటూ.. సుప్రీంకోర్టు సూచించినా అది అమలు కావడం లేదు. సిఫార్సుల ద్వారా వచ్చిన పోలీసు అధికారులను ఏడాది, ఏడాదిన్నర కాగానే పక్కనపెట్టి.. నేతలు మరో బేరం మాట్లాడుకుంటున్నారు. ఈ రకంగా మూడేళ్లలో ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలు కలిపి మొత్తం 400 మంది ముడుపులిచ్చి సిఫార్సు లేఖలతో పోస్టింగులు పొందారని సమాచారం.
డిమాండ్‌ను బట్టి ‘రేటు’!
ఎస్సై నుంచి డీఎస్పీ వరకు ఎవరికి, ఎక్కడ పోస్టింగ్ కావాలన్నా.. అక్కడి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల సిఫారసు లేఖలు ఉండాల్సిన పరిస్థితి పోలీసు శాఖలో నెలకొంది. సిఫార్సుల మేరకు వ్యవహ రించాలన్న ప్రభుత్వ పెద్దల సూచనలే దీనికి కారణం. అయితే ఈ సిఫార్సుల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కో రేటు పెట్టి మరీ వసూళ్లు చేస్తున్నారు. ఎస్సై పోస్టుకు రూ.2 లక్షలు.. సీఐ పోస్టింగ్‌కు రూ.5 లక్షల దాకా తీసుకుంటున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో మొదటిసారిగా ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేలు కొందరు ఈ తరహా దందాకు తెరలేపినట్టు గతంలోనే ఆరోపణలు వచ్చాయి. ఇక సబ్ డివిజన్‌లో ఉండే డీఎస్పీ పోస్టుకు సిఫార్సు కోసం ఆ డివిజన్ ‘మార్కెట్’ రేటును బట్టి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు చెల్లించుకుంటున్నారు.
వచ్చే దాంట్లో తలా ఇంత..
మహబూబ్‌నగర్‌లోని ఓ ఎమ్మెల్యే తన సామాజిక వర్గానికి చెందిన ఎస్సైలు, సీఐలను నియమించుకున్నారు. దీంతో ఇక్కడి ఎంపీకి, ఎమ్మెల్యేకు మధ్య వివాదాలు తలెత్తాయి. ఆ పంచాయితీ సీఎం వద్దకు చేరడంతో.. గొడవ ఎందుకని చెరో సగం పోస్టులను పంచుకున్నట్టు తెలిసింది. ఇదే జిల్లాలో నూతనంగా ఎన్నికైన మరో ఎమ్మెల్యే తనకు కావాల్సిన వాళ్లకు సిఫార్సు లేఖలు ఇచ్చి పోస్టింగులు తెచ్చుకున్నారు. నెలా నెలా వచ్చే మామూళ్లు, సెటిల్‌మెంట్ల నుంచి తనకు సగం ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. ఆయన మూడు పంచాయితీలు, ఆరు వసూళ్లుగా వ్యవహరిస్తున్నట్లు సీఎంకు గతంలోనే ఇంటెలిజెన్స్ నివేదిక అందించింది. ఇక కరీంనగర్‌లో ఓ ఎమ్మెల్యే ఇద్దరు ఎస్సైల నుంచి డబ్బులు తీసుకుని, సిఫార్సు లేఖలిచ్చి.. ఆరు నెలలకే వారిని ఆ పోస్టింగుల నుంచి మార్చేసినట్టు ఆరోపణలున్నాయి. ఇదే జిల్లాలో ప్రముఖ ప్రాంతంగా పేరు పొందిన చోట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టింగ్ వివాదంలో ఇద్దరు ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. అనంతరం జిల్లా మంత్రి వద్ద పంచాయితీ సెటిల్ చేసుకుని డబ్బులు వసూలు చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి.
సిఫార్సులపై ఓ మంత్రి ఫోర్జరీ డ్రామా..
ఉత్తర తెలంగాణలో అత్యంత సీనియర్ మంత్రిగా పేరున్న ప్రజాప్రతినిధి.. తన నియోజకవర్గంలో సీఐ పోస్టు కోసం ఒక ఇన్‌స్పెక్టర్ పేరు సిఫార్సు చేస్తూ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. దాంతో సంబంధిత సీఐకి పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. కానీ 4 రోజుల తర్వాత అదే చోట మరో అధికారికి పోస్టింగ్ ఇవ్వాలంటూ ఆ మంత్రి ఆఫీస్ నుంచే సిఫార్సు లేఖ వచ్చింది. దీంతో ఒకే పోస్టింగ్‌కు ఇద్దరిని సిఫార్సు చేయడమేమిటంటూ ఉన్నతాధికారులు మంత్రిని స్పష్టత అడిగారు. ఆ మంత్రి తన గుట్టు బయటపడకుండా ఉండేందుకు.. తాను ఇచ్చింది ఒకే సిఫార్సు లేఖ అని, అది రెండోదేనని చెప్పారు. మొదటి లెటర్ తనది కాదని, ఎవరో తన సంతకం ఫోర్జరీ చేసి ఇచ్చారనీ చెప్పుకొచ్చారు. అయితే అధికారులు రెండు లేఖలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించగా.. రెండు సంతకాలు చేసింది ఒకే వ్యక్తి అని, పెన్ను కూడా ఒకటేనని తేల్చింది. ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌కు పంపడంతో.. మరోసారి ఇలాంటి పనులు చేయొద్దంటూ మంత్రికి క్లాస్ పీకినట్లు తెలిసింది.
డబ్బులు వద్దు.. గిఫ్ట్‌గా కావాలి
ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఓ పోలీసు సర్కిల్ పోస్టు ఆశించిన ఇన్‌స్పెక్టర్... అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేను కలిశాడు. ఆ సర్కిల్‌కు తనను సిఫార్సు చేయాలని, అందుకు ‘ఏం’ చేయాలని కోరాడు. దీంతో ఆ ఎమ్మెల్యే.. తనకు డబ్బులపై వ్యామోహం లేదని, అంతగా అయితే మంచి కారు కొనుక్కొచ్చి ఇవ్వాలని ఆఫరిచ్చాడు. అంతే ఇన్‌స్పెక్టర్ రూ.13 లక్షలు పెట్టి కొత్త ఇన్నోవా వాహనాన్ని కొని బహుమతిగా అందించడం.. సిఫార్సు లేఖ వెళ్లడం, పోస్టింగ్ రావడం చకచకా జరిగిపోయాయి. కానీ నాలుగు నెలలు గడిచాయో లేదో ఆ ఎమ్మెల్యేకు, ఇన్‌స్పెక్టర్‌కు మధ్య తేడాలు వచ్చాయి. ఇంకేముంది ఆ ఎమ్మెల్యే మరో ఇన్‌స్పెక్టర్ నుంచి రూ.5 లక్షలు పుచ్చుకుని సిఫార్సు లేఖ ఇచ్చారు. దీనితో వివాదం ముదిరి పంచాయితీ సీఎం వద్దకు చేరింది.
చేతులు మారిన 25 కోట్లు!
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సాగించిన పోలీసు పోస్టింగుల వ్యవహారంలో దాదాపు రూ.25 కోట్లకు పైగా చేతులు మారినట్టు ఆ శాఖ అంచనా వేస్తోంది. డబ్బు రూపంలోనే కాకుండా కొన్ని చోట్ల ఒకే సబ్ డివిజన్‌లో పోస్టింగులు పొందిన ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లు, డీఎస్పీలు కలసి ఏకంగా ఎమ్మెల్యేలకు విదేశీ టూర్ల ఖర్చు భరించడం, హైదరాబాద్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేసి ఇవ్వడం, ఖరీదైన కార్లు బహుమతులుగా ఇవ్వడం వంటివి చేసినట్లు అంతర్గత విచారణలో బయటపడింది.
రెండేళ్లలో రెట్టింపు వసూలు చేద్దాం!
ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు లక్షల్లో ముట్టజెప్పి పోస్టింగులు పొందిన పోలీస్ అధికారులు.. రెండేళ్లలో ఆ సొమ్ముకు రెట్టింపు సంపాదించు కోవాలన్న రీతిలో వ్యవహరిస్తున్నారని ఓ జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. సిఫార్సులతో పోస్టింగులు పొందిన సీఐ, డీఎస్పీలు ఏం చేసినా ఎస్పీలు నియంత్రించే పరిస్థితి లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు. ఏం చేసినా మంత్రి నుంచో, ఎంపీ, ఎమ్మెల్యేల నుంచో ఫోన్లు చేయించడం వంటివి జరుగుతున్నాయని చెప్పారు.
Advertisement
Advertisement