'ఆ హీరోకు ఐదేళ్లు జైలుశిక్ష వేయడం కరెక్టే'
ముంబై: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు సెషన్స్ కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించడం సబబేనని, అతను నేరం చేసినట్టు నిరూపితమైందని బాంబే హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ షిండే వాదించినట్టు సమాచారం. జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. నిందితుడు సల్మాన్ ఖాన్పై ఎలాంటి కనికరం చూపాల్సిన అవసరం లేదని, కింది కోర్టు విధించిన శిక్షను అమలు చేయాలని సందీప్ షిండే హైకోర్టును కోరారు.
2002 నాటి హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ను దోషిగా పేర్కొన్న ముంబై సెషన్స్ కోర్టు అతడి ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేయగా.. బాంబే హైకోర్టు ఆ తీర్పును రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ ప్రస్తుతం బాంబే హైకోర్టులో సాగుతోంది. కింది కోర్టు తీర్పును రద్దు చేయాలంటూ సల్మాన్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఏ ఆర్ జోషి విచారిస్తున్నారు. కోర్టులో సందీప్ షిండే, ప్రాసిక్యూటర్ పూర్ణిమా కంథారియా తమ వాదనలు వినిపిస్తూ.. 'ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్ మద్యం సేవించాడు. ఆ మరుసటి రోజు వైద్య పరీక్షల కోసం అతడిని ఆస్పత్రికి తీసుకువచ్చినపుడు మద్యం తాగినట్టు వాసన వచ్చింది' అని కోర్టుకు తెలియజేసినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్ కారు డ్రైవర్ అశోక్ సింగ్ వాహనాన్ని నడుపుతున్నాడని, టైరు పేలడంతో వాహనం అదుపుతప్పి ఫుట్పాత్పైకి దూసుకెళ్లిందన్న సల్మాన్ తరపు న్యాయవాదుల వాదనను తోసిపుచ్చారు. ప్రమాద స్థలంలో సల్మాన్ ఉన్నాడని సందీప్ షిండే, పూర్ణిమా కంథారియా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.