ముఖేశ్ అంబానీ, మొయిలీలపై కేసు
గ్యాస్ వ్యవహారంలో ఢిల్లీ ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు
మురళీదేవరా, వీకే సిబల్‌పై కూడా..
న్యూఢిల్లీ: కేజీ బేసిన్ గ్యాస్ వ్యవహారంలో కేంద్ర పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ, రిలయన్స్ అధిపతి ముఖేశ్ అంబానీ కుమ్మక్కయ్యారంటూ వచ్చి న ఫిర్యాదులననుసరించి కేసులు పెట్టాలన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలపై ఢిల్లీ అవినీతి నిరోధక సంస్థ (ఏసీబీ) చర్యలు చేపట్టింది. ముఖేశ్ అంబానీ, వీరప్ప మొయిలీ, మాజీ మంత్రి మురళీ దేవరా, హైడ్రోకార్బన్స్ మాజీ డీజీ వీకే సిబల్‌లపై ఆ సంస్థ కేసు పెట్టింది. వారిపై అవినీతి నిరోధక చట్టాల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదైందని ఏసీబీ అధికారి ఒకరు బుధవారం తెలిపారు. సహజవాయువుకు కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరల పెంచేందుకు కుమ్మక్యయ్యారంటూ కేజ్రీవాల్ కేంద్ర మంత్రి, రిలయన్స్ అధిపతిపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.
ఆర్థికవేత్త అయిన మీకు: కేసులో విచారణ పూర్తయే వరకూ గ్యాస్ ధరలు పెంచాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేజ్రీవాల్ ప్రధానికి లేఖ రాశారు. గ్యాస్ ధరల పెంపు వల్ల సీఎన్‌జీ, విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడి సామాన్యుడికి కష్టాలు తెచ్చిపెడుతుందని, ఆర్థికవేత్త అయిన మీకు ధరల పెంపు కుమ్మక్కు ద్వారా ఆర్థిక వ్యవస్థపై ఏమేరకు ప్రభావం పడుతుంతో చెప్పనక్కర్లేదని పేర్కొన్నారు.
అవినీతి బాగా పెరిగింది: సీజేఐ
న్యూఢిల్లీ: అవినీతి కేన్సర్ వంటిదని, గత 60 ఏళ్లలో విపరీతంగా పెరిగిపోయిందని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ పి.సదాశివం ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని అరికట్టాలంటే ఆలోచనా విధానంలో మార్పు రావాలన్నారు. ఆయన బుధవారమిక్కడ కేంద్ర విజిలెన్స్ కమిషన్ స్వర్ణోత్సవాల్లో ప్రసంగించారు. ప్రజలు అవినీతి నిర్మూలనపై ఆశ వదులుకోవడం, దానితో రాజీపడడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. సీవీసీని లోక్‌పాల్‌తో అనుసంధానించాలని లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ్ అన్నారు.
కాంగ్రెస్ అవిశ్వాసాన్ని నెగ్గిన నవీన్ సర్కారు
భువనేశ్వర్: బీజేడీ నేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష కాంగ్రెస్ బుధవారం అసెంబ్లీలో పెట్టిన అవిశ్వాస తీర్మానం 69 ఓట్ల తేడాతో వీగిపోయింది. తీర్మానానికి వ్యతిరేకంగా 95 మంది, మద్దతుగా 26 మంది ఓటేశారు. ప్రభుత్వం నిరుద్యోగం, అవినీతి తదితర సమస్యలను తీర్చడంలో ఘోరంగా విఫలమైందని, కేంద్ర నిధులను ఖర్చు చేయడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. తీర్మానం వీగడం కాంగ్రెస్ మేధోపరమైన దివాలాకోరుతనానికి అద్దం పడుతోందని నవీన్ దుయ్యట్టారు.