మొయిలీ, అంబానీల కుమ్మక్కు..
ఎఫ్‌ఐఆర్‌లో ఏసీబీ అభియోగం
ఎన్‌టీపీసీకి సరఫరా చేసే గ్యాస్ ధరల పెంపు అక్రమం
రిలయన్స్‌కు లబ్ధి చేకూర్చేందుకే యూపీఏ ప్రభుత్వ నిర్ణయం
న్యూఢిల్లీ: వరుస కుంభకోణాలతో అపవాదు మూటగట్టుకున్న యూపీఏ ప్రభుత్వానికి మరో మచ్చ ఇది. ఎన్‌టీపీసీకి సరఫరా చేసే గ్యాస్ ధరల విషయంలో యూపీఏ ప్రభుత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అనుకూలంగా వ్యవహరించిందని అవినీతి వ్యతిరేక విభాగం(ఏసీబీ) ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. 2014 ఎన్నికల్లో అయ్యే వ్యయానికి అవసరమైన నిధులను రిలయన్స్ నుంచి పొందే ఆలోచనతోనే ఇలా చేసిందని పేర్కొంది. ఇదే ఆలోచనతో బీజేపీ కూడా నోరు మెదపలేదని అభిప్రాయపడింది. ఈ గ్యాస్ ధరల విషయంలో పెట్రోలియం మంత్రి ఎం.వీరప్ప మొయిలీ, రిలయన్స్ అధినే ముఖేశ్ అంబానీ, మరికొందరి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది.
ఇలా మొదలైంది: ఢిల్లీ కేబినెట్ మాజీ కార్యదర్శి టి.ఎస్.ఆర్. సుబ్రమణియన్, మాజీ కార్యదర్శి ఇ.శర్మ, మాజీ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హెచ్. తహిలియానీ, అడ్వొకేట్ కామినీ జైశ్వా ల్ చేసిన ఫిర్యాదు ఆధారంగా సీఎం కేజ్రీవాల్ ఈ కేసు లో ఏసీబీ విచారణకు ఆదేశించారు. ప్రస్తుత డాలర్ విలువను బట్టి చూస్తే గ్యాస్ ధరల పెంపు వల్ల ప్రజలపై ఏడాదికి రూ. 54,500 కోట్ల భారం పడుతుందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘కేజీ డీ6 బ్లాక్‌లో కనుగొన్న సహజ వాయువుపై భారత ప్రభుత్వానికి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్), నికో రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య 2000 సంవత్సరం ఏప్రిల్ 12న ఒప్పందం కుదిరింది. 2004లో ఎన్‌టీపీసీ విద్యుత్ ప్లాంటులకు ఒక్కో ఎంఎంబీటీయూ(మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్) గ్యాస్ 2.34 డాలర్ల చొప్పున, ఇలా 17 ఏళ్లపాటు సరఫరా చేసేందుకు రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కొంత కాలం తర్వాత ఆర్‌ఐఎల్ మాట మార్చింది. ఒప్పందంలో పేర్కొన్న ధరకు గ్యాస్ సరఫరా చేయడానికి నిరాకరించింది.
రిలయన్స్ ఒత్తిడితో 2007లో యూపీఏ ప్రభుత్వం గ్యాస్ ధరలను ఏకంగా ఎంఎంబీటీయూ-4.2 డాలర్లకు పెంచింది. ఇది పూర్తిగా అవినీతి, అక్రమాలతో కూడుకున్న చర్య’ అని ఫిర్యాదులో ఆరోపించారు. ఇది చాలదన్నట్లు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దాన్ని 8.4 డాలర్లకు పెంచాలని నిర్ణయించడం యూపీఏ చేసిన అతిపెద్ద అవినీతికి నిదర్శనమన్నారు. కాగా, ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ ధరలను పెంచాలని తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేది లేదని కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు.