ఏడాదికి 12 సిలిండర్లు?
సబ్సిడీ కోటా పెంపును తీవ్రంగా పరిశీలిస్తాం: మొయిలీ
న్యూఢిల్లీ: వంటింటి గ్యాస్ మంటల సెగ కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కారుకు తగిలినట్లుంది. ఎన్నికల ఏడాది కావడంతో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల కోటాను ఏడాదికి 12కు పెంచాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు కేంద్ర మంత్రులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ కూడా కాస్త మెత్తపడినట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల కోటాను 12కు పెంచే ప్రతిపాదనను తీవ్రంగా పరిశీలిస్తుందని వీరప్ప మొయిలీ శుక్రవారం మీడియాకు తెలిపారు. సబ్సిడీ సిలిండర్ల పెంపు ప్రతిపాదన లేదని వారం క్రితమే ప్రకటించిన మొయిలీ భిన్నంగా మాట్లాడడం గమనార్హం.
ఆర్థిక మంత్రి చిదంబరంతో సంప్రదించి ఈ విషయాన్ని రాజకీయ వ్యవహారాల కేబినెట్ ముందుకు తీసుకెళతానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ప్రధాని మన్మోహన్‌ను కలిసి.. సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను పెంచాలని గట్టిగా కోరారు. అనంతరం ఎంపీలు సంజయ్ నిరుపమ్, పీసీ చాకో, మహాబల్ మిశ్రాలు మొయిలీని కలిసి వినతి పత్రం ఇచ్చారు. సాధారణ ప్రజలకు ఈ కోటా సరిపోదని, 12కు పెంచాలని డిమాండ్ చేసినట్లు పీసీచాకో చెప్పారు. ఈ మేరకు ఎంపీలు మొయిలీకి ఒక వినతిపత్రం కూడా ఇచ్చారు. కాగా, పలు రాష్ట్రాల సీఎంల నుంచి సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు పెంచాలంటూ ఒత్తిడి వస్తోందని.. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని చిదంబరం గతవారమే ప్రకటించారు.