నగదు జమ కాని విషయమై జిల్లా పౌర సరఫరాల కార్యాలయంలో ప్రశ్నిస్తున్న లబ్ధిదారులు
ఉచిత గ్యాస్ ఉత్తిదేనా...!
ఆరు నిబంధనలతో అనర్హత వేటు
ఈకైవేసీ సాకుతో నగదు జమ కాని వైనం
నీరుగారుతున్న పథకం
విజయనగరం జిల్లాలో రెండు నెలలుగా ఆరు వేల మంది ఎదురు చూపులు
బ్యాంకులు, అధికారుల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణ
అతని పేరు రవి. విజయనగరం పట్టణంలోని వీటీ అగ్రహరంలో ఉంటున్నాడు. కూటమి ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ ఇస్తుందంటే కుటుంబ ఆర్థిక భారం తగ్గుతుందని సంబరపడ్డాడు. పథకం అమలు తరువాత రెండుసార్లు గ్యాస్ సిలిండర్ విడిపించారు. ఒక్క దానికి కూడా నగదు జమ కాలేదు. మొదటి సిలిండర్‌కు నగదు జమ కాలేదని విజయనగరం జిల్లా పౌర సరఫరాల శాఖ, గ్యాస్ ఏజెన్సీ, బ్యాంకుల చుట్టూ తిరిగారు. ఈకైవేసీ చేయించమంటే చేయించారు. అయినా నగదు జమ కాలేదు.
విజయనగరం అర్బన్: ‘ఆడపడుచుల కష్టం తీర్చుతా.. మీకు తెల్లకా ర్డు ఉంటే చాలు.. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం.. నా మాట నమ్మండి..’ ఇదీ గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ. అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత గ్యాస్‌కు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అమలు పేరుతో గ్యాస్ తుస్సుమనిపించారు. అన్ని అర్హతలుండీ సిలిండర్లు పొందిన వారిలోనూ వేలాది మందికి ఎగనామం పెట్టారు. మహిళలకు ఉచిత గ్యాస్ పేరిట మరోసారి పొగ పె ట్టారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం మాట మూన్నాళ్ల ముచ్చటగా మారింది. డబ్బులిచ్చి గ్యాస్ కొంటే నగదు రానంటోంది.
ఉచిత గ్యాస్ డబ్బులు కోసం జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. రెండు నెలలుగా లబ్ధిదారులు నగదు కోసం ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీరుపై మహిళ లు మండిపడుతున్నారు. సూపర్ సిక్స్ ప్రామాణికంగా కూటమిలో టీడీపీ ఇచ్చిన హామీ ఉచిత గ్యాస్ పథకం. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తరువాత ఉచిత గ్యాస్ పథకాన్ని హడావుడిగా తెరపైకి తీసుకొచ్చింది. ఉచితం అంటూ లబ్ధిదారులపై తొలుత భారం వేసి ఆ తరువాత నగదు బ్యాంకు ఖాతాకు జమ వేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని గట్టిగా హామీ ఇచ్చింది. అయితే ఈ గ్యాస్ ఉత్తి గ్యాస్ అని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి రోజున ప్రకటించిన ఈ ఉచిత గ్యాస్ బండ పేలని టపాసులా మిగిలింది.
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న 6 వేల మంది
జిల్లాలో 5.5 లక్షల మంది తెల్లకార్డుదారులు ఉన్నా రు. వీటిలో దాదాపు 3 లక్షల మంది వరకు మూడు గ్యాస్ ఏజెన్సీల నుంచి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. పథకం అమలు చేసిన తరువాత సిలిండర్ కోసం బుకింగ్ చేసిన 3 లక్షల 60 వేల 461 మహిళామణులలో 6 వేల మందికి ఇప్పటికీ డబ్బులు అకౌంట్ లో జమ కాలేదు. నిర్ణీత సమయంలోపు వంట గ్యా స్ నగదు ఖాతాల్లో జమ కాకపోవడంతో లబ్ధిదారు లు దిక్కుతోచని స్థితిలో ఆందోళన చెందుతున్నారు. ఈ గ్యాస్ నగదు వివరాల కోసం ఎవరిని అడిగి తెలుసుకోవాలో తెలియక తికమకపడుతున్నారు.
టోల్ ఫ్రీ కూడా డమ్మీ
సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబరు 1967కి తెలియజేయొచ్చని విస్తృత ప్రచా రం చేసారు. అయితే ఈ నంబరు డమ్మీలాగ ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్రయోజనం ఉండడం లేదు. ఈ కారణంగా గ్యాస్ ఏజెన్సీ వద్ద లబ్ధిదారు లు క్యూ కడుతున్నారు. వారు కూడా ఏ రకమైన సమాధానం ఇవ్వడం లేదు. దీంతో ఉచిత గ్యాస్ పథకం అందరికీ కాదని.. కొందరికేనా... అని ప్రజలు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment