
సిరిసిల్ల: ఎలక్ట్రిక్ కుక్కర్, గ్యాస్ సిలిండర్‌పై వంట లు చేస్తున్న ఈ రోజుల్లోనూ కొందరు వంటకు కట్టెలనే వినియోగిస్తున్నారు. సగటు కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగైందని నివేదికలు వస్తున్నా ఆకలిమంటను తీర్చుకునేందుకు వంట చేయాలంటే కట్టెల పొయ్యిని వెలిగించాల్సిందే.
ఇంటింటికీ దీపం పథకంలో ఉచితంగా సిలిండర్లు ఇచ్చామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పగా ప్రకటించిన సిరిసిల్ల కార్మికక్షేత్రంలో ఇంకా కొందరు పేదలు వంట కోసం కట్టెల వేటలో కష్టాలు అనుభవిస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్క నిండని పేద కుటుంబాలు వారంలో ఒక్క రోజు ఇలా ఎండిన కట్టెల కోసం సిరిసిల్ల శివారులో అన్వేషిస్తున్నారు. దొరికిన కట్టెలను మోపులుగా కట్టుకుని నెత్తిన మోస్తూ ఇంటికి చేరుతున్నారు. సిలిండర్ కూడా కొనలేని స్థితిలో కట్టెలను నమ్ముకుని ఇలా కష్టాలను అనుభవిస్తున్నారు. వంట బాధ్యత మహిళలదే కావడంతో కట్టెలను సమకూర్చుకునే అదనపు బాధ్యతలు తీసుకుంది.
సిరిసిల్లలో నిత్యం కట్టెల వేటలో మహిళలు సర్కారుతుమ్మ, తుంపల్లో తిరుగుతూ కట్టెలు, కాగితం అట్టపెట్టెలను ఏరుతూ కనిపిస్తున్నారు. ‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే మహారాణి. కానీ గిన్నెలపై మా నాన్న పేర్లు’ ఉన్నాయని ఓ మహిళా రచయిత్రి పురుషాధిక్య సమాజాన్ని రెండు దశాబ్దాల కిందటే ప్రశ్నించారు. కట్టెల కష్టాలకు ఎదురీదుతూ వండివారుస్తున్న ‘ఆమె’కు వందనం. రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికై నా క్షేత్రస్థాయిలో ఇంకా సిలిండర్ లేని కుటుంబాలను గుర్తించి వారికి ఉచితంగా ‘దీపం’ పథకంలో సిలిండర్లు అందిస్తే ఇలాంటి కట్టెల కష్టాలు తీరుతాయి.
Comments
Please login to add a commentAdd a comment