అర్హులకూ రూ.500 గ్యాస్ సిలిండర్’ అందని వైనం
‘ఉచిత విద్యుత్’ వర్తిస్తున్నా...గ్యాస్ సబ్సిడీ మాత్రం నిల్
కలెక్టరేట్, ప్రజాపాలన కౌంటర్ల చుట్టూ లబి్ధదారుల చక్కర్లు
స్పష్టత ఇవ్వని సివిల్ సప్లై విభాగం, గ్యాస్ ఏజెన్సీలు
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ పథకం అర్హులైన నిరుపేద కుటుంబాలకు సైతం అందని ద్రాక్షగానే తయారైంది. ఒక కుటుంబం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు అర్హత సాధించినా.. వంట గ్యాస్ సబ్సిడీ మాత్రం వర్తించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. లబి్ధదారులు కలెక్టరేట్ ప్రజాపాలన కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేసి దరఖాస్తులు సవరించుకున్నప్పటికీ ఫలితం మాత్రం దక్కడం లేదు. ఇటు పౌరసరఫరాల శాఖ కానీ, అటు ఆయిల్ కంపెనీల గ్యాస్ ఏజెన్సీలు కూడా దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. ఫలితంగా నిరుపేదలు నిరాశకు గురవుతూ.. ఎప్పటి మాదిరిగానే బహిరంగ మార్కెట్ ధర చెల్లించి వంట గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రజాపాలనలో..
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల వర్తింపు కోసం సరిగ్గా తొమ్మిది నెలల క్రితం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించి బీపీఎల్ కుటుంబాలను గుర్తించింది. అన్ని పథకాలకు తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. అర్హత సాధించిన కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్ సిలిండర్ వర్తింపజేశారు. కానీ, సగానికి పైగా కుటుంబాలు కేవలం ఉచిత విద్యుత్ వర్తింపునకు పరిమితమయ్యాయి. సబ్సిడీ గ్యాస్ మాత్రం అందడం లేదు.
ఇదీ పరిస్థితి
గ్రేటర్ హైదరాబాద్ అర్బన్ పరిధిలో అధికారికంగా గృహోపయోగ వంటగ్యాస్ కనెక్షన్ కలిగిన కుటుంబాలు 30.18 లక్షలకు పైనే ఉన్నాయి. అందులో 20 శాతం మినహా మిగతా 80 శాతం కుటుంబాలు మ హాలక్ష్మి పథకం కింద రూ. 500కు వంట గ్యాస్ సిలిండర్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో కనీసం పది శాతం దరఖాస్తుదారులకు కూడా గ్యాస్ సబ్బిడీ వర్తించలేదు.
పరిష్కారమేదీ?
గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాల ఫలాలు వర్తించని కుటుంబాల కోసం దరఖాస్తు సవరణ (ఎడిట్) కోసం కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలు సమస్యకు పరిష్కారం చూపడం లేదు. ఈ కేంద్రాల్లో పథకాలు వర్తించని దరఖాస్తుదారులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు గ్యాస్‌కనెక్షన్ నెంబర్, ఎల్పీజీ కస్టమర్ ఐడీ, మొబైల్ నెంబర్లను సవరించుకునే వెసులుబాటు ఉంది. దీంతో సేవా కేంద్రాలకు క్యూ కట్టి దరఖాస్తులను సవరించుకుంటున్నా.. సమస్యకు పరిష్కారం లభించడం లేదని నిరుపేదలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన వారికి గ్యాస్ సబ్సిడీ వర్తింపజేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment