ఇంటి గుమ్మం వద్దకు ఎల్పీజీ సిలిండర్ మోసుకొచ్చే బాయ్స్ నిర్ణీత రీఫిల్ ధరపై అదనంగా వసూలు చేసేది కొంత మొత్తమే అయినా.. మహానగరంలో దినసరి మొత్తం లెక్కిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే.. రోజుకు అక్షరాలా రూ.22.40 లక్షలు. నెలకు రూ.6.72 కోట్ల పైమాటే. సిలిండర్లపై ఇంతలా అదనంగా బాదుతున్నారంటే నమ్మశక్యం కాదు. కానీ.. ఇది నిప్పులాంటి నిజం. అగ్గిలాంటి వాస్తవం.
సాక్షి, హైదరాబాద్ : ఒకవైపు వంట గ్యాస్ ధర మంట మండిస్తుండగా.. డోర్ డెలివరీ బాయ్స్ మాత్రం.. సిలిండర్‌పై అదనపు మోత మోగిస్తున్నారు. వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. సిలిండర్ రీఫిల్ నిర్ణీత ధర కంటే అదనంగా వసూళ్లకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో గృహాపయోగ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.952. డోర్‌డెలివరీ బాయ్స్ మాత్రం రూ.980కు తగ్గకుండా వసూలు చేస్తున్నారు. అంటే ఇది నిర్ణీత బిల్లు కంటే రూ.28 అదనం. అయినా చెల్లించాల్సిందే.
చదవండి: ఒకే వేదికపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు..
గ్యాస్ ధర, జీఎస్టీ, ఎస్‌జీఎస్టీ, డోర్ డెలివరీ చార్జీ (రవాణా, హమాలీ, నిర్వహణ) తదితరాలన్నీ కలుపుకొనే డిస్ట్రిబ్యూటర్ల బిల్లింగ్‌తో వినియోగదారులకు సిలిండర్ సరఫరా అవుతోంది. చమురు సంస్థలు నిర్దేశించిన ధరనే బిల్లింగ్ చేస్తున్న స్థానిక ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు రవాణా భారాన్ని మాత్రం డెలివరీ బాయ్స్‌పై వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయిల్ కంపెనీల ఎల్‌పీజీ డీలర్లు డెలివరీ బాయ్స్‌కు నామమాత్రంగా వేతనాలు చెల్లిస్తుండగా, మరికొందరు డీలర్లు రీఫిల్ డోర్ డెలివరీపై కమీషన్‌న్ అందిస్తున్నట్లు సమాచారం. వేతనాలు సరిపడకపోవడంతో బాయ్స్ సిలిండర్ డోర్ డెలివరీ సమయంలో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం.
ఇదీ లెక్క..
నగరంలో వంటగ్యాస్ వినియోగదారులు సుమారు 26.80 లక్షల వరకు ఉన్నారు. ప్రతి రోజు దాదాపు 90 వేల మంది వరకు రీఫిల్ కోసం బుకింగ్ చేస్తుంటారు. ప్రధాన ఆయిల్‌కంపెనీల సుమారు 115 ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు తమ 1,250 బాయ్స్ (సిబ్బంది) ద్వారా ప్రతి నిత్యం కనీసం 80 వేల వరకు రీఫిల్స్ డోర్ డెలివరీ చేస్తుంటాయి. డోర్ డెలివరీ బాయ్స్ మాత్రం ప్రస్తుత సిలిండర్ ధరను బట్టి ఒక్కో రీఫిల్‌పై రూ.28 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు రూ.22.40 లక్షలు అంటే నెలకు వసూలయ్యేది రూ. 6.72 కోట్లకు పైమాటే. ఇలా బహిరంగా దోపిడీ జరుగుతున్నా ఆయిల్ కంపెనీలు, పౌరసరఫరాల శాఖ పట్టీపట్టనట్లు వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ దోపిడీకి అడ్డుకట్ట పడేదెలాగో ప్రభుత్వ యంత్రాంగమే జవాబు చెప్పాలి మరి.
రీఫిల్ డెలివరీ నిబంధనలివీ...
► వినియోగదారులు ఆన్‌లైన్‌లో సిలిండర్ రీ ఫిల్ బుక్ చేసుకున్న తర్వాత బిల్లు జనరేట్ అవుతుంది. దాని ఆధారంగా డిస్ట్రిబ్యూ టర్లు తమ సిబ్బందిచే వినియోగదారులకు రీఫిల్‌ను డెలివరీ చేయాల్సి ఉంటుంది.
► స్ట్రిబ్యూటర్ తమ గోదాము నుంచి అయిదు కిలోమీటర్ల దూరం వరకు ఉచితంగా సిలిండర్ రీఫిల్ డోర్ డెలివరీ చేయాలి. 6– 15 కిలోమీటర్ల దూరం ఉంటే రవాణా చార్జీలకు రూ.10 వసూలు చేయాలి. 16–30 కిలో మీటర్ల దూరం ఉంటే రూ.15 తీసుకోవాలి. ఒకవేళ వినియోగదారుడు గ్యాస్ గోదాముకు వెళ్లి సిలిండర్ తీసుకుంటే బిల్లులో రూ.8 తగ్గించాల్సి ఉంటుంది.
► సిలిండర్ డోర్ డెలివరీ సమయంలో ప్రత్యేక పరికరంతో రీఫిల్ నిర్ణీత బరువు పరిమాణాన్ని వినియోగాదారులకు చూపించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment