మొయిలీ, అంబానీలపై ఢిల్లీ సర్కారు క్రిమినల్ కేసులు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిరంతర పోరాట యోధుడిగా తన పేరును సార్థకం చేసుకుంటున్నారు. ఇప్పుడు తన పోరాటాన్ని నేరుగా కేంద్ర మంత్రులు, కార్పొరేట్ పెద్దలపైనే ఆయన ఎక్కుపెట్టారు. కేంద్ర చమురుశాఖ మంత్రి వీరప్ప మొయిలీ, ఆశాఖ మాజీ మంత్రి మురళీ దేవ్రా, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తదితరులపై క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించారు. అది కూడా తాను వ్యక్తిగతంగా కాకుండా ఢిల్లీ ప్రభుత్వం తరఫునే పెట్టిస్తున్నారు.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సహజ వాయువు ధరలను పెంచాలన్న నిర్ణయాన్ని ఆయన తొడగొట్టి సవాలు చేస్తున్నారు. ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్, హైడ్రోకార్బన్స్ మాజీ డీజీ వీకే సిబల్ తదితరులపై కేసులు దాఖలు చేయాల్సిందిగా ఏసీబీకి తాను సూచించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. గ్యాస్ ధర పెంపును తాత్కాలికంగా పక్కన పెట్టాలని, ఈ అంశాన్ని తాను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి, అక్కడే తేల్చుకుంటానని కేజ్రీవాల్ చెబుతున్నారు.