టీడీపీ ఎంపీ రవీంద్ర బాబు (ఫైల్ ఫోటో)
సాక్షి, ఢిల్లీ : ప్రత్యేక హోదా అంశంలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీ రవీంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి నుంచి తాము బయటికి వచ్చినందునే రాష్ట్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పగబట్టారన్నారు. విభజన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలను చిన్న చూపు చూస్తూ మోదీ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీశారని ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతోనే కేంద్రం ఆంధ్రప్రదేశ్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. ప్రధాని ఇంటిని ముట్టడించినా ఫలితం లేదని ఎంపీ రవీంద్ర బాబు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం దేశాన్ని విచ్చిన్నం చేయడం ద్వారా దక్షిణ భారత దేశాన్ని వేరు చేయాలని చూస్తోందని ఆరోపించారు. కేంద్ర అనుచిత వైఖరి పట్ల యువత రగిలిపోతోందని, అంతర్యుద్ధం వచ్చే అవకాశం కూడా ఉందని ఆయన హెచ్చరించారు. దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.
కేజీ బేసిన్‌తోనే ఆదాయం..
రాష్ట్రంలో కేంద్రీకృతమైన కేజీ బేసిన్ వల్లే గ్యాస్, చమురు దిగుమతులు తగ్గాయని, ఈ కారణంగానే విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని రవీంద్రబాబు వ్యాఖ్యానించారు. కేజీ బేసిన్‌లోని క్రూడ్ ఆయిల్‌ను శుద్ధి చేయడానికి కాకినాడ ప్రాంతంలోనే పెట్రో కెమికల్ కాంప్లెక్ కడతామని హామీ ఇచ్చి.. ఇప్పుడు రత్నగిరికి మార్చడం అన్యాయమన్నారు. గ్యాస్ కోసం 30 నుంచి 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన ఓఎన్‌జీసీ అద్దె కొంపలో ఉంటోందని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వానికి, ఈస్టిండియా కంపెనీకి తేడా లేదని మండిపడ్డారు. తక్షణమే ఎల్ అండ్ జీ టెర్మినల్ నిర్మించాలని, రత్నగిరి నుంచి పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను కాకినాడకు తరలించాలని డిమాండ్ చేశారు. ఈ అంశమై త్వరలోనే పెట్రోలియం శాఖ మంత్రితో భేటీ అవుతానని రవీంద్ర బాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment