జనతంత్రం
కష్టపడి సంపాదించిన వాడికే డబ్బు విలువ తెలుస్తుందంటారు. విలువ తెలుసు కనుక దానిపట్ల బాధ్యత కూడా పెరుగుతుంది. దొంగ సొత్తుకూ, అక్రమ సంపాదనకూ ఈ సూత్రం వర్తించదు. డబ్బు సంపాదనే కాదు, విజయ సాధన కూడా ఇంతే. అది ఎన్నికల విజయమైనా మరే రకమైన విజయమైనా సరే. పోరాడి గెలిచిన వాడికి తనకు దక్కిన విజయం పట్ల గౌరవం ఉంటుంది. విజయ హేతువుల పట్ల వినమ్రత ఉంటుంది. బాధ్యత ఉంటుంది. అన్ని రంగాల్లోనూ దొడ్డిదారి విజయాలు కూడా ఉంటాయి. ఎన్నికల్లో కూడా ఉంటాయి.
పరోక్ష ఎన్నికల్లో ఇటువంటి దొడ్డిదారి విజయాల వికటాట్టహాసం మనకు తెలియనిది కాదు. కానీ ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల తీర్పును ‘దొంగిలించడమ’నే సరికొత్త సాంకేతిక ప్రక్రియ రంగప్రవేశం చేసింది. ఈ పరిణామం పట్ల మనదేశంలోని మేధావుల్లో, ప్రజాస్వామ్య వాదుల్లో, అభ్యుదయ శక్తుల్లో ఆందోళన మొదలైంది. ఇటువంటి ఆందోళనే మహారాష్ట్రలోని కొంతమందిని ఒక దగ్గరకు చేర్చింది. వోట్ ఫర్ డెమోక్రసీ (వీఎఫ్‌డీ) అనే వేదిక తయారైంది.
వీఎఫ్‌డీ అనే వేదికపైకి కొందరు వ్యక్తులతోపాటు కొన్ని సంస్థలు కూడా చేరుకున్నాయి. దేశంలో జరిగిన మొన్నటి సాధారణ ఎన్నికల ఫలితాలు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ వేదిక కూడా మినహాయింపు కాదు. కానీ వీఎఫ్‌డీ మాత్రం ఆశ్చర్యంలోనే మునకేసి ఉండకుండా ఒక ముందడుగు వేసింది. ఎన్నికల ప్రక్రియను ఆసాంతం అధ్యయనం చేసి ఒక 225 పేజీల నివేదికను ఈమధ్యనే ఆ సంస్థ విడుదల చేసింది. ఈ నివేదికలో పొందుపరిచిన పలు అంశాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మన ప్రజాస్వామ్య ప్రక్రియ పవిత్రతను సహేతుకంగా శంకిస్తున్నాయి.
ఈవీఎమ్‌ల పనితీరుపైనా, పారదర్శకతపైనా అనుమానాలు, అభ్యంతరాలు పాతవే. వీడీఎఫ్ కేవలం సందేహాలకు మాత్రమే పరిమితం కాకుండా పోలింగ్ సందర్భంగా, కౌంటింగ్ సందర్భంగా జరిగిన అవకతవకలను ఎత్తిచూపింది. ఎన్నికల ప్రక్రియకు ముందు ఎన్నికల సంఘంలో జరిగిన అసాధారణ మార్పులను ఎండగట్టింది. ప్రక్రియ ముగిసేవరకూ ఎన్నికల సంఘం అవలంభించిన ఏకపక్ష ధోరణిని నిర్ధారించింది. ఫలితాల ప్రకటనలోని అసమంజసత్వాన్ని వెలికి తీసింది.
సాధారణంగా పోలింగ్ ముగిసిన అనంతరం సాయంత్రం ఏడు లేదా ఎనినిమిది గంటలకల్లా పోలింగ్ శాతాలను ఎన్నికల సంఘం ప్రకటించడం రివాజు. ఎక్కడైనా కొన్ని బూత్‌లలో పోలింగ్ ఆలస్యంగా జరిగితే అవి కూడా కలుపుకొని రాత్రి ఆలస్యంగా గానీ, అరుదుగా మరుసటిరోజు గానీ తుది పోలింగ్ శాతాన్ని ఈసీ ప్రకటిస్తూ వస్తున్నది. ఈ పెరిగిన ఓటింగ్ శాతం గతంలో ఎన్నడూ కూడా ఒక శాతాన్ని మించిన అనుభవాలు లేవు. ఈసారి మాత్రం ఏడు దశల పోలింగ్‌లోనూ అసాధారణ పెరుగుదల నమోదైంది. కనిష్ఠంగా 3.2 శాతం నుంచి గరిష్ఠంగా 6.32 శాతం వరకు పెరుగుదల ఈ ఏడు దశల్లో కనిపించింది.
గరిష్ఠంగా నాలుగో దశ పోలింగ్‌లో 6.32 శాతం పెరుగుదల నమోదైంది. ఈ దశలోనే పోలింగ్ జరుపుకున్న ఆంధ్రప్రదేశ్‌లో 12.54 శాతం, ఒడిశాలో 12.48 శాతం పెరుగుదల కనిపించడంపై వీఎఫ్‌డీ విస్మయం వ్యక్తం చేసింది. మన చెవుల్లో పెద్దపెద్ద తామర పువ్వులుంటే తప్ప ఈసీ చేసిన ఈ దారుణమైన ఓటింగ్ పెంపును నమ్మడం కష్టం. పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత, తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించడం మరింత విభ్రాంతిని కలిగించే విషయం. ఇంత అసాధారణ స్థాయిలో పోలింగ్ శాతాల పెరుగుదలపై వచ్చిన సందేహాలకు ఇప్పటివరకు ఎన్నికల సంఘం సరైన వివరణ ఇవ్వలేదనే సంగతిని దృష్టిలో ఉంచుకోవాలి.
ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్ జరిగితేనో, లేక పోలింగ్ జరిగిన ఈవీఎమ్‌ల బదులు కౌంటింగ్‌లో కొత్త మిషన్లు వచ్చి చేరితేనో తప్ప ఈ అసాధారణ పెరుగుదల సాధ్యంకాదని వీఎఫ్‌డీ అభిప్రాయపడింది. కనుక ఈ పెరిగిన ఓట్లను బోగస్ ఓట్లుగా అది పరిగణించింది. ఈవీఎమ్‌లలో ఏదో ఇంద్రజాలం జరిగిందనడానికి మరో దృష్టాంతాన్ని కూడా వీఎఫ్‌డీ నిర్ధారించింది. తుది ప్రకటన చేసిన పోలైన ఓట్లకూ, కౌంట్ చేసిన ఓట్లకూ మధ్య భారీ వ్యత్యాసాలు కనిపించాయి.
కొన్నిచోట్ల కౌంట్ చేసిన ఓట్లు పెరిగాయి. మరికొన్ని చోట్ల తగ్గాయి. ఇదెలా సాధ్యమవుతుంది? ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 3,500 నుంచి 6,500 వరకు ఓట్లు కౌంటింగ్ సమయానికల్లా తగ్గిపోయాయి. ఇటువంటి నియోజకవర్గాలు దేశవ్యాప్తంగా 174 ఉన్నాయని వీఎఫ్‌డీ తెలియజేసింది.
వీఎఫ్‌డీ సంస్థ బోగస్‌గా పరిగణించిన ఓట్ల కంటే తక్కువ తేడాతో ఎన్డీఏ గెలిచిన సీట్లను వాస్తవానికి ప్రతిపక్షాలు గెలవాల్సిన సీట్లుగా వర్గీకరించారు. రాష్ట్రాలవారీగా పెరిగిన బోగస్ ఓట్ల మొత్తాన్ని ఆ రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాలకు సమానంగా విభజించిన అనంతరం ఆ సంఖ్య కంటే తక్కువ తేడాతో ఓడిపోయిన సమీప ప్రత్యర్థిని అసలైన విజేతగా వీఎఫ్‌డీ లెక్కకట్టింది. ఈ లెక్కన 79 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి ఓడిపోవాల్సింది.
వీఎఫ్‌డీ గణిత సమీకరణం ప్రకారం ఒడిశాలో బీజేడీ, ఆంధ్రలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం పోలైన ఓట్లలో 49 లక్షల పైచిలుకు ఓట్లను బోగస్‌గా ఆ సంస్థ పరిగణించింది. ఆ ఓట్లను మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల మధ్య సమంగా పంచితే ఇరవై ఎనిమిదవేలవుతుంది. అంతకంటే తక్కువ తేడాతో వైసీపీ ఓడిపోయిన నియోజకవర్గాల సంఖ్య 77. గెలిచిన 11 వీటికి జత చేస్తే మొత్తం 88. అంటే సింపుల్ మెజారిటీ.
వీఎఫ్‌డీ సంస్థ ఆషామాషీగా బోగస్ ఓట్ల సంఖ్యను నిర్ధారించలేదు. అనుమానించడానికి హేతుబద్ధమైన అనేక ఉదంతాలను అది ఉదహరించింది. షెడ్యూల్ ప్రకటనకు కొద్దిరోజుల ముందే అరుణ్ గోయల్ అనే కమిషనర్ ఎందుకు తప్పుకున్నారని ప్రశ్నించింది. షెడ్యూల్ ప్రకటనకు ఒకరోజు ముందు కమిషనర్లుగా ఇద్దరు అధికారులు చేరారు. వీరిలో ఒక అధికారి పూర్వాశ్రమంలో అమిత్‌షా దగ్గర అధికారిగా పని చేశారనీ, మరొక అధికారి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి వద్ద పనిచేశారని ఆ సంస్థ వెల్లడించింది.
పోలింగ్ ముగిసిన వెంటనే పార్టీ ఏజెంట్లకు ఇవ్వాల్సిన 17–సి ఫామ్‌లను ఎంతమంది ఏజెంట్లకు ఇచ్చారో తెలపగలరా అని ఆ సంస్థ సవాల్ చేసింది. ఈవీఎమ్‌ల వారీగా ఫామ్ 17–సీ లలో నమోదు చేసిన ఓటింగ్ వివరాలు కౌంటింగ్‌లో లెక్కించిన ఓట్లతో సరిపోల్చడానికి ఒక స్వతంత్ర అధ్యయనం జరగవలసిన అవసరం ఉన్నదని వీఎఫ్‌డీ అభిప్రాయపడింది.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంతవరకు ఈ బోగస్ ఓట్ల బాగోతం ఒక భాగం మాత్రమే. తొలి అంకం వేరే ఉన్నది. కూటమి నేతలు – యెల్లో మీడియా సంయుక్తంగా సాగించిన విష ప్రచారం, కూటమి ఇచ్చిన మోసపూరితమైన హామీలు ఈ భాగం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ఏపీలో కూటమి చేసింది దుష్ప్రచారమేనని మొన్నటి యూనియన్ బడ్జెట్‌తో తేలిపోయింది. ఏపీలో ప్రారంభించిన ఈ సంస్కరణ దేశమంతటా జరగాలని కేంద్రం కోరుతున్నది. అందుకోసం రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది.
జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, రాష్ట్రం దివాళా తీసిందని, శ్రీలంకలా మారిందని రాసిన రాతలకూ, కూసిన కూతలకూ అంతే లేదు. మొన్న యూనియన్ బడ్జెట్‌కు ముందురోజు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే జగన్ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణను కొనియాడటంతో యెల్లో కూటమి ముఖాన కళ్లాపి చల్లినట్టయింది. రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పు ఉన్నదని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో 10 లక్షల కోట్లని గవర్నర్ చేత చెప్పించారు. ఈ కుప్పిగంతులనూ, శ్వేతపత్రాల తప్పుడు తంతులనూ చీల్చి చెండాడుతూ వైసీపీ అధ్యక్షుడు ప్రెస్‌మీట్ పెడితే సమాధానం చెప్పడానికి ఇప్పటిదాకా ఏ యెల్లో మేధావీ ముందుకు రాకపోవడం గమనార్హం.
ఇసుక మీద నసిగిన వాగుడెంత?... రాజేసిన రాద్ధాంతమెంత? అప్పుడే మరిచిపోతామా? ఇసుక ధరలు అప్పటికంటే ఇప్పుడే ఎక్కువయ్యాయని ఊరూవాడా గగ్గోలు పెడుతున్నది. ఈ పబ్లిక్ టాక్‌ను అడ్రస్ చేయడానికి ఒక్క సర్కారీ సిపాయి కూడా ఇంతవరకు సాహసించలేదు. లిక్కర్ పాలసీ మీద వెళ్లగక్కిన ప్రచారం సంగతి సరేసరి. ఇప్పటివరకైతే అదే పాలసీ కొనసాగుతున్నది. దీన్నే కొనసాగిస్తారో, లేదంటే బెత్తెడు దూరానికో బెల్టు షాపు సుగంధాలు వెదజల్లిన తమ పాతకాలపు పాత పాలసీకి వెళ్తారో వేచి చూడాలి.
విషప్రచారాల ప్రస్తావనలోకి వెళ్తే దానికి అంతూదరీ ఉండదు. ఇక మోసపూరిత హామీల సంగతి మరో మహేంద్రజాల అధ్యాయం. ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగించడంతోపాటు సూపర్ సిక్స్ పేరుతో ఒక షట్సూత్ర వాగ్దాన మాలను ఓటర్ల మెడలో వేశారు. యువకులందరికీ నెలకు 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. బడికెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి 15 వేల రూపాయలిస్తామన్నారు. ప్రతి రైతుకూ ఏటా 20 వేల ఆర్థిక సాయమన్నారు. 19 నుంచి 59 సంవత్సరాల మధ్యనున్న ప్రతి మహిళకు నెలకు 1500 అందజేస్తామన్నారు. ప్రతి ఇంటికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమన్నారు. ప్రతి మహిళకూ ఉచిత బస్సు ప్రయాణమని నమ్మబలికారు.
ఇప్పటివరకు ఇందులో ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా తెలియదు. ఇది షట్సూత్ర హామీ కాదు షడయంత్ర ప్రయోగమని తేలడానికి ఎంతోకాలం పట్టలేదు. సాక్షాత్తూ శాసనసభలోనే స్వయంగా ముఖ్యమంత్రే ‘సూపర్ సిక్స్’ తూచ్ అని ప్రకటించారు. పైగా ఇది సాధ్యంకాదనే విషయాన్ని ప్రజల్లో ప్రచారం చేయాలని కూడా ఎమ్మెల్యేలను కోరారు. విష ప్రచారంతో, తప్పుడు హామీలతో ఓట్లడగడం కూడా ఓట్లను దొంగిలించడం కిందే లెక్క. వంచన కిందే లెక్క. రెండు రకాలుగా చోరీ చేసిన ఓట్లతోనే గద్దెనెక్కారు కనుక వారికి ప్రజల పట్ల బాధ్యత లేదనే విషయాన్ని వారే నిరూపించుకుంటున్నారు.
బాధ్యతల నుంచి తప్పుకోవడానికీ, హామీల అమలుకోసం జనం వీధుల్లోకి రాకుండా ఉండటానికే రెడ్‌బుక్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. శాసనసభలో విపక్ష నేతపై సభానాయకుడు వాడుతున్న భాష, వేస్తున్న నిందలు చాలా దిగజారిన స్థాయిలో ఉంటున్నాయి. హామీలు అమలుచేయపోతే ఎక్కడ తిరుగుబాటు వస్తుందోనన్న భయం ఆయన్ను వెంటాడుతున్నట్టు కనిపిస్తున్నది. ‘ఒక్క వేలు చూపి ఒరులను నిందించ వెక్కిరించు నిన్ను మూడు వేళ్లు’ అనే తెలుగు నానుడిని ఆయన గుర్తు చేసుకుంటే మేలు.
చంద్రబాబుకు కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామగారు ఎన్టీ రామారావు ఆయన గురించి ఏమన్నారో గుర్తు చేసుకుందామా? ‘‘చంద్రబాబు దుర్మార్గుడు... మేకవన్నె పులి, గాడ్సేనే మించినవాడు, అభినవ ఔరంగజేబు, అతడో మిడత. మూర్తీభవించిన పదవీకాంక్షాపరుడు, ప్రజాస్వామ్య హంతకుడు, కుట్రకు కొలువైనవాడు, గూడుపుఠాణీకే గురువు, మోసానికి మూలస్తంభం, గుండెల్లో చిచ్చుపెట్టినవాడు, గొడ్డుకన్నా హీనం, చీమల పుట్టలో పాములా చేరినవాడు... తమ్ముళ్లారా! చెల్లెళ్లారా! ఇదిగో మీ అన్నగా చెబుతున్నాను.’’ ఇవన్నీ ఎన్టీఆర్ డైలాగులే. ఆన్ రికార్డ్!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment