పెట్రోనెట్‌లో జీడీఎఫ్ వాటాల విక్రయం
10% వాటా విలువ రూ. 3,200 కోట్లు
న్యూఢిల్లీ: ద్రవీకృత సహజ వాయువు దిగుమతి సంస్థ.. పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ సంస్థలో తమకున్న మొత్తం 10 శాతం వాటాలు విక్రయించినట్లు ఫ్రాన్స్‌కి చెందిన జీడీఎఫ్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 7.5 కోట్ల షేర్లను అమ్మినట్లు పేర్కొంది. సగటున షేరు ఒక్కింటికి రూ.421.63 ధరతో లావాదేవీల మొత్తం విలువ రూ.3,162.22 కోట్లుగా ఉంటుందని జీడీఎఫ్ తెలిపింది. సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషస్, స్టిచ్‌టింగ్ డిపాజిటరీ ఏపీజీ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీ పూల్ తదితర సంస్థలు షేర్లను కొనుగోలు చేశాయి.
సిటీగ్రూప్ 1.05 కోట్ల షేర్లు, స్టిచ్‌టింగ్ డిపాజిటరీ 39.26 లక్షల షేర్లు కొన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన గెయిల్ ఇండియా, ఓఎన్‌జీసీ, ఐవోసీ, బీపీసీఎల్ నెలకొల్పిన పెట్రోనెట్... ప్రైవేట్ కంపెనీగా రిజిస్టరయ్యింది. నాలుగు ప్రమోటర్ సంస్థలకు తలో 12.5 శాతం వాటాలు ఉన్నాయి. తన వాటాలను కొనుగోలు చేయాలంటూ ప్రమోటర్ సంస్థలకు జీడీఎఫ్ ముందుగా ఆఫర్ ఇచ్చినా అవి ముందుకు రాకపోవడంతో ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా విక్రయించింది.