Petronet
-
పెట్రోనెట్ ఎల్ఎన్జీ, రానున్న 5 ఏళ్లలో రూ.40వేల కోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: పెట్రోనెట్ ఎల్ఎన్జీ వచ్చే ఐదేళ్ల కాలానికి భారీ విస్తరణ ప్రణాళికతో ఉంది. రూ.40,000 కోట్లతో దిగుమతుల సదుపాయాలను విస్తరించుకోవడం, కొత్త వ్యాపారాల్లోకి ప్రవేశించడం ద్వారా లాభాలను రూ.10,000 కోట్లకు తీసుకెళ్లనున్నట్టు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం పెట్రోనెట్ ఎల్ఎన్జీ గుజరాత్‌లోని దహేజ్, కేరళలోని కోచిలో రెండు ఎల్ఎన్జీ దిగుమతి కేంద్రాలను కలిగి ఉంది. పెట్రోకెమికల్స్ వ్యాపారంలోకి సైతం అడుగుపెట్టాలని చూస్తున్నట్టు సంస్థ వార్షిక నివేదిక తెలియజేస్తోంది. ‘‘వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల టర్నో వర్ సాధించాలి. పన్ను అనంతరం వార్షిక లాభం రూ.10,000 కోట్లుగా ఉండాలి. ఇందుకోసం రూ.40,000 కోట్ల పెట్టుబడులు పెట్టా లి’’అని పెట్రోనెట్ ఎల్ఎన్జీ ప్రణాళిక రచించుకుంది. దీన్ని సూచించే విధంగా ‘1–5–10– 40’ అనే విధానాన్ని వార్షిక నివేదికలో ప్రస్తావించింది. గడిచిన ఆర్థిక సంవత్సానికి పెట్రోనెట్ ఎల్ఎన్జీ లాభం రూ.3,352 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.43,169 కోట్లుగా నమోదైంది. ఈ ప్రకారం నికర లాభం రెండు రెట్ల మేర, ఆదాయం రెట్టింపు మేర పెంచుకోవాలన్నది సంస్థ వ్యూహంగా ఉంది. -
ఆ సంస్థలోని వాటాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: బీపీసీఎల్
న్యూఢిల్లీ: పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఇంద్రప్రస్థ గ్యాస్(ఐజీఎల్)లో గల వాటాల విక్రయంపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ప్రభుత్వ రంగ దిగ్గజం బీపీసీఎల్ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం బీపీసీఎల్‌లో మెజారిటీ వాటా విక్రయ సన్నాహాల్లో ఉన్న నేపథ్యంలో కంపెనీ తాజా వివరణ ఇచ్చింది. బీపీసీఎల్‌ను సొంతం చేసుకోనున్న కొత్త ప్రమోటర్ పెట్రోనెట్, ఐజీఎల్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ఇవ్వడంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి మినహాయింపును కోరామని, స్పందన వెలువడవలసి ఉన్నదని కంపెనీ సీఎఫ్‌వో వీఆర్కే గుప్తా పేర్కొన్నారు. బీపీసీఎల్‌కు ఐజీఎల్‌లో 22.5 శాతం, పెట్రోనెట్‌లో 12.5%చొప్పున వాటాలు న్నాయి. ఈ 2 కంపెనీలకూ ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం బీపీసీఎల్లోగల 52.98 శాతం వాటాను డిజిన్వెస్ట్ చేస్తున్న విషయం విదితమే. -
పెట్రోనెట్‌లో జీడీఎఫ్ వాటాల విక్రయం
10% వాటా విలువ రూ. 3,200 కోట్లు న్యూఢిల్లీ: ద్రవీకృత సహజ వాయువు దిగుమతి సంస్థ.. పెట్రోనెట్ ఎల్ఎన్జీ సంస్థలో తమకున్న మొత్తం 10 శాతం వాటాలు విక్రయించినట్లు ఫ్రాన్స్‌కి చెందిన జీడీఎఫ్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 7.5 కోట్ల షేర్లను అమ్మినట్లు పేర్కొంది. సగటున షేరు ఒక్కింటికి రూ.421.63 ధరతో లావాదేవీల మొత్తం విలువ రూ.3,162.22 కోట్లుగా ఉంటుందని జీడీఎఫ్ తెలిపింది. సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషస్, స్టిచ్టింగ్ డిపాజిటరీ ఏపీజీ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీ పూల్ తదితర సంస్థలు షేర్లను కొనుగోలు చేశాయి. సిటీగ్రూప్ 1.05 కోట్ల షేర్లు, స్టిచ్టింగ్ డిపాజిటరీ 39.26 లక్షల షేర్లు కొన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన గెయిల్ ఇండియా, ఓఎన్జీసీ, ఐవోసీ, బీపీసీఎల్ నెలకొల్పిన పెట్రోనెట్... ప్రైవేట్ కంపెనీగా రిజిస్టరయ్యింది. నాలుగు ప్రమోటర్ సంస్థలకు తలో 12.5 శాతం వాటాలు ఉన్నాయి. తన వాటాలను కొనుగోలు చేయాలంటూ ప్రమోటర్ సంస్థలకు జీడీఎఫ్ ముందుగా ఆఫర్ ఇచ్చినా అవి ముందుకు రాకపోవడంతో ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా విక్రయించింది. -
పెట్రోనెట్ గంగవరం టెర్మినల్‌లో హెచ్‌పీసీఎల్ కి వాటా!
న్యూఢిల్లీ: తూర్పు కోస్తాలో పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఏర్పాటు చేస్తున్న టెర్మినల్‌లో 11-15% వాటాను కొనుగోలు చేసే అవకాశమున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌పీసీఎల్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరంలో పెట్రోనెట్ రూ. 5,000 కోట్ల వ్యయంతో గ్యాస్ టెర్మినల్‌ను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ టెర్మినల్ 2018కల్లా పూర్తికాగలదని అంచనా. కాగా, వైజాగ్ రిఫైనరీకి భారీ స్థాయిలో గ్యాస్ కావలసి ఉన్నదని, దీంతో సహజంగానే తాము గంగవరం టెర్మినల్‌లో వాటా కొనుగోలుకి ఆసక్తి కనబరుస్తున్నామని హెచ్‌పీసీఎల్ అధికారి ఒకరు చెప్పారు. 8.33 మిలియన్ టన్నుల సామర్థ్యంగల వైజాగ్ రిఫైనరీని 15 మిలియన్ టన్నులకు హెచ్‌పీసీఎల్ విస్తరిస్తోంది. దీనికి 3 మిలియన్ టన్నుల గ్యాస్ అవసరం ఉంటుంది. నిజానికి గతంలో పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఏర్పాటుకు ప్రభుత్వ రంగ సంస్థలు ఒక కన్సార్షియంగా ఏర్పడ్డాయి. దీనిలో హెచ్‌పీసీఎల్ భాగస్వామి కాకపోవడంతో వాటాను కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం చర్చలు నిర్వహిస్తోంది. కన్సార్షియంలో భాగస్వాములైన ఐవోసీ, ఓఎన్జీసీ, గెయిల్, బీపీసీఎల్ విడిగా 12.5% చొప్పున పెట్రోనెట్‌లో వాటాను పొందాయి. గత నెలలో ఒమన్‌కు చెందిన ఆయిల్ శాఖ మంత్రి మహ్మద్ బిన్ సైతం గంగవరం టెర్మినల్‌లో 20% వాటాను కొనేందుకు ఆసక్తిని ప్రదర్శించారు. పెట్రోనెట్ గంగవరంలో 5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఎల్ఎన్జీ టెర్మినల్‌ను నిర్మిస్తోంది. రూ. 5,000 కోట్ల ఈ ప్రాజెక్ట్ 2018కల్లా పూర్తికాగలదని అంచనా. తమ కంపెనీలో వాటా కొనుగోలుకి హెచ్‌పీసీఎల్ చర్చలు నిర్వహిస్తున్నట్లు పెట్రోనెట్ ఫైనాన్స్ డెరైక్టర్ ఆర్కే గార్గ్ స్పష్టం చేశారు.