పెట్రోనెట్ గంగవరం టెర్మినల్‌లో హెచ్‌పీసీఎల్ కి వాటా! | HPCL to buy 11-15% stake in Petronet LNG’s east coast terminal | Sakshi
Sakshi News home page

పెట్రోనెట్ గంగవరం టెర్మినల్‌లో హెచ్‌పీసీఎల్ కి వాటా!

Published Thu, May 22 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM

HPCL to buy 11-15% stake in Petronet LNG’s east coast terminal

న్యూఢిల్లీ: తూర్పు కోస్తాలో పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ ఏర్పాటు చేస్తున్న టెర్మినల్‌లో 11-15% వాటాను కొనుగోలు చేసే అవకాశమున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌పీసీఎల్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని  గంగవరంలో పెట్రోనెట్ రూ. 5,000 కోట్ల వ్యయంతో గ్యాస్ టెర్మినల్‌ను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ టెర్మినల్ 2018కల్లా పూర్తికాగలదని అంచనా. కాగా, వైజాగ్ రిఫైనరీకి భారీ స్థాయిలో గ్యాస్ కావలసి ఉన్నదని, దీంతో సహజంగానే తాము గంగవరం టెర్మినల్‌లో వాటా కొనుగోలుకి ఆసక్తి కనబరుస్తున్నామని హెచ్‌పీసీఎల్ అధికారి ఒకరు చెప్పారు. 8.33 మిలియన్ టన్నుల సామర్థ్యంగల వైజాగ్ రిఫైనరీని 15 మిలియన్ టన్నులకు హెచ్‌పీసీఎల్ విస్తరిస్తోంది. దీనికి 3 మిలియన్ టన్నుల గ్యాస్ అవసరం ఉంటుంది.

నిజానికి గతంలో పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ ఏర్పాటుకు ప్రభుత్వ రంగ సంస్థలు ఒక కన్సార్షియంగా ఏర్పడ్డాయి. దీనిలో హెచ్‌పీసీఎల్ భాగస్వామి కాకపోవడంతో వాటాను కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం చర్చలు నిర్వహిస్తోంది. కన్సార్షియంలో భాగస్వాములైన ఐవోసీ, ఓఎన్‌జీసీ, గెయిల్, బీపీసీఎల్ విడిగా 12.5% చొప్పున పెట్రోనెట్‌లో వాటాను పొందాయి. గత నెలలో ఒమన్‌కు చెందిన ఆయిల్ శాఖ మంత్రి మహ్మద్ బిన్ సైతం గంగవరం టెర్మినల్‌లో 20% వాటాను కొనేందుకు ఆసక్తిని ప్రదర్శించారు. పెట్రోనెట్ గంగవరంలో 5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ను నిర్మిస్తోంది. రూ. 5,000 కోట్ల ఈ ప్రాజెక్ట్ 2018కల్లా పూర్తికాగలదని అంచనా. తమ కంపెనీలో వాటా కొనుగోలుకి హెచ్‌పీసీఎల్ చర్చలు నిర్వహిస్తున్నట్లు పెట్రోనెట్ ఫైనాన్స్ డెరైక్టర్ ఆర్‌కే గార్గ్ స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement