LNG Terminal
-
కాకినాడ పోర్టులో ఎల్ఎన్జీ టెర్మినల్
సాక్షి, అమరావతి: కాకినాడ డీప్ వాటర్ పోర్టులో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) టెర్మినల్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ముంబైకి చెందిన హెచ్.ఎనర్జీ సంస్థ అనుబంధ సంస్థ ఈస్ట్‌కోస్ట్ కన్సెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈసీపీఎల్) దీనిని నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఆ సంస్థ రెండు దశల్లో సుమారు రూ.5,400 కోట్ల పెట్టుబడి అంచనాతో భారీ ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తొలి దశ పనులు చేపట్టేందుకు ఈసీపీఎల్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. దీర్ఘకాలం కొనసాగేలా.. ఎల్ఎన్జీ టెర్మినల్ నిర్మాణానికి భారీ వ్యయం కానుండటంతో.. టెర్మినల్‌ను దీర్ఘకాలం కొనసాగించాల్సి ఉంటుంది. కాకినాడ డీప్‌వాటర్ పోర్టు (కేఎస్పీఎల్)ను 50 ఏళ్లపాటు నిర్వహించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కేఎస్పీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ పైన పదేళ్లపాటు పొడిగించే అవకాశం ఉంది. అయితే, కేఎస్పీఎల్ ఏర్పాటై 23 ఏళ్లు గడిచిపోగా.. ఇక 27 ఏళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటు చేయడానికి ఈస్ట్‌కోస్ట్ కన్సెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వెనుకంజ వేస్తోంది. కేఎస్పీఎల్ కన్సెషన్ సమయం అయినపోయిన తర్వాత కూడా టెర్మినల్ కొనసాగించే విధంగా ఏపీ మారిటైమ్ బోర్డు లేదా కన్సెషన్ పీరియడ్ తర్వాత వచ్చే కొత్త ఆపరేటర్‌తో కొనసాగించడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపడంతో ఎల్ఎన్జీ టెర్మినల్ తొలి దశ పనులను చేపట్టడానికి ఈసీపీఎల్ ముందుకొచ్చింది. తొలి దశలో రూ.1,800 కోట్ల పెట్టుబడులు కాకినాడ డీప్ వాటర్ పోర్టులో తొలి దశలో రూ.1,600 కోట్ల ఎల్ఎన్జీ టెర్మినల్, రూ.200 కోట్లతో ఎల్‌సీఎన్‌జీ స్టేషన్స్ నిర్మించే విధంగా ఏపీ మారిటైమ్ బోర్డుకు ఈస్ట్‌కోస్ట్ సంస్థ ప్రతిపాదనలు పంపింది. రెండో దశలో మరో రూ.3,600 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. కన్సెషన్ అగ్రిమెంట్‌పై స్పష్టత రావడంతో వర్షాకాలం తర్వాత ఈసీపీఎల్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో మురళీధరన్ ‘సాక్షి’కి వివరించారు. 5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటు చేస్తుండగా.. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉపాధి లభిస్తుంది. ఏటా 1 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ సరఫరా చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్ రూపంలో ఏటా రూ.1,200 కోట్ల ఆదాయంతో పాటు కాకినాడ డీప్ వాటర్ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వాటా రూపంలో మరో రూ.100 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందన్నారు. ఈ మధ్యనే గంగవరం పోర్టులో అత్యధిక వాటా కొనుగోలు చేసిన అదానీ గ్రూపు కూడా అక్కడ భారీ ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు మురళీధరన్ తెలిపారు. ఈ రెండు టెర్మినల్స్ అందుబాటులోకి వస్తే రాష్ట్ర ఖజానాకు వచ్చే15 ఏళ్లలో వ్యాట్ రూపంలో రూ.50 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. -
గ్యాస్ ఇన్ఫ్రాపై 60 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశీయంగా గ్యాస్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు 2024 నాటికి 60 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. 2030 నాటికి మొత్తం ఇంధనాల వినియోగంలో గ్యాస్ వాటాను 15 శాతానికి పెంచుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇది 6 శాతంగా ఉంది. ‘పైప్లైన్లు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) టెర్మినల్స్, సిటీ గ్యాస్ పంపిణీ (సీజీడీ) నెట్‌వర్క్‌లు మొదలైన గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై 2024 నాటికి 60 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయాలని నిర్దేశించుకున్నాం. గ్యాస్ ఆధారిత ఎకానమీగా భారత్‌ను తీర్చిదిద్దే దిశగా లక్ష్యాలు పెట్టుకున్నాం‘ అని అసోచాం ఫౌండేషన్ డే వీక్ 2020 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి తెలిపారు. సీజీడీ ప్రాజెక్టులను 400 జిల్లాల్లోని 232 ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు ఆయన వివరించారు. దీంతో భౌగోళికంగా 53 శాతం ప్రాంతాల్లో, దేశ జనాభాలో 70 శాతం మందికి సీజీడీ అందుబాటులోకి రాగలదని ప్రధాన్ పేర్కొన్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా 1,000 ఎల్ఎన్జీ ఫ్యూయల్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గత నెలలలోనే తొలిసారిగా 50 ఎల్ఎన్జీ ఇంధన స్టేషన్లకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి వివరించారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో చండికోల్, పాదూర్‌లలో మరో 6.5 మిలియన్ టన్నుల వాణిజ్య–వ్యూహాత్మక పెట్రోలియం స్టోరేజ్ కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. -
కాకినాడలో ఎల్ఎన్జీ టెర్మినల్
విజయవాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గెయిల్ కంపెనీల మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కాకినాడ-నెల్లూరు మధ్య గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. కాకినాడ టెర్మినల్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 48 శాతం వాటా ఉంటుందని వెల్లడించారు. ఏపీని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు తెలిపారు. -
పెట్రోనెట్ గంగవరం టెర్మినల్‌లో హెచ్‌పీసీఎల్ కి వాటా!
న్యూఢిల్లీ: తూర్పు కోస్తాలో పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఏర్పాటు చేస్తున్న టెర్మినల్‌లో 11-15% వాటాను కొనుగోలు చేసే అవకాశమున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌పీసీఎల్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరంలో పెట్రోనెట్ రూ. 5,000 కోట్ల వ్యయంతో గ్యాస్ టెర్మినల్‌ను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ టెర్మినల్ 2018కల్లా పూర్తికాగలదని అంచనా. కాగా, వైజాగ్ రిఫైనరీకి భారీ స్థాయిలో గ్యాస్ కావలసి ఉన్నదని, దీంతో సహజంగానే తాము గంగవరం టెర్మినల్‌లో వాటా కొనుగోలుకి ఆసక్తి కనబరుస్తున్నామని హెచ్‌పీసీఎల్ అధికారి ఒకరు చెప్పారు. 8.33 మిలియన్ టన్నుల సామర్థ్యంగల వైజాగ్ రిఫైనరీని 15 మిలియన్ టన్నులకు హెచ్‌పీసీఎల్ విస్తరిస్తోంది. దీనికి 3 మిలియన్ టన్నుల గ్యాస్ అవసరం ఉంటుంది. నిజానికి గతంలో పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఏర్పాటుకు ప్రభుత్వ రంగ సంస్థలు ఒక కన్సార్షియంగా ఏర్పడ్డాయి. దీనిలో హెచ్‌పీసీఎల్ భాగస్వామి కాకపోవడంతో వాటాను కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం చర్చలు నిర్వహిస్తోంది. కన్సార్షియంలో భాగస్వాములైన ఐవోసీ, ఓఎన్జీసీ, గెయిల్, బీపీసీఎల్ విడిగా 12.5% చొప్పున పెట్రోనెట్‌లో వాటాను పొందాయి. గత నెలలో ఒమన్‌కు చెందిన ఆయిల్ శాఖ మంత్రి మహ్మద్ బిన్ సైతం గంగవరం టెర్మినల్‌లో 20% వాటాను కొనేందుకు ఆసక్తిని ప్రదర్శించారు. పెట్రోనెట్ గంగవరంలో 5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఎల్ఎన్జీ టెర్మినల్‌ను నిర్మిస్తోంది. రూ. 5,000 కోట్ల ఈ ప్రాజెక్ట్ 2018కల్లా పూర్తికాగలదని అంచనా. తమ కంపెనీలో వాటా కొనుగోలుకి హెచ్‌పీసీఎల్ చర్చలు నిర్వహిస్తున్నట్లు పెట్రోనెట్ ఫైనాన్స్ డెరైక్టర్ ఆర్కే గార్గ్ స్పష్టం చేశారు.