సాక్షి, అమరావతి: నార్వేకు చెందిన క్రౌన్ ఎల్‌ఎన్‌జీ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. కాకినాడ వద్ద సముద్రంలో రూ.8,300 కోట్లతో ఫ్లోటింగ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) టెర్మినల్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. ఎల్‌ఎన్‌జీని దిగుమతి చేసుకుని దానిని రీగ్యాసిఫికేషన్ చేసి దేశంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేసే విధంగా 7.2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ టెర్మినల్‌ను అభివృద్ధి చేయనున్నట్లు క్రౌన్ ఎల్‌ఎన్‌జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్వపన్ కఠారియా ప్రకటించారు.
భారతదేశ పర్యటనకు వచ్చిన కఠారియా తాజాగా ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ 2028 నాటికి కాకినాడ వద్ద సముద్రంలో తేలియాడే ఎల్‌ఎన్‌జీ యూనిట్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తీవ్ర తుపానులు అధికంగా ఉండే ప్రాంతం కావడంతో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా ఈ టెర్మినల్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని, సాంకేతిక పరిజ్ఞానం కోసం పలు అంతర్జాతీయ సంస్థలతో క్రౌన్ ఎల్‌ఎన్‌జీ ఒప్పందం కుదుర్చుకుంటోందని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో ఆరు ఎల్‌ఎల్‌జీ టెర్మినల్స్ ఉండగా, ఇవి పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయడంలేదన్నారు. ప్రపంచంలో చౌకగా లభించే ఎల్‌ఎన్‌జీని దిగుమతి చేసుకుని రీగ్యాసిఫికేషన్ ప్రక్రియ నిర్వహించి తిరిగి సరఫరా చేసే విధంగా దేశంలోనే రెండో అతిపెద్ద టెర్మినల్‌గా కాకినాడ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కఠారియా వివరించారు.
ఎల్‌ఎన్‌జీకి పెరుగుతున్న డిమాండ్
దేశీయ ఇంధన అవసరాల్లో సహజవాయువు వినియోగాన్ని భారీగా పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకోవడంతో ఎల్‌ఎన్‌జీకి డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం దేశీయ ఇంధన అవసరాల్లో ఎల్‌ఎన్‌జీ వినియోగం 6 శాతంగా ఉందని, దానిని 2030 నాటికి 15 శాతానికి పెంచాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాది దేశవ్యాప్తంగా 20.2 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీ వినియోగం జరగ్గా, పదేళ్లలో ఇది 72.9 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
ఫిబ్రవరిలో రాష్ట్రానికి క్రౌన్ ఎల్‌ఎన్‌జీ ప్రతినిధుల బృందం
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్రౌన్ ఎల్‌ఎన్‌జీ ఆసక్తి చూపిస్తోందని, ఇప్పటికే తొలి దశ చర్చలు పూర్తయ్యాయని ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే నెలలో ఈ ప్రాజెక్టుపై పూర్తిస్థాయి స్పష్టత వస్తుందని చెప్పారు. ఫిబ్రవరిలో క్రౌన్ ఎల్‌ఎన్‌జీ ప్రతినిధుల బృందం రాష్ట్ర పర్యటనకు రానుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment