TSRTC Making ECO Friendly Electric AC Buses Available to Passengers - Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు వచ్చేస్తున్నాయ్! రేపే ప్రారంభోత్సవం

Published Mon, May 15 2023 3:40 PM | Last Updated on Mon, May 15 2023 4:56 PM

TSRTC Making Eco Friendly Electric AC Buses Available To Passengers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ).. వాటిలో 10 బస్సులను మంగళవారం నుంచి వాడకంలోకి తెస్తోంది. మిగతా బస్సులు ఈ ఏడాది చివరినాటికి విడతల వారీగా అందుబాటులోకి వస్తాయి. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించే ఈ బస్సులకు ‘ఈ-గరుడ’ గా సంస్థ నామకరణం చేసింది.

హైటెక్ హంగులతో ప్రయాణికులకు వీటిని అందుబాటులోకి తెచ్చామని, హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించామని సంస్థ ప్రకటించింది. రాబోయే రెండేళ్లలో కొత్తగా 1860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపింది. వాటిలో 1300 బస్సులను హైదరాబాద్ సిటీలో, 550 బస్సులను సుదూర ప్రాంతాలకు నడుపుతామని పేర్కొంది. హైదరాబాద్ లో 10 డబుల్ డెక్కర్ బస్సులను త్వరలోనే ప్రారంభిస్తామని వివరించింది. హైదరాబాద్ లో ఈ కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల ప్రారంభోత్సవం రేపు జరగనుంది. మియాపూర్ క్రాస్ రోడ్ సమీపంలోని పుష్ఫక్ బస్ పాయింట్ వద్ద మంగళవారం సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ బస్సుల ప్రారంభోత్సవానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తో కలిసి “ఈ-గరుడ” బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు ప్రత్యేకతలివే! 12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు హైటెక్ హంగులతో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. 41 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు రీడిండ్‌ ల్యాంప్‌ లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్‌ బటన్‌ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూంనకు అనుసంధానం చేయడం జరుగుతుంది.

ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్‌ బ్యాకప్‌ ఉంటుంది. బస్సులోని ప్రయాణికులను లెక్కించే ఆటోమెటిక్ ప్యాసింజర్ కౌంటర్(ఏపీసీ) కెమెరా కూడా ఉంది. బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం బస్సుల్లో ఉంటుంది. ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు.

(చదవండి: రానున్న 10 ఏళ్లలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలు: కేటీఆర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement