కాలుష్య రహితంగా అమరావతి
ప్రణాళిక రూపొందించాలని సీఆర్‌డీఏకు సీఎం ఆదేశం
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. అమరావతి నగరంలో ఎలక్ట్రిల్ వాహనాలే తిరిగేలా అమరావతి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ప్లాన్ రూపొందించాలని సూచించారు. శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో రాజధానిలో నిర్మిస్తున్న రోడ్లు, పరిపాలన, విద్యా నగరాల నిర్మాణంపై సీఆర్‌డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ సేకరణలో ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాల నుంచి ఎదురైన అవరోధాలను అధిగమిస్తున్నామని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ చెప్పారు. ఒకవేళ ఇంకా ఎవరైనా తమ భూముల్లో సాగు చేసుకుంటామంటే రానున్న కాలంలో వారి భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించకుండా ఆ ప్రాంతం మొత్తాన్ని గ్రీన్ బెల్ట్ కింద ప్రకటిస్తామని చెప్పారు.
పరిపాలనా నగరం మాస్టర్‌ప్లాన్ దాదాపు పూర్తయిందని, వచ్చే వారంలో దీన్ని ప్రభుత్వానికి అందిస్తామని నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ చెప్పారని కమిషనర్ శ్రీధర్ తెలిపారు. సమావేశంలో విట్, అమృత, ఎస్‌ఆర్‌ఎం, ఎన్‌ఐడీ తదితర విద్యా సంస్థల ప్రతినిధులు తమ కార్యకలాపాల పురోగతిని వివరించారు. విట్ వర్సిటీ భవనాల నిర్మాణం వేగంగా జరుగుతోందని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిలో విశ్వ విద్యాలయానికి కాంపౌండ్ వాల్స్ ఉండవని, నగరంలో భాగంగా ఉంటాయని తెలిపారు.